బాయ్ కాట్ జాట్... అసలు వివాదం ఇదే
అసలు విషయం ఏంటంటే... ఈ సినిమాలో జాఫ్నా టైగర్ ఫోర్స్ పేరుతో ఒక ఉగ్రవాద సంస్థను చూపించారు.;

బాలీవుడ్ స్టార్ సన్నీ డియోల్ 'గదర్ 2' సినిమాతో బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకున్న నేపథ్యంలో ఆయన తాజా చిత్రం 'జాట్' పై అంచనాలు భారీగా పెరిగాయి. తెలుగు దర్శకుగు గోపీచంద్ మలినేని దర్శకత్వంలో సన్నీ డియోల్ ముఖ్య పాత్రలో మైత్రి మూవీ మేకర్స్, పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌లు సంయుక్తంగా నిర్మించిన 'జాట్' సినిమాకు మిశ్రమ స్పందన దక్కింది. నార్త్ ఇండియాలో యావరేజ్ ఓపెనింగ్స్ నమోదు అయ్యాయి. పాతిక కోట్ల మొదటి రోజు వసూళ్లను ఆశించిన మేకర్స్ నిరాశ మిగిలింది. అయితే వీకెండ్‌తో పాటు, వరుస సెలవులు వచ్చిన కారణంగా వసూళ్లు అధికంగా నమోదు అయ్యే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది.
లాంగ్ వీకెండ్ కలిసి వచ్చి డీసెంట్ ఓపెనింగ్స్ దక్కించుకున్న 'జాట్' సినిమా లాంగ్ రన్ వసూళ్లపై నిర్మాతలు టెన్షన్‌గా ఉన్నారు. ఇలాంటి సమయంలో తమిళనాడులో జాట్ సినిమాను బ్యాన్ చేయాలని కొందరు డిమాండ్ చేస్తూ సోషల్ మీడియా ద్వారా చేస్తున్న ఆందోళన తారా స్థాయికి చేరింది. బాయ్ కాట్ జాట్ సినిమా అనే హ్యాష్ ట్యాగ్‌ను సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. తమిళనాడు ప్రజలకు, తమిళుల మనోభావాలకు వ్యతిరేకంగా ఈ సినిమా ఉంది అంటూ పలువురు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో జాట్ సినిమా చుట్టూ అసలు ఏం జరుగుతుంది అనే ఆసక్తి అందరిలోనూ కనిపిస్తోంది. తమిళనాడులో సినిమాను బాయ్ కాట్ చేయడంకు కారణం ఏంటి అనే విషయం తెలుసుకోవాలని అంతా ఉత్సాహం చూపిస్తున్నారు.
అసలు విషయం ఏంటంటే... ఈ సినిమాలో జాఫ్నా టైగర్ ఫోర్స్ పేరుతో ఒక ఉగ్రవాద సంస్థను చూపించారు. శ్రీలంకలో పోరాటం సాగించిన తమిళ వేర్పాటువాద సంస్థ ఎల్‌టీటీఈ కి సినిమాలో చూపించిన జాఫ్నా టైగర్ ఫోర్స్ సంస్థకి దగ్గర పోలికలు ఉన్నాయంటూ తమిళులు ఆరోపిస్తున్నారు. ఎల్‌టీటీఈని చాలా మంది ఉగ్రవాద సంస్థగా పేర్కొంటూ ఉంటారు. అలాంటి వ్యాఖ్యలు చేసిన వారిపై ఎప్పటికప్పుడు తమిళులు ఆందోళన చేయడం, వారికి వ్యతిరేకంగా మాట్లాడటం చేస్తూ ఉంటారు. ఇప్పుడు జాట్ సినిమాలో ఒక కల్పిత ఉగ్రవాద సంస్థ తమ ఎల్‌టీటీఈ సంస్థకు దగ్గరగా అనిపిస్తుందని, దాంతో ఈ సంస్థను ఉగ్రవాద సంస్థగా జాట్ చెప్పే ప్రయత్నం చేసిందని తమిళులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ఆందోళనలు జరుగుతున్నాయి. తమిళులు ఎంతో మంది బాయ్కాట్ జాట్ మూవీ హ్యాష్ ట్యాగ్‌ను షేర్ చేస్తూ తమ అభిప్రాయాలను షేర్ చేస్తున్నారు. ఇప్పటికే కొన్ని థియేటర్‌ల నుంచి సినిమాను తొలగించారు. మల్టీ ప్లెక్స్‌ల నుంచి కూడా సినిమాను తొలగించాల్సిందే అనే డిమాండ్ వ్యక్తం అవుతోంది. హీరో సన్నీ డియోల్ కానీ, దర్శకుడు గోపీచంద్ మలినేని కాని తమిళనాడులో అడుగు పెడితే కచ్చితంగా తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని తమిళలు హెచ్చరిస్తున్నారు. జాట్ సినిమా ఇప్పటికే కమర్షియల్‌గా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటే తమిళనాడు వ్యవహారం నిర్మాతలకు పెద్ద తలనొప్పిగా మారింది.