శ్రీలీల స్వీయ నియంత్రణ...!
ధమాకా హిట్ తర్వాత శ్రీలీల బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేసే అవకాశం దక్కించుకుంది.
రాఘవేంద్రరావు కొత్త పెళ్లి సందడి సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన ముద్దుగుమ్మ శ్రీలీల. ఆ సినిమా నిరాశ పరిచిన కూడా హీరోయిన్ గా అందరి దృష్టిని ఆకర్షించింది. మొదటి సినిమాతో ఫ్లాప్ అవ్వడంతో శ్రీలీల కెరీర్ గురించి కొందరు అనుమానాలు వ్యక్తం చేశారు. కానీ శ్రీలీల మాత్రం వచ్చిన అవకాశాలను చేసుకుంటూ వెళ్ళింది. రవితేజ తో చేసిన ధమాకా సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకోవడంతో పాటు, ఆ సినిమాలోని మాస్ డాన్స్ తో శ్రీలీల మాస్ ఆడియన్స్ దృష్టిన ఆకర్షించి, వారికి ఫేవరెట్ గా మారింది. ధమాకా వల్ల వరుస ఆఫర్లు వచ్చాయి.
ధమాకా హిట్ తర్వాత శ్రీలీల బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేసే అవకాశం దక్కించుకుంది. ఆమె కూడా కథ ల విషయంలో పట్టింపు లేకుండా, దర్శకుడు, హీరో ఎవరు అనే విషయాన్ని పరిగణలోకి తీసుకుని సినిమాలు చేయడం మొదలు పెట్టింది. అయితే కొన్ని సినిమాలు నిరాశ పరచడంతో పాటు, కొన్ని సినిమాలు తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నాయి. దాంతో శ్రీలీల కొత్త సినిమాల ఎంపిక విషయంలో కాస్త జాగ్రత్త పాటించాలనే నిర్ణయానికి వచ్చినట్లుగా తెలుస్తోంది. అందులో భాగంగానే ఈ మధ్య కాలంలో తన వద్దకు వచ్చిన కొన్ని ఆఫర్లను సున్నితంగా తిరస్కరించిందట.
ప్రస్తుతం తెలుగు లో రెండు సినిమాలు, తమిళ్ లో ఒక సినిమాను చేస్తున్న శ్రీలీల బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అవుతుందని సమాచారం అందుతోంది. హిందీ లో సిద్దార్థ్ మల్హోత్ర కు జోడీగా సినిమాను చేయబోతుంది. ఆ సినిమాను అక్టోబర్ లో ప్రారంభించబోతున్నట్లుగా తెలుస్తోంది. మరో వైపు మిట్టి సినిమా లో కూడా శ్రీలీల నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట. ఆ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ ఇప్పటికే ముగింపు దశకు చేరుకుంది. ఇక తెలుగు లో ఈమె నటిస్తున్న సినిమాలు కూడా వివిధ దశల్లో ఉన్నాయి.
ఎక్కువ సినిమాల్లో నటించే అవకాశాలు వస్తున్నప్పటికీ శ్రీలీల స్వీయ నియంత్రణ పాటిస్తున్నట్లుగా తెలుస్తోంది. నటిగా ఎక్కువ సినిమాలు చేయడం కంటే కూడా మంచి సినిమాలు మంచి పాత్రలు చేయాలి అనే ఉద్దేశ్యంతో ఈ అమ్మడు ఉన్నట్లు తెలుస్తోంది. అందుకే ఇటీవల వచ్చిన స్టార్ హీరో సినిమాలోని ఐటెం సాంగ్ ఆఫర్ ను కూడా సున్నితంగా తిరస్కరించిందట. ముందు ముందు పెద్ద హీరోల సినిమాల్లో మంచి పాత్రలతో శ్రీలీల రావాలని ఆశ పడుతోంది. మరి అది ఎంతవరకు సాధ్యం, స్వీయ నియంత్రణ వల్ల శ్రీలీల కెరీర్ కి ఎంత ప్లస్ అవుతుంది అనేది చూడాలి.