క్రేజీ ప్రాజెక్టుతో రానా నాయుడు డైరెక్ట‌ర్ టాలీవుడ్ డెబ్యూ

రానా నాయుడు వెబ్ సిరీస్ డైరెక్ట‌ర్ అయిన‌ సుప‌ర్ణ్ వ‌ర్మ ఈ సినిమాతో త‌న టాలీవుడ్ డెబ్యూ చేయ‌నున్నాడ‌ట‌.

Update: 2025-02-05 05:41 GMT

తేజా స‌జ్జ, డైరెక్ట‌ర్ ప్రశాంత్ వ‌ర్మ ది సూప‌ర్ హిట్ కాంబినేష‌న్. వీరిద్ద‌రి క‌ల‌యిక‌లో ఇప్ప‌టికే రెండు సినిమాలొచ్చాయి. అవి జాంబి రెడ్డి, హ‌ను మాన్. మొద‌టి సినిమా మంచి టాక్ తో అంద‌రినీ అల‌రించింది. మ‌రీ ముఖ్యంగా చిన్న పిల్ల‌ల‌కు ఈ జాంబి రెడ్డి సినిమా అంటే ఎంతో ఇష్టం. టాక్ మాత్ర‌మే కాకుండా క‌మ‌ర్షియ‌ల్ గా కూడా జాంబిరెడ్డి బానే వ‌ర్క‌వుట్ అయింది.

ఇక రెండో సినిమా హ‌ను మాన్. ప్ర‌శాంత్ వ‌ర్మ ద‌ర్శ‌క‌త్వంలో తేజా స‌జ్జ హీరోగా వ‌చ్చిన హ‌ను మాన్ చిన్న సినిమాగా రిలీజై, చాలా పెద్ద రికార్డుల‌ను సృష్టించింది. ఈ సినిమాతో ఒక్క‌సారిగా ప్ర‌శాంత్ వ‌ర్మ స్టార్ డైరెక్ట‌ర్ రేంజ్ ను అందుకోవ‌డంతో పాటూ పాన్ ఇండియా లెవెల్ లో పాపుల‌ర్ అయ్యాడు. తేజ స‌జ్జ‌కు కూడా హ‌ను మాన్ వ‌ల్ల మార్కెట్ బాగా పెరిగింది.

ఇదిలా ఉంటే వీరిద్ద‌రూ మ‌రో ప్రాజెక్టు కోసం క‌లుస్తున్న‌ట్టు ఇప్ప‌టికే వార్త‌లొచ్చాయి. ఆ ప్రాజెక్టు మ‌రేదో కాదు జాంబి రెడ్డి సినిమాకు సీక్వెల్. ఈ సీక్వెల్‌కు జాంబి రెడ్డి2 ద నెక్ట్స్ లెవెల్ అనే టైటిల్‌ను కూడా ఫిక్స్ చేశారు. టాలీవుడ్ ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ సితార ఎంట‌ర్టైన్మెంట్స్ బ్యాన‌ర్ లో నాగ వంశీ ఈ సినిమాను నిర్మించ‌నున్నాడు.

అయితే ఈ సినిమాను ప్ర‌శాంత్ వ‌ర్మ డైరెక్ట్ చేయ‌డం లేదు. జాంబి రెడ్డి సీక్వెల్ గా వ‌స్తోన్న‌ జాంబి రెడ్డి2కు ఆయ‌న క‌థ మాత్ర‌మే అందించ‌నుండ‌గా, రానా నాయుడు వెబ్ సిరీస్ డైరెక్ట‌ర్ అయిన‌ సుప‌ర్ణ్ వ‌ర్మ ఈ సినిమాతో త‌న టాలీవుడ్ డెబ్యూ చేయ‌నున్నాడ‌ట‌. ఈ నేప‌థ్యంలోనే సుప‌ర్ణ్ ప్ర‌స్తుతం ప్ర‌శాంత్ వ‌ర్మ‌, తేజ‌ల‌ను క‌ల‌వ‌డానికి హైద‌రాబాద్ వ‌చ్చిన‌ట్టు తెలుస్తోంది.

మొద‌ట్లో ఈ సినిమాను ఓ బాలీవుడ్ నిర్మాణ సంస్థ నిర్మించాల‌నుకుంది కానీ ఇప్పుడా ప్రాజెక్టు నాగ వంశీ చేతికి వ‌చ్చింది. ఈ క్రేజీ సీక్వెల్ కోసం తేజ భారీ మొత్తంలోనే పారితోషికాన్ని అందుకుంటున్నాడ‌ని తెలుస్తోంది. దీనికి సంబంధించిన అధికారిక వివ‌రాలు ఇంకా వెల్ల‌డి కావాల్సి ఉండ‌గా, ఈ సినిమాను ఓ అనౌన్స్‌మెంట్ వీడియోతో ప్ర‌క‌టిస్తార‌ని తెలుస్తోంది. కాగా ప్ర‌స్తుతం తేజ స‌జ్జ మిరాయ్ అనే భారీ బ‌డ్జెట్ సినిమా చేస్తున్నాడు.

Tags:    

Similar News