సుమన్ అప్పట్లో చుక్కలు చూపించారట!
కొన్నేళ్ల క్రితం అంటే 80వ దశకం నుంచి 90వ దశకం చివరి వరకు కథానాయకుడిగా ఓ ఊపు ఊపిన హీరో సుమన్.;

కొన్నేళ్ల క్రితం అంటే 80వ దశకం నుంచి 90వ దశకం చివరి వరకు కథానాయకుడిగా ఓ ఊపు ఊపిన హీరో సుమన్. అప్పట్లో మార్షల్ ఆర్ట్స్ తెలిసిన హీరో కావడం, యాక్షన్ సన్నివేశాల్లో తన మార్కుని చూపించడంతో సుమన్‌కు ప్రత్యేకమైన అభిమానులు ఏర్పడ్డారు. అయితే అనుకోకుండా ఆయన ఓ కేసులో ఇరుక్కోవడం, జైలుకు వెళ్లడం..,చాల కాలం తరువాత విడుదల కావడం అప్పట్లో సంచలనం సృష్టించింది. తనని కావాలనే కేసులో ఇరికించారని, తన కెరర్‌ని నాశనం చేయాలనుకున్నారని అప్పట్లో సుమన్ సంచలన ఆరోపణలు చేయడం తెలిసిందే.
అయితే జైలు నుంచి తిరిగొచ్చాక సుమన్ పదికి పైగా సినిమాలను అంగీకరించి నిర్మాతలకు చుక్కులు చూపించాడట. అంగీకరించిన సినిమాలల్లో ఒక్కో సినిమాకు కేవలం మూడు నాలుగు రోజులు మాత్రమే డేట్స్ ఇచ్చి వారిని ఇబ్బందులకు గురి చేశారట. ఈ విషయాన్ని నిర్మాత మల్లిడి సత్యనారాయణ ఓ యూట్యూబ్ ఛానెల్‌తో మాట్లాడుతు వెల్లడించారు. అంతే కాకుండా సుమన్ గురించిన పలు ఆసక్తికరమైన విషయాల్ని వెల్లడించి షాక్ ఇచ్చారు. `ప్రముఖ సంగీత దర్శకుడు దేవిశ్రీప్రసాద్ తండ్రి సత్యమూర్తి దర్శకత్వంలో సుమన్ హీరోగా ఓ సినిమా ప్లాన్ చేశాం.
పూజా కార్యక్రమాలు కూడా చేశాం. అప్పుడే అరెస్ట్ అయ్యారు. ఆయన జైలు నుంచి తిరిగి రావడానికి ఏడాది పట్టింది. ఆయన తిరిగొచ్చాక సినిమా షూటింగ్ తిరిగి ప్రారంభించాం. అయితే ఇక్కడో విషయం జరిగింది. సుమన్ జైలుకి వెళ్ళొచ్చాక ఆయన మరింత హ్యాండ్సమ్ అయ్యారు. ఆ క్రేజ్‌తో సుమన్ హీరోగా సినిమాలు చేయాలని చాలా మంది దర్శక, నిర్మాతలు క్యూ కట్టారు. అదే సమయంలో సుమన్ మనసు మారింది. కెరీర్‌లో బాగా సంపాదించాలనే నిర్ణయానికి వచ్చారు.
మొత్తం పది సినిమాలు అంగీకరించి ఒక్కో నిర్మాతకు మూడు నాలుగు రోజులు మాత్రమే డేట్స్ ఇస్తూ ఉండేవారు. దీంతో ఎవరి సినిమా అనుకున్న సమయానికి పూర్తి కాలేదు. నా సినిమా పూర్తి కావడానికి ఐదేళ్లు పట్టింది. అంతగా అప్పట్లో సుమన్ నిర్మాతలని ఇబ్బంది పెట్టాడు. డేట్స్ ఇచ్చినా కానీ షూటింగ్‌లకు రాకుండా తీవ్ర ఇబ్బందులకు గురి చేశాడని సంచలన ఆరోపణలు చేశారు.