బేబి డైరెక్టర్ జాక్ పాట్.. అప్పుడు MG.. ఇప్పుడు బెంజ్
బేబి డైరెక్టర్ జాక్ పాట్ కొట్టాడు .. అప్పుడు MG కార్.. ఇప్పుడు బెంజ్ కార్ గిఫ్టందుకున్నాడు. ఇవి రెండూ రెండు వేర్వేరు సినిమాల కోసం కాదు. ఒకే సినిమా కోసం నిర్మాత నుంచి అందిన కానుకలు.
బేబి డైరెక్టర్ జాక్ పాట్ కొట్టాడు .. అప్పుడు MG కార్.. ఇప్పుడు బెంజ్ కార్ గిఫ్టందుకున్నాడు. ఇవి రెండూ రెండు వేర్వేరు సినిమాల కోసం కాదు. ఒకే సినిమా కోసం నిర్మాత నుంచి అందిన కానుకలు. ఇదెట్టా? అంటారా.. అవును ఇది నిజమే. సాయి రాజేష్ దర్శకత్వంలో వచ్చిన 'బేబీ' ఈ ఏడాది కల్ట్ బ్లాక్ బస్టర్ మూవీగా సూపర్ సక్సెస్ అందుకుంది. ఈ చిత్రంలో ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య, విరాజ్ అశ్విన్ ప్రధాన పాత్రలు పోషించారు. మాస్ మూవీ మేకర్స్ పతాకంపై ఎస్కేఎన్ ఈ చిత్రాన్ని నిర్మించారు.
బేబీ సినిమా కలెక్షన్లు అసాధారణం. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద 90 కోట్లకు పైగా వసూలు చేసింది. కలెక్షన్స్ మాత్రమే కాదు.. అగ్ర హీరోలు, నిర్మాతలు, విమర్శకుల నుండి ఈ చిత్రం గొప్ప ప్రశంసలను అందుకుంటుంది. మెగాస్టార్ చిరంజీవి, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, విజయ్ దేవరకొండ సహా ప్రముఖ స్టార్ హీరోల నుండి ప్రత్యేక ప్రశంసలను అందుకుంది. ఈ చిత్రంతో సాయి రాజేష్ దర్శకుడిగా పరిచయం అయ్యాడు. అతడు తన రచనతోను ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. సినిమాను కచ్చితత్వంతో తెరకెక్కించడంలో పెద్ద విజయం సాధించాడు.
దర్శకుడిగా సాయి రాజేష్ నైపుణ్యానికి, అతడు ఇచ్చిన భారీ విజయానికి ఇప్పుడు అరుదైన కానుకలు అందాయి. నిర్మాత ఎస్‌కెఎన్ స్వయంగా సాయి రాజేష్‌కు నేడు బెంజ్ కారును బహుమతిగా ఇచ్చారు. బేబీ సినిమా విడుదలకు ముందే హడావిడి చూసి కాన్ఫిడెన్స్‌తో దర్శకుడు సాయి రాజేష్‌కి ఎంజీ హెక్టర్ కారును అందించారు నిర్మాత ఎస్‌కేఎన్. ఇప్పుడు రెండో కార్ ను బహుమతిగా ఇవ్వడం ఆశ్చర్యం కలిగిస్తోంది. రిలీజ్ ముందే కార్ గిఫ్ట్ అందుకున్న సాయి రాజేష్ హిట్టు కొట్టాక మరో ఖరీదైన కార్ అందుకోవడం ఇంట్రెస్టింగ్. ఇండస్ట్రీలోకి రాకముందు నుంచి ఎస్కేఎన్, సాయి రాజేష్ మంచి స్నేహితులు. బేబీ మూవీ విజయం వారి స్నేహం, ఒకరిపై ఒకరికి నమ్మకం ఎలాంటివో నిరూపించింది. థియేటర్‌లో సూపర్ హిట్‌గా నిలిచిన బేబీ చిత్రానికి ఓటీటీలోనూ రికార్డు స్థాయిలో వ్యూస్ వచ్చాయి. సాయి రాజేష్ తదుపరి చిత్రం కూడా మాస్ మూవీ మేకర్స్ ఆధ్వర్యంలో SKN నిర్మాతగా తెరకెక్కనుంది.
దర్శకనిర్మాత సాయి రాజేష్ తన 'కలర్ ఫోటో' చిత్రం 68వ జాతీయ చలనచిత్ర అవార్డులలో ఉత్తమ ఫీచర్ ఫిల్మ్ (తెలుగు) కేటగిరీలో జాతీయ అవార్డును గెలుచుకున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం 2020 సంవత్సరంలో నేరుగా OTTలో విడుదలైంది. ఈ చిత్రం గొప్ప విజయాన్ని ప్రశంసలను అందుకుంది.