చిన్న నటుడి పెద్ద అడుగు
ఇప్పటిదాకా చిన్న చిన్న బ్యానర్లలోనే నటించిన సుహాస్.. కెరీర్లో తొలిసారిగా దిల్ రాజు లాంటి పెద్ద నిర్మాతతో సినిమా చేస్తున్నాడు
షార్ట్ ఫిలిమ్స్ ద్వారా సత్తా చాటుకుని.. తర్వాత సినిమాల్లో క్యారెక్టర్ రోల్స్‌తో ప్రేక్షకుల దృష్టిలో పడి.. ఆపై ‘కలర్ ఫొటో’తో హీరో అవతారం ఎత్తాడు యువ నటుడు సుహాస్. తన లుక్స్‌కి ఇతను హీరో ఏంటి అనుకుంటారు కానీ తనకు సరిపడే, కంటెంట్ ఉన్న సినిమాలతో అతను మెప్పిస్తున్నాడు. కలర్ ఫొటోలో తన నటనతో కన్నీళ్లు పెట్టించి మంచి సక్సెస్ అందుకున్న అతను ఆ తర్వాత రైటర్ పద్మభూషణ్ చిత్రంతోనూ ఆకట్టుకున్నాడు. హీరోగా సుహాస్ కొత్త సినిమా 'అంబాజీ పేట మ్యారేజీ బ్యాండు' సైతం ప్రామిసింగ్ గానే కనిపిస్తోంది. ఓ వైపు హీరోగా నటిస్తూనే మరోవైపు క్యారెక్టర్ క్యారెక్టర్, విలన్ రోల్స్ కూడా చేస్తున్న సుహాస్.. ఇప్పుడు ఓ పెద్ద అడుగు వేస్తున్నాడు.
ఇప్పటిదాకా చిన్న చిన్న బ్యానర్లలోనే నటించిన సుహాస్.. కెరీర్లో తొలిసారిగా దిల్ రాజు లాంటి పెద్ద నిర్మాతతో సినిమా చేస్తున్నాడు. రాజు బ్యానర్ లో సుహాస్ హీరోగా కొత్త సినిమా మంగళవారమే మొదలైంది. సలార్ చిత్రాల దర్శకుడు ప్రశాంత్ నీల్ దగ్గర పనిచేసిన సందీప్ బండ్ల అనే కొత్త దర్శకుడు ఈ చిత్రాన్ని రూపొందించనున్నాడు. సినిమా ప్రారంభోత్సవానికి దిల్ రాజుతో పాటు ప్రశాంత్ సైతం విచ్చేయడం విశేషం. షార్ట్ ఫిలిమ్స్ తో నటుడిగా చిన్న చిన్న అడుగులు వేస్తూ ప్రయాణం మొదలుపెట్టిన సుహాస్.. ఈ రోజు దిల్ రాజు బ్యానర్లో హీరోగా నటించడం అంటే చిన్న విషయం కాదు. హీరో లుక్స్ లేకపోయినా కేవలం తన నట కౌశలంతో, అభిరుచితో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు సుహాస్. ఇప్పుడు తన చేతిలో ఉన్న సినిమాలు కూడా క్లిక్ అయితే హీరోగా ఇంకా మంచి స్థాయికి వెళ్లడానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా దిల్ రాజు సినిమా సక్సెస్ అయితే తన రేంజ్ మారిపోతుందనడంలో సందేహం లేదు.