'SSMB 29' కథ ఆ పుణ్యక్షేత్రంలో మొదలవుతుందా?

మహేశ్ బాబుతో ఆఫ్రికన్ ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ యాక్షన్ అడ్వెంచర్ మూవీ చేయబోతున్నట్లు ఇప్పటికే క్లారిటీ వచ్చేసింది.

Update: 2024-11-13 05:55 GMT

సూపర్ స్టార్ మహేష్ బాబు, డైరెక్టర్ ఎస్.ఎస్ రాజమౌళి కాంబినేషన్ లో తెరకెక్కనున్న గ్లోబ్ ట్రాటింగ్ మూవీ కోసం యావత్ సినీ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 'SSMB 29' 'SSRMB' వంటి వర్కింగ్ టైటిల్స్ తో పిలుచుకుంటున్న ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్‌ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. అయితే ఇప్పుడు ఈ చిత్రానికి సంబంధించి ఓ ఇంట్ర‌స్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

మహేశ్ బాబుతో ఆఫ్రికన్ ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ యాక్షన్ అడ్వెంచర్ మూవీ చేయబోతున్నట్లు ఇప్పటికే క్లారిటీ వచ్చేసింది. దీనికి తగ్గట్టుగానే లొకేషన్ల వేట కొనసాగుతోంది. అయితే ఈ స్టోరీ వార‌ణాసి నేప‌థ్యంలో మొద‌లవుతుంద‌ని టాక్‌ వినిపిస్తోంది. ఆ తరువాత క‌థ సౌత్ ఆఫ్రికాకు షిఫ్ట్ అవుతుంద‌ని అంటున్నారు. వార‌ణాసి షెడ్యూల్ మొత్తాన్ని సెట్ లోనే పూర్తి చేయాల‌ని రాజ‌మౌళి భావిస్తున్నారట. దీని కోసం హైద‌రాబాద్ లోనే ఓ భారీ సెట్ ను ఏర్పాటు చేయనున్నారని సమాచారం.

SSMB29 సినిమాకి మైథలాజికల్ టచ్ ఇస్తారనే ప్రచారం జరుగుతున్న తరుణంలో.. వారణాశి నేపథ్యంలో కథ ఉంటుందనే టాక్ రావడం అందరిలో ఆసక్తిని కలిగిస్తోంది. ఎందుకంటే భారతదేశపు అతి ప్రాచీన నగరాల్లో ఒకటైన వారణాసి.. హిందువులకు అత్యంత పవిత్రమైన పుణ్య క్షేత్రంగా వెలుగొందుతోంది. అలాంటి ప్రాంతాన్ని జక్కన్న తన సినిమాలో భాగం చేస్తున్నారంటే, కచ్ఛితంగా ఇతిహాసాలు హిందూ పురాణాల స్ఫూర్తితో ఈ కథ సిద్ధం చేశారని భావించవచ్చని అభిమానులు అంటున్నారు.

మహేష్ - రాజమౌళి సినిమా స్క్రిప్ట్ వర్క్ కంప్లీట్ అయింది. సినిమా బ్యాక్ డ్రాప్ కి తగ్గట్టుగా ఎక్కువ భాగం షూటింగ్ ఫారెస్ట్ లో జరగనుంది. అడ్వెంచర్ యాక్షన్ సీన్స్ కి అధిక ప్రాధాన్యత ఉండబోతోంది. అందుకే ద‌ట్ట‌మైన అట‌వీ ప్ర‌దేశాల్లో రాజమౌళి రెక్కీ నిర్వ‌హించారు. ఈ మధ్య కెన్యాలోని అంబోసెలి నేషనల్ పార్క్‌ను సందర్శించారు. ఏయే స‌న్నివేశాలు ఎక్క‌డెక్క‌డ తీయాలనే విష‌యం మీద టీమ్ ఈపాటికే ఓ అంచ‌నాకు వచ్చినట్లుగా టాక్.

SSMB29 చిత్రానికి రాజమౌళి తండ్రి విజయేంద్రప్రసాద్‌ కథ అందిస్తున్నారు. మామూలుగా ఓ స్టోరీ రాయడానికి రెండు వారాల టైమ్ పడితే, మహేష్ బాబు కోసం కథ రెడీ చెయ్యడానికి రెండేళ్లు పట్టిందని రచయిత ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. జనవరిలో షూటింగ్ ప్రారంభం అవుతుందని తెలిపారు. ఫిబ్ర‌వ‌రి నుంచి ఈ మూవీ రెగ్యుల‌ర్ షూటింగ్ స్టార్ట్ అయ్యే అవ‌కాశాలు ఉన్నాయి. త్వరలోనే ఈ ప్రాజెక్ట్ ను అనౌన్స్ చేసి, అన్ని వివరాలను వెల్లడించనున్నారు.

సెట్స్ మీదకు వెళ్ళకముందే ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. సూప‌ర్ స్టార్‌తో రాజమౌళి ఎలాంటి అద్భుతం సృష్టిస్తాడో అని అంతా ఆశ‌గా ఎదురు చూస్తున్నారు. మహేష్ బాబు ఈ సినిమా కోసం చాలా కష్టపడుతున్నారు. మునుపెన్నడూ చూడని సరికొత్త లుక్ లో కనిపించబోతున్నారు. జక్కన్న సైతం ఈ ప్రాజెక్ట్ ను హాలీవుడ్ రేంజ్ లో రూపొందించాలని ప్లాన్ చేస్తున్నారు. అందుకే ప్రీ ప్రొడక్షన్ కు తగినంత సమయం తీసుకుంటున్నారు.

ఎంఎం కీరవాణి సంగీతం సమకూరుస్తున్న ఈ చిత్రాన్ని దుర్గా ఆర్ట్స్‌ బ్యానర్ పై కె.ఎల్‌.నారాయణ నిర్మిస్తున్నారు. ప్రముఖ హలీవుడ్ సంస్థ నిర్మాణంలో భాగం అవుతుందని టాక్. దాదాపు 1000 కోట్ల భారీ బడ్జెట్‌ తో ఈ సినిమా తీస్తారని ప్రచారం జరుగుతోంది. పాన్ ఇంటర్నేషనల్ మూవీగా భారతీయ భాషలతో పాటు, పలు ఫారిన్ లాంగ్వేజెస్ లోనూ ఈ చిత్రాన్ని విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి.

Tags:    

Similar News