11 ఏళ్లుగా ఛాన్సుల్లేక డిప్రెషన్‌లో స్టార్ హీరో
ఇంతకీ ఎవరా స్టార్ హీరో? అంటే.. అతడే ప్రతిభావంతుడైన రణదీప్ హుడా.
ఏడాది.. రెండేళ్లు కాదు.. ఏకంగా 11 సంవత్సరాలు అవకాశాల్లేక తీవ్ర నిరాశలో కూరుకుపోయాడు సదరు స్టార్ హీరో. ఇండస్ట్రీ తనను తక్కువగా అంచనా వేసింది. 23 ఏళ్ల కెరీర్ లో అతడు దశాబ్ధం పైగా కూచుని తింటూ ఇంటిపై ఆధారపడి కాలం గడపాల్సిన పరిస్థితి. దీంతో ఉన్నవి అమ్ముకుని తీవ్ర డిప్రెషన్ లోకి వెళ్లాడట. ఇల్లు, కార్, మైక్రో ఓవెన్ కూడా అమ్మేసాడు. ఇంతకీ ఎవరా స్టార్ హీరో? అంటే.. అతడే ప్రతిభావంతుడైన రణదీప్ హుడా.
ఈ హీరో నటించిన ప్రతి సినిమా ప్రత్యేకత ఉన్నవే. అతడు ప్రతి సినిమాతో తన సత్తాను చాటాడు. నటుడిగా నిరూపించుకున్నాడు. ఇప్పటి వరకు అతడి కెరీర్ లో చెత్త సినిమా అనేదే లేదు. రణ్‌దీప్ ఇటీవల కెరీర్ పరంగా అత్యుత్తమ దశలో ఉన్నాడు. స్టార్ గా ప్రతి సినిమాతో మ్యాజిక్ చేస్తున్నాడు. తన తదుపరి చిత్రం `స్వాతంత్య్ర వీర్ సావర్కర్`తో అభిమానుల ముందుకు వచ్చాడు. స్వాతంత్య్ర సమరయోధుడి కథ ఆధారంగా ఈ చిత్రం రూపొందింది. రణదీప్ హుడా 11 సంవత్సరాలుగా ఉద్యోగం లేకుండా ఉండటం గురించి నిజాయితీగా మాట్లాడాడు.
తాజాగా ప్రముఖ మీడియాతో సంభాషణలో కెరీర్ పరంగా తాను ఎదుర్కొన్న కష్టాలు, నిరాశ గురించి మాట్లాడాడు. తనకు ఏ పని రాకపోవడంతో డిప్రెషన్‌లోకి జారుకున్నానని తెలిపాడు. అంతేకాదు.. వీర్ సావర్కర్ కోసం (ఈ ఒక్క సినిమా ప్రిపరేషన్) తన జీవితాన్ని మూడు సంవత్సరాల పాటు ఎలా వృధా చేసాడో కూడా వెల్లడించాడు.
23 ఏళ్ల కెరీర్‌లో 11 ఏళ్ల పాటు ఎలాంటి పని చేయలేదని రణదీప్ హుడా వెల్లడించారు. హైవే, సరబ్‌జిత్ సహా పలు చిత్రాలలో తన నటనకు ప్రశంసలు దక్కాయి. అయితే తాను కష్ట కాలాన్ని కూడా ఎదుర్కొన్నాడు. ఆ సమయంలో తన కారు, గృహోపకరణాలను కూడా అమ్ముకుని బతుకు వెళ్లదీశాడు.
అయితే గుర్రాల విషయంలో చాలా మక్కువ ఉన్న రణదీప్ ఆ చెడ్డ కాలంలో కూడా తన గుర్రాన్ని అమ్ముకోలేదని చెప్పాడు. తరువాత తనకు తాను సర్ధి చెప్పుకుని, తన తల్లిదండ్రులకు ఇంతటి చెడ్డ స్థితిలో ఉండనని వాగ్దానం చేశాడు. రణదీప్ హుడా నటించిన `స్వాతంత్య్ర వీర్ సావర్కర్` ఈ రోజు విడుదలైంది. రణదీప్ నట జీవితంలో అత్యుత్తమ ప్రదర్శనతో ఆకట్టుకున్నాడని క్రిటిక్స్ నుంచి ప్రశంసలు దక్కాయి.