బాలయ్య వీడియో.. ఏడ్చిన హీరో సూర్య
ఆహాలో ప్రసారం అవుతోన్న ఈ కార్యక్రమం భారీ రెస్పాన్స్‌తో రికార్డులు క్రియేట్ చేస్తోంది.
టాలీవుడ్‌లో సుదీర్ఘ కాలంగా స్టార్ హీరోగా వెలుగొందుతూ తనదైన చిత్రాలతో ప్రేక్షకులను, అభిమానులను మెప్పిస్తున్నారు నటసింహా నందమూరి బాలకృష్ణ. కొంత కాలంగా సినిమాల పరంగా ఫుల్ ఫామ్‌తో దూసుకెళ్తోన్న ఆయన.. ‘అన్‌స్టాపబుల్ విత్ ఎన్‌బీకే’ అనే షోను కూడా సక్సెస్‌ఫుల్‌గా నడుపుతున్న విషయం తెలిసిందే. ఆహాలో ప్రసారం అవుతోన్న ఈ కార్యక్రమం భారీ రెస్పాన్స్‌తో రికార్డులు క్రియేట్ చేస్తోంది.
‘అన్‌స్టాపబుల్ విత్ ఎన్‌బీకే’ షో ఇప్పటికే మూడు సీజన్లను విజయవంతంగా పూర్తి చేసుకుంది. ఇప్పుడు దీనికి సంబంధించిన నాలుగో సీజన్‌ను కూడా ప్రారంభించారు. ఇందులో మొదటి ఎపిసోడ్‌కు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హాజరవగా.. రెండో ఎపిసోడ్ కోసం ‘లక్కీ భాస్కర్’ మూవీ యూనిట్ నుంచి దుల్కర్ సల్మాన్, మీనాక్షి చౌదరి, వెంకీ అట్లూరిలు వచ్చి సందడి చేశారు.
క్రేజీగా సాగుతోన్న ‘అన్‌స్టాపబుల్ విత్ ఎన్‌బీకే’ షో నాలుగో ఎపిసోడ్ కోసం కోలీవుడ్ స్టార్ హీరో సూర్య వచ్చాడు. అతడు నటించిన ‘కంగువ’ మూవీ నవంబర్ 14వ తేదీన ఆడియెన్స్ ముందుకు రాబోతుంది. ఈ నేపథ్యంలోనే సూర్య తన టీమ్‌తో కలిసి బాలయ్య షోలో సందడి చేశాడు. ముందుగా హోస్ట్ ఈ కోలీవుడ్ హీరోతో పలు రకాల ఆటలను ఆడించాడు. దీనికి సంబంధించిన ప్రోమోను తాజాగా విడుదల చేశారు.
‘అన్‌స్టాపబుల్ విత్ ఎన్‌బీకే’ షోలో భాగంగా హోస్ట్ నందమూరి బాలకృష్ణ.. హీరో సూర్యను ఇరుకున పెట్టేలా కొన్ని ప్రశ్నలు అడిగారు. ముఖ్యంగా కార్తి, జ్యోతిక గురించి ప్రస్తావించారు. దీనికతడు ఏం చెప్పాలో తెలియక నీళ్లు నమిలాడు. అనంతరం కార్తికి ఫోన్ చేసిన బాలయ్య మరిన్ని నవ్వులు పూయించారు. ఆ తర్వాత అక్కడకు బాబీ డియోల్, శివ రావడంతో వాళ్లతో కలిసి డ్యాన్స్ కూడా చేశారు.
ఈ షో జరుగుతున్న సమయంలోనే ‘శివకుమార్ గారి కుమారుడిగా నువ్వు ఆయన నుంచి ఏం నేర్చుకున్నావు’ అని బాలయ్య ప్రశ్నించగా సూర్య ‘నేను మంచి మనిషిలా ఉండాలని అనుకున్నా’ అని బదులిచ్చాడు. అప్పుడే గతంలో సూర్య సహాయం చేసిన ఓ అమ్మాయి మాట్లాడిన వీడియోను బాలయ్య ప్లే చేయించారు. అది చూస్తూ కోలీవుడ్ స్టార్ హీరో కన్నీటి పర్యంతం అయిపోయాడు.
ఆ అమ్మాయి వీడియోను చూసిన తర్వాత సూర్య ఎమోషనల్‌గా ‘నా చారిటీకి ఎంతో మంది సహాయం చేశారు. అందులో సగం కంటే ఎక్కువ మంది తెలుగు వాళ్లే’ అని గర్వంగా చెప్పారు. ఇప్పుడు ఈ ప్రోమో యమా వైరల్ అవుతోంది. ఇదిలా ఉండగా.. సూర్య ‘అగరం’ అనే ఫౌండేషన్‌ను స్థాపించిన విషయం తెలిసిందే.