ఇప్పటికీ ఎవరినీ గుర్తు పట్టలేకపోతున్న శ్రీతేజ్
శ్రీతేజ్ హెల్త్ కండిషన్ ను పరిశీలించాక అతడిని కొన్నాళ్ల పాటూ వెంటిలేటర్ పై ట్రీట్‌మెంట్ అందించాలని డాక్టర్లు తేల్చి చెప్పారు.
పుష్ప2 రిలీజ్ ముందు రోజు అంటే డిసెంబర్ 4న సంధ్య థియేటర్ దగ్గర జరిగిన తొక్కిసలాట దుర్ఘటన గురించి అందరికీ తెలుసు. మెయిన్ థియేటర్ కావడంతో మామూలుగానే అక్కడికి ఎక్కువ మంది ఆడియన్స్ వస్తారు. దానికి తోడు ఆ రోజు హీరో కూడా వస్తున్నాడని తెలిసి థియేటర్ వద్దకు భారీ సంఖ్యలో అభిమానులు వచ్చారు.
దీంతో అక్కడ తొక్కిసలాట జరిగింది. వారిలో బన్నీని చూడ్డానికి వచ్చిన రేవతి అక్కడికక్కడే మృతి చెందగా, ఆమె కొడుకు శ్రీతేజ్ తీవ్రంగా గాయపడి ఊపిరి కోల్పోయాడు. క్షణాల్లో సీపీఆర్ అందడం వల్ల శ్రీతేజ్ బతికాడు. తర్వాత అతడిని సికింద్రాబాద్ కిమ్స్ కు తరలించారు. శ్రీతేజ్ హెల్త్ కండిషన్ ను పరిశీలించాక అతడిని కొన్నాళ్ల పాటూ వెంటిలేటర్ పై ట్రీట్‌మెంట్ అందించాలని డాక్టర్లు తేల్చి చెప్పారు.
ఇవాల్టికి శ్రీతేజ్ హాస్పిటల్ లో జాయిన్ అయి 57 రోజులవుతుంది. అయినా కూడా అతని ఆరోగ్య పరిస్థితి మెరుగుపడినట్టు కనిపించడం లేదు. శ్రీతేజ్ కళ్లు తెరిచి ఎక్కువ సేపు నిలకడగా అయితే ఉండగలుగుతున్నాడు కానీ ఎవరినీ గుర్తు పట్టలేకపోతున్నాడని, కనీసం అతని కుటుంబ సభ్యుల్ని కూడా శ్రీతేజ్ గుర్తుపట్టట్లేదని తెలుస్తోంది.
ఇప్పటికీ అతనికి ఆహారం లిక్విడ్ రూపంలోనే అందిస్తున్నారనీ, అది కూడా ఓ పైపు ద్వారా మాత్రమేనని తెలుస్తోంది. ఇప్పటికే దాదాపు రెండు నెలలైనప్పటికీ శ్రీతేజ్ ఆరోగ్య పరిస్థితి ఇంకెన్నాళ్లకు నయమవుతుందనేది డాక్టర్లు కూడా చెప్పలేకపోతున్నారు. అల్లు అర్జున్ పై ఉన్న వీరాభిమానం వల్లే శ్రీతేజ్, తన ఫ్యామిలీ ఆ రోజు సంధ్య థియేటర్‌కు వచ్చిన విషయం తెలిసిందే.
ఈ దుర్ఘటనకు కారణం అల్లు అర్జునే అని తెలంగాణ ప్రభుత్వం అతనిపై సీరియస్ అవడమే కాకుండా బన్నీని అరెస్ట్ కూడా చేసింది. ఆ తర్వాత బన్నీ బెయిల్ పై బయటకు వచ్చాడు. ఈ దుర్ఘటన కారణంగా పుష్ప2 బ్లాక్ బస్టర్ హిట్ అయినా ఆ సక్సెస్ ను ఎంజాయ్ చేయలేక అల్లు అర్జున్ చాలా ఇబ్బందులు పడుతున్నట్టు అల్లు అరవింద్ తెలిపాడు.