టీవీలో గేమ్ ఛేంజర్ సినిమా.. నిర్మాత ఏమన్నారంటే..

ఈ ఘటనపై టాలీవుడ్ నిర్మాత ఎస్‌కేఎన్ (శ్రీనివాస్ కుమార్) తన ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ చిత్ర పరిశ్రమ భవిష్యత్తుపై ఆందోళన వ్యక్తం చేశారు.

Update: 2025-01-16 11:38 GMT

రామ్ చరణ్ హీరోగా, శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారీ చిత్రం గేమ్ ఛేంజర్ ను టాలీవుడ్ అగ్ర నిర్మాత దిల్ రాజు భారీ బడ్జెట్ తో నిర్మించిన విషయం తెలిసిందే. ఇప్పటివరకు దిల్ రాజు ఏ సినిమాకు ఖర్చు చేయనంత ఈ సినిమాకు ఖర్చు చేశారు. ఇక ఈ సినిమా పట్ల ప్రేక్షకులలో టాక్ ఎలా ఉన్నా కూడా ఒక విషయంలో మాత్రం ఇండస్ట్రీని కలవర పరిచింది. అసలే మిక్స్ డ్ టాక్ తో కలెక్షన్స్ తగ్గుతున్న క్రమంలో పైరసీ ఎఫెక్ట్ తీవ్ర ప్రభావం చూపించింది.

సినిమా విడుదలైన కొన్ని రోజుల్లోనే అనూహ్యంగా తెలిగ్రామ్ లో దర్శనమిచ్చింది. HD ప్రింట్స్ కూడా లీక్ అవ్వడం మరో షాకింగ్ విషయం. ముఖ్యంగా ఒక లోకల్ టీవీ చానల్‌లో ప్రసారం కావడం కలకలం రేపింది. ఈ ఘటనపై టాలీవుడ్ నిర్మాత ఎస్‌కేఎన్ (శ్రీనివాస్ కుమార్) తన ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ చిత్ర పరిశ్రమ భవిష్యత్తుపై ఆందోళన వ్యక్తం చేశారు.

ఎస్‌కేఎన్ తన సోషల్ మీడియాలో మాట్లాడుతూ, “సినిమా నిర్మాణం అనేది కేవలం హీరో, దర్శకుడు, నిర్మాతలకే పరిమితం కాదు. ఇది వేలాది మంది కలల ఫలితం, నాలుగు సంవత్సరాల కష్టానికి ఫలితంగా తయారవుతుంది. కానీ, ఇలా అక్రమంగా సినిమాలను ప్రసారం చేయడం ఎంతోమంది జీవితాలను ప్రభావితం చేస్తుంది. డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు తమ పెట్టుబడులను నమ్ముకుని పని చేస్తారు. వారి కోసం కూడా ఓసారి ఆలోచించాలి,” అని ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ అంశం కేవలం గేమ్ ఛేంజర్ మాత్రమే కాదు, మొత్తం చిత్ర పరిశ్రమకు ముప్పుగా మారిందని ఆయన హెచ్చరించారు. అలాగే, “ప్రభుత్వాలు ఇలాంటి చర్యలను ఆపేందుకు ముందుకు రావాలి. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవడం అవసరం. మన పరిశ్రమను కాపాడేందుకు అందరూ కలిసి పని చేయాలి,” అంటూ #SaveTheCinema అనే హ్యాష్ ట్యాగ్‌ను జోడించారు.

ఇక గేమ్ ఛేంజర్ చిత్ర బృందం గతంలోనే కొన్ని కీలక సన్నివేశాలను లీక్ చేస్తామని బెదిరించిన వారిపై సైబర్ క్రైమ్‌కు ఫిర్యాదు చేసింది. విడుదలకు రెండు రోజుల ముందు సినిమాకు సంబంధించిన కీలక సన్నివేశాలను సోషల్ మీడియాలో షేర్ చేసి, ఆన్‌లైన్‌లో లీక్ చేసినట్లు పేర్కొన్నారు. ఈ ఘటనపై చిత్ర బృందం సుమారు 45 మంది వ్యక్తులతో కూడిన ముఠాపై ఆధారాలతో సహా ఫిర్యాదు చేసింది.

సినిమాను నష్టపరిచేందుకు సామాజిక మాధ్యమాల్లో నెగెటివిటీ స్ప్రెడ్ చేసే సోషల్ మీడియాల ఖాతాలపైనా చిత్ర బృందం ఫిర్యాదు చేసింది. ఈ ఘటనలు పరిశ్రమపై ప్రతికూల ప్రభావం చూపుతాయని, తద్వారా చిన్న నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్ల భవిష్యత్తు ప్రమాదంలో పడుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ సమస్యపై అధికారులు కఠినమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని పరిశ్రమ ప్రముఖులు అంటున్నారు.

Tags:    

Similar News