టాలీవుడ్ విలన్ వింతైన ప్రకటన
ఈ సినిమాని భారతదేశం అంతటా సుమారు 2500 స్క్రీన్లలో రిలీజ్ చేయడం విశేషం అనుకుంటే, దాని స్థాయిలో వసూళ్లు రాలేదన్నది పెద్ద నిరాశ.
టాలీవుడ్ విలన్ సోనూసూద్ ప్రధానపాత్రలో నటించి, దర్శకత్వం వహించిన `ఫతే` చిత్రం ఈ సంక్రాంతి బరిలో విడుదలై డిజాస్టర్ గా మారింది. ఈ సినిమా టీజర్, ట్రైలర్ లు భీతావహమైన రక్తపాతం, హింసతో భయపెట్టడంతో ఫ్యామిలీ ఆడియన్స్ థియేటర్ల వైపు చూడలేదు. ఫలితంగా ఈ సినిమాకి తొలి మూడు రోజుల్లో 7.25 కోట్లు వసూలైంది. నాలుగో రోజు 75లక్షల వరకూ రాబట్టిందని సమాచారం. ఈ సినిమాని భారతదేశం అంతటా సుమారు 2500 స్క్రీన్లలో రిలీజ్ చేయడం విశేషం అనుకుంటే, దాని స్థాయిలో వసూళ్లు రాలేదన్నది పెద్ద నిరాశ. మాస్ ఆదరించకపోయి ఉంటే, కనీసం ఈ వసూళ్లు కూడా కష్టమేనని ట్రేడ్ విశ్లేషించింది.
తొలి దర్శకత్వ వెంచర్ పై ఎన్నో ఆశలు పెట్టుకున్న సోనుసూద్ ఫలితం నిరాశపరిచినా కానీ బింకాన్ని కనబరచడంలో వెనకాడటం లేదు. నా సినిమా హిట్టు అన్న తీరుగా అతడు మీడియా ముందు సందేశాలిస్తున్నారు. అంతేకాదు.. గత కొంతకాలంగా బాలీవుడ్ సూపర్ స్టార్లు సల్మాన్ ఖాన్, షారూఖ్ ఖాన్ ల పేర్లను తన ప్రచారంలో ఉపయోగించుకుంటున్నాడు.
ఇప్పుడు మరో ముందడుగు వేసి అతడు తెరకెక్కించనున్న సీక్వెల్ `ఫతే 2`లో ఆ ఇద్దరూ కలిసి నటిస్తారని కూడా ప్రకటించేసాడు. షారూఖ్, సల్మాన్ సినిమాల్లో కీలక పాత్రల్లో నటించిన అతడికి వారితో సాన్నిహిత్యం ఉందన్నది కాదనలేని నిజం. అలాగని ఆల్రేడీ డిజాస్టరైన సినిమాకి సీక్వెల్ తీస్తాననడం, అందులో సల్మాన్, షారూఖ్ నటిస్తారని అనడం విడ్డూరంగా ఉందంటూ నెటిజనులు కామెంట్ చేస్తున్నారు. ఆ ఇద్దరూ ఫతే 2లో అతిథులుగా నటిస్తారని అతడు వ్యాఖ్యానించినా కానీ, అసలు సీక్వెల్ ఉండాలి కదా? అని సందేహిస్తున్నారు.