పుష్ఫ‌రాజ్‌తో ఆ ఇద్ద‌రు క్రేజీ స్టార్స్‌..సుక్కు ఏమ‌న్నారంటే..!

బ‌న్నీని జైలు గోడ‌ల వ‌ర‌కు న‌డిపించిన ఈ సినిమా బాక్సాఫీస్ వ‌ద్ద ప్ర‌పంచ వ్యాప్తంగా రూ.1800 కోట్ల వ‌ర‌కు వ‌సూళ్ల‌ని రాబ‌ట్టి బ‌న్నీని తిరుగులేని మాస్ హీరోగా నిల‌బెట్టింది.;

Update: 2025-04-03 09:23 GMT
Sukumar Comments Pushpa3 Movie

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ న‌టించిన పాన్ ఇండియా బ్లాక్ బ‌స్ట‌ర్ `పుష్ప 2`. స్టార్ డైరెక్ట‌ర్ సుకుమార్ అత్యంత భారీ స్థాయిలో `పుష్ప‌`కు సీక్వెల్‌గా తెర‌కెక్కించిన ఈ సినిమా డిసెంబ‌ర్‌లో విడుద‌లై దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్‌గా నిలిచిన విష‌యం తెలిసిందే. సంధ్యా థియేట‌ర్‌లో తొక్కిస‌లాట కార‌ణంగా ఓ మ‌హిళ చ‌నిపోవ‌డం, ఓ బాబు అప‌స్మార స్థితిలోకి వెళ్ల‌డం, ఈ సంఘ‌ట‌న‌పై రాష్ట్ర ప్ర‌భుత్వం సీరియ‌స్ కావ‌డంతో `పుష్ప 2` దేశ వ్యాప్తంగా చ‌ర్చ‌నీయాంశంగా నిలిచింది.

బ‌న్నీని జైలు గోడ‌ల వ‌ర‌కు న‌డిపించిన ఈ సినిమా బాక్సాఫీస్ వ‌ద్ద ప్ర‌పంచ వ్యాప్తంగా రూ.1800 కోట్ల వ‌ర‌కు వ‌సూళ్ల‌ని రాబ‌ట్టి బ‌న్నీని తిరుగులేని మాస్ హీరోగా నిల‌బెట్టింది. దీంతో పార్ట్ 3పై భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి. ఆ అంచ‌నాల‌కు ఏమాత్రం తీసిపోని స్థాయిలో `పుష్ప 3` ఉండ‌బోతోంద‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి. పెళ్లిలో బాంబ్ పేలుడు ఘ‌ట‌న‌తో పార్ట్ 2ని ముగించి సుక్కు పార్ట్ 3ని మాత్రం ఓ రేంజ్‌లో ప్లాన్ చేస్తున్నార‌ట‌.

పార్ట్ 2 స‌క్సెస్ కార‌ణంగా ఏర్ప‌డిన అంచ‌నాలని దృష్టిలో పెట్టుకుని `పుష్ప 3`ని మ‌రింత స్పెష‌ల్‌గా ఎవ‌రూ ఊహించ‌ని స్థాయిలో తెర‌పైకి తీసుకురాబోతున్నార‌నే వార్త‌లు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే ఇటీవ‌లే ఓ అవార్డ్ ఫంక్ష‌న్‌లో పాల్గొన్న సుకుమార్ పుష్ప క్యారెక్ట‌ర్ గురించి ఆస‌క్తిక‌రమైన విష‌యాల్ని వెల్ల‌డించారు. `మ‌న దేశంలో ఎర్ర‌చెంద‌నం స్మ‌గ్లింగ్ పెద్ద ఎత్తున జ‌రుగుతోంది. ఈ నేప‌థ్యంలో ఓ వెబ్ సిరీస్ చేయాల‌నుకున్నా. అందుకోసం ప‌లువురు స్మ‌గ్ల‌ర్ల‌ని క‌లిసి ఇంట‌ర్వ్యూలు చేశాను.

ప‌లు విష‌యాల గురించి వారితో చ‌ర్చించా. అందులో ఓ స్మ‌గ్ల‌ర్ పేరు పుష్ప‌రాజ్‌. అత‌న్ని అంతా `పుష్ప‌` అని పిలుస్తుండేవారు. ఆ పేరునే హీరోకు పెడితే ఇండియా మొత్తం క‌నెక్ట్ అవుతుంద‌ని హీరోకు  పెట్టా అన్నారు. అంతే కాకుండా `పుష్ప 3`లో ఇద్ద‌రు క్రేజీ హీరోలు కూడా న‌టించే అవ‌కాశం ఉంద‌ని జ‌రుగుతున్న ప్ర‌చారంపై స్పందిస్తూ అవ‌న్నీ ఊహాగానాలే అన్నారు. అయితే ఈ స‌మాధానాన్ని సుక్కు చాలా తెలివిగా చెప్ప‌డం గ‌మ‌నార్హం. ప్ర‌స్తుతం `పుష్ప 2` స‌క్సెస్‌ని ఎంజాయ్ చేస్తున్న సుకుమార్ పార్ట్ 3ని మాత్రం మ‌రో రెండేళ్ల త‌రువాతే తెర‌పైకి తీసుకొచ్చే అవ‌కాశం ఉంద‌ని తెలుస్తోంది.

Tags:    

Similar News