'కంగువా' రిలీజ్ ట్రైలర్ విషయంలో గందరగోళం
సూర్య హీరోగా శివ దర్శకత్వంలో భారీ బడ్జెట్‌తో జ్ఞానవేల్ రాజా నిర్మించిన 'కంగువా' సినిమాను ఈనెల 15న ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్న విషయం తెల్సిందే
సూర్య హీరోగా శివ దర్శకత్వంలో భారీ బడ్జెట్‌తో జ్ఞానవేల్ రాజా నిర్మించిన 'కంగువా' సినిమాను ఈనెల 15న ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్న విషయం తెల్సిందే. భారీ అంచనాల నడుమ రూపొందిన కంగువా సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు దాదాపు నెల రోజులుగా జరుగుతున్నాయి. దేశం మొత్తం హీరో సూర్యతో పాటు ఇతర యూనిట్ సభ్యులు కాళ్లకు చక్రాలు కట్టుకుని తిరుగుతున్నట్లుగా తిరగడం మనం చూస్తూ ఉన్నాం. హైదరాబాద్ కి ఇప్పటికే రెండు సార్లు వచ్చిన కంగువా టీం విడుదల సమయం వరకు మళ్లీ వచ్చినా ఆశ్చర్యం లేదు. అలాగే ఉత్తరాదిన పలు ప్రాంతాల్లోనూ సినిమాను భారీ ఎత్తున ప్రమోట్ చేయడం జరిగింది.
సినిమాను ఎంత ప్రమోట్ చేసినా ట్రైలర్ అనేది అత్యంత కీలకంగా పని చేస్తుంది. కంగువా సినిమా ట్రైలర్ ఇప్పటికే వచ్చింది. సినిమా విడుదలకు నెల రోజుల సమయం ఉండగానే ట్రైలర్ ను విడుదల చేయడం జరిగింది. సాధారణంగా ట్రైలర్ అంత ముందు వస్తే రిలీజ్ సమయంలో మరో ట్రైలర్ ను విడుదల చేస్తారని అంతా అనుకుంటారు. గతంలోనూ అలాగే జరిగింది. పెద్ద సినిమాలకు, భారీ సినిమాలకు రిలీజ్ ట్రైలర్ అనేది చాలా కీలకంగా ఉంటుంది. ఓపెనింగ్స్ ను రాబట్టడంలంఓ రిలీజ్ ట్రైలర్ కీలకంగా పని చేస్తుంది. అలాంటిది కంగువా సినిమాకు రిలీజ్ ట్రైలర్ ఉందా.. లేదా అనే చర్చ జరుగుతోంది. ఫ్యాన్స్ తో పాటు ప్రేక్షకులు కంగువా రిలీజ్ ట్రైలర్ కోసం ఎదురు చూస్తున్నారు.
కంగువా సినిమాపై ఇప్పటికే ఉన్న అంచనాలు మరింత పెంచడంతో పాటు, భారీ ఓపెనింగ్స్ వచ్చేలా చేయాలి అంటే రిలీజ్ ట్రైలర్ విషయంలో చాలా జాగ్రత్తలు అవసరం అంటూ సినీ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కానీ ఇప్పటి వరకు కంగువా రిలీజ్ ట్రైలర్ గురించి ఎలాంటి అప్‌డేట్ లేదు. అసలు ఉందా లేదా అనే గందరగోళం లో సూర్య ఫ్యాన్స్ ఉన్నారు. విడుదలకు సమయం దగ్గర పడుతుంది. కనీసం వారం రోజుల సమయం కూడా లేదు. కనుక ట్రైలర్ విడుదల విషయంలో స్పష్టత రావాల్సి ఉంది. ఒకటి రెండు రోజుల్లో రిలీజ్ ట్రైలర్ ను తీసుకు రాకుంటే ఆ తర్వాత వచ్చినా వృథా అనే అభిప్రాయం ను సినీ విశ్లేషకులు వ్యక్తం చేస్తున్నారు.
తమిళ సినిమా ఇండస్ట్రీ నుంచి ఇప్పటి వరకు వెయ్యి కోట్ల సినిమా రాలేదు. ఆ లోటును కంగువా భర్తీ చేస్తుందనే నమ్మకంను చాలా మంది వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా కంగువా నిర్మాత జ్ఞానవేల్ రాజా ఒక మీడియా సమావేశంలో మాట్లాడుతూ తమ సినిమా వెయ్యి కోట్లకు పైగా వసూళ్లు సాధించడం ఖాయం. ఆ విషయాన్ని తాను జీఎస్టీ బిల్లు ముందు పెట్టి మరీ నిరూపిస్తాను అంటూ ఛాలెంజ్ చేయడం జరిగింది. సోషల్ మీడియాలో కంగువా సినిమా తమిళ బాహుబలి అన్నట్లుగా ప్రచారం జరుగుతోంది. మరి ఆ స్థాయిలో ఈ సినిమా ఉంటుందా, వెయ్యి కోట్ల వసూళ్లు సాధించే సత్తా కంగువాకు ఉందా అనేది తెలియాలంటే విడుదల వరకు వెయిట్ చేయాల్సిందే.