51 వయసులో హీరో అయ్యాడు.. ఖాన్‌లు, రజనీకాంత్‌నే కొట్టేశాడు!
దేశంలోని పెద్ద స్టార్ల కంటే ఎక్కువ సంపదల్ని కలిగి ఉన్న అతడు మరెవరో కాదు.. శరవణన్ అరుల్.
వినోద పరిశ్రమలో తమదైన ముద్ర వేయడంలో విఫలమైన చాలా మంది భారతీయ నటులు తరువాత సంస్థల్ని ప్రారంభించి వ్యవస్థాపకులుగా మారడానికి సినిమాలను విడిచిపెట్టారు. ఏదేమైనా ఒక వ్యాపారవేత్తగా రాణించి అటుపై 51ఏళ్ల వయసులో నటుడిగా మారిన ఒక ఎంటర్‌ప్రెన్యూర్ కథ నిజంగానే ఆశ్చర్యపరుస్తుంది. చిరంజీవి, షారూఖ్, సల్మాన్, ప్రభాస్ కంటే ఎక్కువ కార్లను కలిగి ఉన్నాడు. దేశంలోని పెద్ద స్టార్ల కంటే ఎక్కువ సంపదల్ని కలిగి ఉన్న అతడు మరెవరో కాదు.. శరవణన్ అరుల్. లెజెండ్ శరవణన్ అని కూడా పిలుస్తారు.
శరవణన్ అరుల్ తమిళనాడుకు చెందిన ప్రముఖ బిజినెస్‌మేన్. ప్రఖ్యాత శరవణ స్టోర్స్ అధినేత. 51 వయసులో కోలీవుడ్‌లో హీరోగా అరంగేట్రం చేశాడు. `ది లెజెండ్` పేరుతో ఒక సినిమా తీసాడు. జెడి జెర్రీ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో ఊర్వశి రౌతేలా, వివేక్, యోగి బాబు, సుమన్, నాజర్, విజయకుమార్ వంటి అగ్రతారలు నటించారు. పెద్ద స్టార్లు నటించినప్పటికీ బాక్సాఫీస్ వద్ద ఘోర వైఫల్యం ఎదుర్కొంది. కానీ శరవణన్‌ను స్టార్ ని చేసింది. ప్రజలకు సుపరిచితం చేసింది. తమిళం-తెలుగులో ఈ సినిమా విడుదలైంది.
శరవణన్ దక్షిణాదిన పాపులర్ షాపింగ్ కాంప్లెక్స్ చైన్ వ్యవస్థ అయిన శరవణ స్టోర్స్ యజమాని. ఈ సంస్థ 2021-22 ఆర్థిక సంవత్సరం నాటికి 2500 కోట్ల రూపాయల టర్నోవర్ కలిగి ఉంది. ఇది దేశంలో తన విభాగంలో అతిపెద్ద స్టోర్‌గా నిలిచింది. ఇది మాత్రమే కాదు.. 2022 లో థియేటర్లలో విడుదలైన శరవణన్ తొలి చిత్రం `ది లెజెండ్`ను శరవణ స్టోర్స్ సంస్థ నిర్మించింది. ఈ సినిమా పారితోషికం కలుపుకుని అతడి వద్ద రూ .150 కోట్ల నికర ఆస్తులు ఉన్నాయని సమాచారం.
ఇది కాకుండా శరవణన్ కి లగ్జరీ కార్లంటే మక్కువ. గ్యారేజీలో వాటికి లెక్కే లేదు. భారతదేశంలోని ప్రముఖ స్టార్లు ఎవరికీ లేనన్ని కార్లు శరవణన్ ఇంటి గ్యారేజ్ లో కొలువు దీరి ఉన్నాయి. ముగ్గురు ఖాన్లు, అల్లు అర్జున్ లేదా రజనీకాంత్ కంటే ఎక్కువ కార్లను సొంతం చేసుకున్న గ్రేట్ బిజినెస్ మేన్ అతడు. మూడు రోల్స్ రాయిస్ సెడాన్లు, లంబోర్ఘిని హురాకాన్, ఫెరారీ 488, బెంట్లీ కాంటినెంటల్ జిటి, ఆస్టన్ మార్టిన్ డిబి 11, లంబోర్ఘిని ఉరుస్, బెంట్లీ ఫ్లయింగ్ స్పర్, పోర్స్చే 911 టర్బో ఎస్ వంటి కార్లు శరవణన్ సొంతం.
ప్రస్తుతం శరవణన్ అరుల్ తన సినిమా లెజెండ్ కి సీక్వెల్ కథాంశంతో `లెజెండ్ 2`తో తిరిగి రావడానికి సిద్ధంగా ఉన్నారని కథనాలొస్తున్నాయి. ఈ ప్రాజెక్ట్ కథ పూర్తిగా కాశ్మీర్ నేపథ్యంలో తిరుగుతుంది. దాదాపు 100 కోట్ల మేర బడ్జెట్ పెడుతున్నారని సమాచారం. ఈ చిత్రం ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉంది.