మెగా 'దసరా' చూపిస్తారా..?
ఫస్ట్ రెండు సినిమాలు నానితో ట్రై చేసిన శ్రీకాంత్ ఈసారి మెగాస్టార్ చిరంజీవిని గురి పెట్టుకున్నాడని తెలుస్తుంది.
ఒకప్పుడు స్టార్ తో సినిమా అంటే ఆ డైరెక్టర్ కు ఎన్నో ఏళ్ల అనుభవం హిట్ జాబితా కంపల్సరీ ఉండేది. కానీ ఇప్పుడు సరైన కథతో సినిమాను చెప్పినట్టుగా తీయగలడు అన్న నమ్మకం ఉంటే చాలు కొత్త పాత అనే తేడా లేకుండా.. సీనియర్ జూనియర్ అనే లెక్కలు వేయకుండా ఆఫర్లు ఇచ్చేస్తున్నారు. అసలే ఇప్పుడు యువ దర్శకులంతా కొత్త కథలు.. అద్భుతమైన నరేషన్ స్కిల్స్ తో ఆడియన్స్ ని థ్రిల్ చేస్తున్నారు. అలా కథ తో కథనంతో మెప్పించే వారికి అవకాశాలు ఎప్పుడూ ఉంటాయి. ఆ క్రమంలో ఒక సినిమా అనుభవం ఉన్న దర్శకుడు ఏకంగా మెగాస్టార్ నే మెప్పించే కథ సిద్ధం చేశాడని తెలుస్తుంది.
ఇంతకీ ఎవరా దర్శకుడు అంటే దసరాతో నానికి మాస్ ఇమేజ్ వచ్చేలా చేసిన సక్సెస్ ఫుల్ డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల. సుకుమార్ దగ్గర అసిస్టెంట్ గా పనిచేసిన శ్రీకాంత్ నానికి దసరా కథ చెప్పినప్పుడు తొలి సినిమా దర్శకుడు కాబట్టి ఒక సీన్ టెస్ట్ షూట్ చేసి తీసుకురా అని చెప్పగా ఆ పరీక్షలో పాసై దసరా ఛాన్స్ అందుకున్నాడు. ఇక నాని కెరీర్ లో దసరా సృష్టించిన సంచలనాలు తెలిసిందే.
ఐతే దసరా తర్వాత మళ్లీ శ్రీకాంత్ తన సెకండ్ సినిమా కూడా నానితోనే చేస్తున్నాడు. పారడైస్ టైటిల్ తో రాబోతున్న ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్ నడుస్తుంది. ఇదిలా ఉంటే శ్రీకాంత్ తన థర్డ్ సినిమా ప్రయత్నాలు మొదలు పెట్టినట్టు తెలుస్తుంది. ఫస్ట్ రెండు సినిమాలు నానితో ట్రై చేసిన శ్రీకాంత్ ఈసారి మెగాస్టార్ చిరంజీవిని గురి పెట్టుకున్నాడని తెలుస్తుంది. శ్రీకాంత్ ఓదెల చిరుకి సూటయ్యే కథ రెడీ చేయగా చిరంజీవి కూడా ఆ కథ విన్నారన్న టాక్ నడుస్తుంది.
అసలే రొటీన్ సినిమాలు చేస్తున్నాడన్న ముద్ర నుంచి బయట పడేందుకు మెగాస్టార్ కొత్త ప్రయత్నాలు చేయాలని చూస్తున్నాడు. భోళా శంకర్ తర్వాత అందుకే వశిష్టతో విశ్వంభర చేస్తున్నాడు. ఈ సినిమా తర్వాత చిరు ఎవరితో చేస్తాడన్న సస్పెన్స్ ఉంది. కానీ శ్రీకాంత్ ఓదెలతో చిరు సినిమా ఉండబోతుందని లేటెస్ట్ ఫిల్మ్ నగర్ టాక్. అదే జరిగితే మాత్రం శ్రీకాంత్ ఓదెల నెక్స్ట్ స్టార్ డైరెక్టర్స్ లిస్ట్ లో చేరినట్టే లెక్క. ఇంతకీ మెగా బాస్ కోసం శ్రీకాంత్ ఎలాంటి కథ సిద్ధం చేశాడు.. చిరుని ఎలా చూపిస్తాడు అన్నది మాత్రం ప్రస్తుతానికి సస్పెన్సే.