60 ప్ల‌స్ హీరోల తెలివైన గేమ్ ప్లాన్

ప్ర‌తి హీరోకి త‌మ‌కంటూ ఒక ఫ్యాన్ బేస్ ఉంటుంది. అది బాక్సాఫీస్ వ‌సూళ్ల‌కు ప్ర‌ధాన బ‌లంగా మారుతుంది.

Update: 2024-09-06 02:30 GMT

ప్ర‌తి హీరోకి త‌మ‌కంటూ ఒక ఫ్యాన్ బేస్ ఉంటుంది. అది బాక్సాఫీస్ వ‌సూళ్ల‌కు ప్ర‌ధాన బ‌లంగా మారుతుంది. ఇటీవ‌ల మ‌ల్టీస్టార‌ర్లలో న‌టించ‌డానికి సౌతిండియ‌న్ స్టార్లు ఆస‌క్తి చూప‌డం అన్ని విధాలా క‌లిసొచ్చే ప‌రిణామం. గ‌తంతో పోలిస్తే వ‌ర్త‌మానంలో పాన్ ఇండియా ట్రెండ్ స్టార్ల అవ‌కాశాల వెల్లువ‌ను అమాంతం పెంచింది. ఈ ప‌రిణామం సీనియ‌ర్ హీరోల ఎక్స్‌ప‌యిరీ డేట్‌ని ఎక్స్ టెంట్ చేసింది. ఒక వ‌య‌సు దాటాక కొంద‌రికి అవకాశాలు ద‌క్క‌డం చాలా క‌ష్టం. కానీ ఇప్ప‌టి ట్రెండ్‌లో సీనియ‌ర్ ల‌కు వ‌య‌సుతో సంబంధం లేకుండా అవ‌కాశాలొస్తున్నాయి. అలాగే సోలోగా ఒక్క హీరోనే సినిమా మొత్తాన్ని త‌మ భుజ‌స్కంధాల‌పై న‌డిపించేయాల‌నే అత్యాశ కూడా ఇటీవ‌ల పెద్ద‌గా క‌నిపించ‌డం లేదు.

ఏది ఏమైనా ఈ ప‌రిణామం 60 ప్ల‌స్ హీరోల‌కు బాగా క‌లిసొస్తోంది. `క‌ల్కి 2989 ఏడీ`లో ప్ర‌భాస్ ప్ర‌ధాన‌ హీరోనే అయినా 70 ప్ల‌స్ అమితాబ్ బ‌చ్చ‌న్ సినిమా క‌థంతా న‌డిపించారు. పాన్ ఇండియా ట్రెండ్ క‌ల్పించిన అవ‌కాశమిది. జైల‌ర్ లో ర‌జ‌నీకాంత్ సైతం మోహన్‌లాల్, శివ రాజ్‌కుమార్, జాకీ ష్రాఫ్ వంటి స్టార్ల‌కు అవ‌కాశం క‌ల్పించి వారిని అద‌న‌పు ఆయుధాలుగా మ‌లుచుకోగ‌లిగారు. 60 ప్ల‌స్ ర‌జ‌నీకి వారంతా ప్ర‌ధాన అస్సెట్. లాల్, జాకీ కూడా 60 ప్ల‌స్ హీరోలు. అయితే ఇత‌ర పెద్ద హీరోల‌కు త‌మ సినిమాలో పెద్ద పాత్ర‌ల్లో అవ‌కాశాలు క‌ల్పించ‌డం అంటే దానికి నిజంగా ధైర్యం అవ‌స‌రం. ర‌జనీ ఈ విషయంలో భేష‌జానికి పోలేదు. తదుప‌రి లోకేష్ క‌న‌గ‌రాజ్ తో `కూలీ`లోను నాగార్జున (65), ఉపేంద్ర (55), సత్యరాజ్ (69) వంటి పెద్ద స్టార్ల‌కు ర‌జ‌నీకాంత్ అవ‌కాశం క‌ల్పించారు. వీరంతా కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారా? కేవ‌లం అతిథులుగానే క‌నిపిస్తారా? అన్న‌దానిపై క్లారిటీ లేదు.

ఒక వేళ విక్ర‌మ్ సినిమాలో క‌మ‌ల్ (69)- సేతుప‌తి-ఫ‌హ‌ద్ పాత్ర‌ల్లా నాగ్, ఉపేంద్ర‌, స‌త్య‌రాజ్ పాత్ర‌లు కుదిరాయంటే ర‌జ‌నీ సినిమా రేంజు మ‌రో లెవ‌ల్ కి చేరిపోతుంద‌న‌డంలో ఎలాంటి సందేహం లేదు. తీస్తున్న‌ది లోకేష్ క‌న‌గ‌రాజ్ కాబ‌ట్టి అభిమానుల‌కు ఆమాత్రం గురి ఉంది. బంగారం స్మగ్లింగ్ మాఫియా క‌థాంశం కాబ‌ట్టి భారీగా యాక్ష‌న్ కి అవ‌కాశం ఉంటుంది. కూలీ వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది. లోకేష్ మ‌రోసారి త‌న గ‌త బ్లాక్ బ‌స్ట‌ర్ల రేంజులో అద్భుత క‌థాంశం, గ్రిప్పింగ్ నేరేష‌న్ తో ర‌క్తి క‌ట్టిస్తాడ‌నే అంతా ఆశిస్తున్నారు. ఓవ‌రాల్ గా ర‌జ‌నీకాంత్- నాగార్జున‌- మోహ‌న్ లాల్ లాంటి సౌత్ అగ్ర హీరోలు ఇత‌ర సీనియ‌ర్ హీరోల‌ను క‌లుపుకుని పోవ‌డం స‌రికొత్త గేమ్ ప్లాన్. ఇది వ‌ర్క‌వుటైతే ఇదే స్టార్లు రిపీటెడ్ గా సినిమాలు చేసినా ఆశ్చ‌ర్య‌పోన‌వ‌స‌రం లేదు. మ‌న ద‌ర్శ‌క‌ర‌చ‌యిత‌లు ఇలాంటి పాపుల‌ర్ స్టార్ల‌ను క‌లుపుకుని వెళ్లే క‌థ‌ల్ని, కంటెంట్ ని రెడీ చేస్తే అది వారికి పాన్ ఇండియాలో అడ్వాంటేజ్ అవుతుందేమో!

Tags:    

Similar News