'కంగువా' నిర్మాతకు భారీ ఊరట!
తమిళ్ స్టార్ హీరో సూర్య నటించిన 'కంగువా' సినిమా గత నెలలో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
తమిళ్ స్టార్ హీరో సూర్య నటించిన 'కంగువా' సినిమా గత నెలలో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. దాదాపు రూ.400 కోట్ల వసూళ్ల లక్ష్యంతో బరిలోకి దిగిన కంగువా సినిమా కనీసం రూ.200 కోట్ల వసూళ్లు సొంతం చేసుకోలేక పోయింది. బాక్సాఫీస్ వర్గాల సమాచారం ప్రకారం కంగువా సినిమా రూ.130 కోట్ల లాస్ వెంచర్‌గా తెలుస్తోంది. రాధేశ్యామ్ తర్వాత అతి పెద్ద లాస్ ప్రాజెక్ట్‌గా బాక్సాఫీస్ వర్గాల వారు మాట్లాడుకుంటూ ఉన్నారు. నిర్మాతతో పాటు బయ్యర్లు తీవ్రంగా నష్టపోవడంతో 2024 బిగ్గెస్ట్ ఫ్లాప్‌గా కంగువా సినిమా నిలిచింది. ఈ చెత్త రికార్డ్‌కి సూర్య ఫ్యాన్స్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
శివ దర్శకత్వంలో భారీ బడ్జెట్‌తో యూవీ క్రియేషన్స్‌తో కలిసి జ్ఞానవేల్ రాజా నిర్మించడం జరిగింది. ఈ సినిమా వెయ్యి కోట్ల రూపాయల వసూళ్లు సాధిస్తుంది అంటూ ఆయన చాలా నమ్మకం వ్యక్తం చేస్తూ వచ్చారు. కానీ సినిమా బాక్సాఫీస్ వద్ద ఆయన ఆశలను అడియాశలు చేసింది. సినిమా మొదటి వారం తర్వాత థియేర్‌లలో కనిపించలేదు. తమిళనాడు మినహా మరే రాష్ట్రంలోనూ మినిమం వసూళ్లను సొంతం చేసుకోలేక పోయింది. అందుకే కంగువా సినిమా నిర్మాతలు కోలుకోవడం కష్టం అంటూ బాక్సాఫీస్ వర్గాల వారితో పాటు కోలీవుడ్ సినీ వర్గాల వారు మాట్లాడుకుంటూ ఉన్నారు.
కంగువా సినిమా భారీ ఫ్లాప్ నుంచి బయటకు వచ్చిన సూర్య వెంటనే తదుపరి సినిమాల పనులతో బిజీ అయ్యాడు. వెట్రిమారన్‌తో సినిమా ఇప్పటికే ప్రారంభం కావాల్సి ఉన్నా విడుదల పార్ట్ 2 పనులతో బిజీగా ఉండటం వల్ల ఆర్జే బాలాజీ దర్శకత్వంలో సినిమాకు సూర్య రెడీ అయ్యాడు. వీరి కాంబో మూవీ షూటింగ్ చకచక జరిగే అవకాశాలు ఉన్నాయి. వచ్చే ఏడాదిలోనే సినిమా విడుదల చేసే విధంగా దర్శకుడు ప్లాన్ చేస్తూ ఉన్నాడు. కంగువా సినిమాతో చాలా నష్టపోయిన జ్ఞానవేల్ రాజా నిర్మాణంలో సినిమాను చేసేందుకు సూర్య ఓకే చెప్పాడని తెలుస్తోంది.
కోలీవుడ్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం జ్ఞానవేల్ రాజా సినిమాకు పారితోషికం తీసుకోకుండా విడుదల సమయంలో లాభాల్లో వాటాను తీసుకునే విధంగా సూర్య నిర్ణయం తీసుకున్నాడు. దాంతో నిర్మాత జ్ఞానవేల్ రాజాకి చాలా పెద్ద ఊరట అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. రూ.50 కోట్లతో సూర్యతో సినిమాను తీస్తే కచ్చితంగా మంచి మినిమం వసూళ్లు వచ్చి తన నష్టాల్లో కొంత మేరకు అయినా కవర్ అయ్యే అవకాశాలు ఉన్నాయని జ్ఞానవేల్ రాజా భావిస్తూ ఉంటాడని తమిళ్ మీడియా వర్గాల వారు మాట్లాడుకుంటూ ఉన్నారు. సోషల్ మీడియాలో కంగువా గురించిన ట్రోల్స్ ఇంకా కొనసాగుతున్నాయి. ఈ సమయంలోనే సూర్య, జ్ఞానవేల్ రాజా సినిమాకు సంబంధించిన వార్తలు వస్తున్నాయి. మరో వైపు దర్శకుడు శివ తదుపరి సినిమాను అజిత్ హీరోగా చేసే అవకాశాలు ఉన్నాయి.