వేధింపులు నిజమే.. నా ప్రకటనకు కట్టుబడ్డాను
మాలీవుడ్‌లో `హేమ కమిటీ` నివేదిక ప్రకంపనాలు కొనసాగుతున్నాయి.
మాలీవుడ్‌లో `హేమ కమిటీ` నివేదిక ప్రకంపనాలు కొనసాగుతున్నాయి. పలువురు మేల్ ఆర్టిస్టులపై ఇప్పటికే కేసులు నమోదయ్యాయి. ఇంకా నమోదవుతూనే ఉన్నాయి. ఇంతకుముందు ప్రముఖ మలయాళీ హీరో జయసూర్యపైనా సహనటి ఆరోపించిన సంగతి తెలిసిందే. కేసు దర్యాప్తు కొనసాగుతోంది.
తోటి మలయాళ నటుడు జయసూర్యపై లైంగిక వేధింపుల కేసు నమోదు చేసిన నటి సోనియా మల్హార్ తనకు బెదిరింపులు ఎదురయ్యాయని, వాటికి లొంగేది లేదని తాజా ప్రకటనలో మీడియాకు తెలిపారు. నిందితుడు జయసర్య `తప్పుడు ఆరోపణలు` అని కొట్టి పారేస్తున్నారు...చట్టపరమైన చర్యలు తీసుకుంటామని బెదిరిస్తున్నారు... అయినా వెనక్కి తగ్గబోనని నటి సోనియా అన్నారు. అతడు (జయసూర్య) నావి తప్పుడు ఆరోపణలు అంటున్నాడు. ఇది తప్పుడు ఆరోపణ కాదు. నా ప్రకటన చాలా నిజం. చాలా స్పష్టంగా ఉంది. ఇది నా జీవితంలో నేను దాఖలు చేసిన మొదటి ఎఫ్‌ఐఆర్! అని నటి సోనియా మలార్ జాతీయ మీడియాకు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో చెప్పారు. దశాబ్దాలుగా లైంగిక వేధింపులు, దోపిడీలు ప్రబలంగా ఉన్న మలయాళ చిత్ర పరిశ్రమ చీకటి కోణాలను జస్టిస్ హేమ కమిటీ నివేదిక వెల్లడించిన తర్వాత మాట్లాడిన అనేక మంది మహిళా నటీమణులలో సోనియా మల్హార్ ఒకరు.
మరో #మీటూ కేసును ఎదుర్కొంటున్న జయసూర్య ఈరోజు తనపై వచ్చిన ఆరోపణలన్నింటినీ ఖండించారు. తన పేరు చెప్పిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని బెదిరించారు. ``అబద్ధం ఎల్లప్పుడూ నిజం కంటే వేగంగా ప్రయాణిస్తుంది.. కానీ నిజం గెలుస్తుందని నేను నమ్ముతున్నాను. నా నిర్దోషిత్వాన్ని నిరూపించడానికి అన్ని చట్టపరమైన చర్యలు కొనసాగుతాయి`` అని ఇన్‌స్టా పోస్ట్‌లో పేర్కొన్నాడు.
హేమా కమిటీ నివేదిక వచ్చినప్పుడు తాను ఒక న్యూస్ ఛానెల్‌లో తనకు ఎదురైన కష్టాలను వివరించానని, అయితే వేధించిన వ్యక్తి పేరు చెప్పలేదని సోనియా మల్హార్ అన్నారు. అయితే సోషల్ మీడియాలో పలు పుకార్లు రావడంతో ఆమె జయసూర్య పేరును ప్రస్తావించాల్సి వచ్చింది. ``సోషల్ మీడియాలో ఈ సమస్య బ్లాస్ట్ అయింది. నేను లంచం తీసుకుని మాట్లాడుతున్నానని ప్రజలు పేర్కొన్నారు.. కాబట్టి నా పరువు కాపాడుకోవడానికి నేను జయసూర్య పేరును చెప్పాల్సి వచ్చింది`` అని శ్రీమతి మల్హార్ మీడియాకు చెప్పారు. ``నేను ఆ హీరో ముఖాన్ని బయటపెట్టాను... లేకుంటే నా పరువు కూడా పోతుంది.. నేను కేసును మూసివేస్తే.. అది నాకు మంచిది కాదు`` అని కూడా పేర్కొంది. తాను వెనక్కి తగ్గబోనని, న్యాయం కోసం తన పోరాటాన్ని కొనసాగిస్తానని నటి మల్హార్ చెప్పింది.
లైంగిక వేధింపులకు సంబంధించిన విస్తృత ఆరోపణలను బహిర్గతం చేసిన జస్టిస్ హేమ కమిటీ నివేదిక విడుదలైన తర్వాత మలయాళ చిత్ర పరిశ్రమలో మీటూ ఉద్యమం ఊపందుకుంది. 235 పేజీల సమగ్ర నివేదిక సాక్షులు, నిందితుల పేర్లతో విడుదల అయింది. పరిశ్రమ వాస్తవ పరిస్థితులపై చాలా కోణాల్లో మహిళా ఆర్టిస్టులకు ఎదురయ్యే ఇబ్బందులను బహిర్గతం చేసింది. 10-15 మంది ప్రభావవంతమైన నిర్మాతలు, దర్శకులు, నటులతో కూడిన సమూహం మలయాళ చిత్ర పరిశ్రమను నియంత్రిస్తోందని హేమ కమటీ నివేదిక వెల్లడించింది. ఈ ఆరోపణల అనంతరం మలయాళ సినీ ఆర్టిస్టుల సంఘం (అమ్మా) అధ్యక్షుడు మోహన్‌లాల్ తన ప్యానెల్ సహా రాజీనామా చేశారు. ఆరోపణలకు నైతిక బాధ్యత వహిస్తూ అడ్మినిస్ట్రేటివ్ ప్యానెల్ రాజీనామా చేసినట్లు `అమ్మ` తెలిపింది. మలయాళ పరిశ్రమను నాశనం చేయొద్దని, కమిటీని గౌరవించి సహకరిస్తున్నామని, అయితే పరిశ్రమను నియంత్రించే గ్రూపులో తాను లేనని మోహన్ లాల్ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే.