నటిని పెళ్లాడే ముందు రెడ్ హ్యాండెడ్‌గా దొరికాడు!
నటి సోమీ ... వివాహానికి కొన్ని వారాల ముందు సంగీతా బిజ్లానీని సల్మాన్ ఖాన్ మోసం చేశాడని వెల్లడించింది.
సంజయ్ దత్ నుండి సైఫ్ అలీ ఖాన్ వరకు 90ల నాటి అతి పెద్ద స్టార్స్‌తో స్క్రీన్ స్పేస్‌ను షేర్ చేస్కున్న అందాల కథానాయిక సోమీ అలీ, సల్మాన్ ఖాన్‌తో తనకున్న అనుబంధం గురించి.. గతంలో అతడు మహిళలతో ఎలా ప్రవర్తించాడనే దాని గురించి ఎప్పుడూ ఓపెన్ గా డిబేట్ పెడుతుంటారు. సల్మాన్ తో సంబంధంలో ఉన్న సమయంలో తాను ఎదుర్కొన్న వేధింపుల గురించి సోమీ ఓపెనైంది. ఇటీవలి ఇంటర్వ్యూలో నటి సోమీ ... వివాహానికి కొన్ని వారాల ముందు సంగీతా బిజ్లానీని సల్మాన్ ఖాన్ మోసం చేశాడని వెల్లడించింది. సంగీత అతని జీవితంలోని ఒక మహిళ మాత్రమేనని ఇంకా ఎందరో ఉన్నారని వ్యాఖ్యానించింది.
అంతేకాదు.. ''కర్మ తిరిగి వస్తుంది.. దాని ప్రతిఫలం అనుభవించి తీరాలి'' అని కూడా సోమీ వ్యాఖ్యానించింది. రిలేషన్ షిప్ లో ఉన్న సమయంలోనే సల్మాన్ ఖాన్ తనను కూడా మోసం చేశాడని సోమీ అలీ వెల్లడించారు. ఆజ్ తక్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో సోమీ అలీ మాట్లాడుతూ -''వెడ్డింగ్ కార్డ్‌లు ప్రింట్ అయ్యాయి. కానీ సంగీత నా అపార్ట్ మెంట్లో నాతో ఉన్న సల్మాన్‌ను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుంది.
సంగీతకు సల్మాన్ ఏం చేశాడో, నాకూ అదే జరిగింది. దీన్నే కర్మ అంటారు. నేను కొంచెం పెద్దయ్యాక దాని గురించి అర్థం చేసుకున్నాను'' అని సోమీ వ్యాఖ్యానించింది. సల్మాన్ ఖాన్ సంగీతా బిజ్లానీని 90లలో వివాహం చేసుకోవలసి ఉంది. అప్పటికే ఆమెతో సల్మాన్ కి నిశ్చితార్థం జరిగింది.
తన సోషల్ మీడియా పోస్ట్‌లలో సోమీ అలీ తరచుగా సల్మాన్ తో తన స్నేహానుబంధం గురించి చెబుతుంటారు. తాను సల్మాన్ అభిమానిగా బాలీవుడ్‌లోకి ఎలా ప్రవేశించిందో అతడి విషయంలో ఎప్పుడూ ఎలా విస్మయంతో ఉండేదో కూడా వెల్లడించారు. సల్మాన్ తమ సంబంధాన్ని బహిరంగపరచడానికి ఆసక్తి చూపలేదని ప్రజల దృష్టిలో కేవలం శృంగార సంబంధంగానే ఇది కనిపించిందని, అయితే తాము ఎనిమిదేళ్లు కలిసి ఉన్నామని సోమీ వెల్లడించింది. అంతేకాకుండా ఒక ఈవెంట్ సమయంలో తన జుట్టుపై శీతల పానీయం పోయడంతో పాటు, అనేక సందర్భాల్లో బహిరంగంగా తనను సల్మాన్ ఎలా కించపరిచాడో.. ఎలా అవమానించాడో కూడా వెల్లడించింది.