సుకుమార్.. రిలాక్స్ రిలాక్స్
సుకుమార్ దర్శకత్వం వహించిన చివరి చిత్రం ‘పుష్ప: ది రూల్’ రిలీజై మూడు నెలలు దాటిపోయింది.;
సుకుమార్ దర్శకత్వం వహించిన చివరి చిత్రం ‘పుష్ప: ది రూల్’ రిలీజై మూడు నెలలు దాటిపోయింది. రిలీజ్ తర్వాత ఆయన పెద్దగా ఈ సినిమా ప్రమోషన్లలో కూడా పాల్గొన్నది లేదు. సుక్కు మామూలుగా ఒక సినిమా పూర్తి చేశాక ఇంకో సినిమా మొదలుపెట్టడానికి కాస్త ఎక్కువ సమయమే తీసుకుంటారు. మరి మూడు నెలలు గడిచాయి కదా. ఇప్పుడైనా తన తర్వాతి సినిమా పనిలో పడ్డారా అంటే అదేమీ లేదన్నది ఆయన సన్నిహితుల సమాచారం. రామ్ చరణ్‌తో సుకుమార్ తన తర్వాతి సినిమా చేయాల్సి ఉన్న సంగతి తెలిసిందే. కనీసం ఈ సినిమా కోసం ఒక లైన్ కూడా అనుకోలేదు అని సమాచారం. కథ గురించి సొంతంగా రీసెర్చ్ చేయడం కానీ.. టీంతో కలిసి డిస్కషన్లు మొదలుపెట్టడం కానీ.. ఏమీ చేయలేదు సుకుమార్.
‘పుష్ప-2’ సినిమా విషయంలో చివరి ఆరు నెలలు తీవ్ర ఒత్తిడి ఎదుర్కొన్నారు సుకుమార్. ఒక దశలో ఆయన బాగా అలసిపోయి డ్రైన్ అయిపోయారు. ప్రి రిలీజ్ ఈవెంట్లో సుక్కును చూస్తే ఆ విషయం స్పష్టంగా అర్థమైంది. ఈ క్రమంలోనే ‘గేమ్ చేంజర్’ యుఎస్ ఈవెంట్లో ఏదైనా వదిలేయాలంటే ఏం వదిలేస్తారు అని అడిగితే ‘సినిమాలు వదిలేయాలనుకుంటున్నా’ అని బదులిచ్చారు సుకుమార్.
ఐతే వెంటనే ఆయన అంత పని చేసే అవకాశం లేదు కానీ.. ఇప్పుడిప్పుడే తన సినిమా మొదలుపెట్టాలని మాత్రం అనుకోవట్లేదని.. విశ్రాంతి కోరుకుంటున్నారని సమాచారం. ఆరోగ్యాన్ని చక్కబెట్టుకునే పనిలో ఉన్నారట. దీంతో పాటు సుకుమార్ రైటింగ్స్‌లో రూపొందాల్సిన తన శిష్యుల సినిమాలు సెట్ చేసే పనిని కూడా పర్యవేక్షిస్తున్నారట. రాబోయే కొన్ని నెలల్లో కూడా ఆయన చరణ్ సినిమా పనిని మొదలు పెట్టరట. ఎలాగూ చరణ్.. బుచ్చిబాబు సినిమా చేస్తున్నాడు. అది పూర్తయి రిలీజ్ కావడానికి కనీసం ఏడాది టైం పడుతుంది. కాబట్టి ఇంకో ఆరు నెలల తర్వాత కానీ ఈ సినిమా స్క్రిప్టు మీద సుకుమార్ కూర్చునే అవకాశం లేదని తెలుస్తోంది.