సూర్య 44: ఇదేమి జెట్ స్పీడ్ సామీ..
కేవలం నాలుగు నెలల వ్యవధిలోనే ఈ మూవీ మొత్తం కంప్లీట్ అయ్యిందని క్లారిటీ ఇచ్చారు.
కోలీవుడ్ స్టార్ హీరో సూర్య బ్యాక్ టూ బ్యాక్ సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉన్నారు. శివ దర్శకత్వంలో సూర్య చేసిన ‘కంగువా’ మూవీ ఇంకా రిలీజ్ కాకుండానే కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వంలో ‘సూర్య 44’ చిత్రాన్ని స్టార్ట్ చేసేశారు. ఇదిలా ఉంటే ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ చేసినట్లు సూర్య ట్విట్టర్ లో కన్ఫర్మ్ చేసి అందరిని ఆశ్చర్యానికి గురి చేశారు. కేవలం నాలుగు నెలల వ్యవధిలోనే ఈ మూవీ మొత్తం కంప్లీట్ అయ్యిందని క్లారిటీ ఇచ్చారు.
సూర్య ఫ్యాన్స్ తో పాటు రెగ్యులర్ ఆడియన్స్ కి సైతం ఇది షాక్ ఇచ్చిందని చెప్పాలి. తక్కువ టైంలో షూట్ చేసి కోలీవుడ్ లో ఒక బెంచ్ మార్క్ ని కార్తీక్ సుబ్బరాజు క్రియేట్ చేశాడు. గత కొన్నేళ్లుగా స్టార్ హీరోలు సినిమాల షూటింగ్ కోసం చాలా ఎక్కువ టైం తీసుకుంటున్నారు. సూర్య ‘కంగువా’ మూవీ పూర్తి కావడానికి మూడేళ్లు పట్టింది. పాన్ ఇండియా లెవల్ లో భారీ కాన్వాస్ ని స్టార్ హీరోల సినిమాలు తెరకెక్కుతున్నాయి. దర్శకులు కూడా కథలని చాలా డీటెయిలింగ్ గా చెబుతున్నారు.
అందుకే షూటింగ్ కోసం ఎక్కువ కాలం పడుతోంది. షూటింగ్ షెడ్యూల్స్ కూడా బ్యాక్ టూ బ్యాక్ జరగడం లేదు. అయితే కార్తిక్ సుబ్బరాజు మాత్రం ‘సూర్య 44’ విషయంలో పర్ఫెక్ట్ ప్లానింగ్ తో వెళ్లినట్లు తెలుస్తోంది. ప్రీప్రొడక్షన్ దశలోనే తనకి కావాల్సిన లొకేషన్స్ తో పాటు, సెట్ వర్క్ అన్ని కరెక్ట్ గా సిద్ధం చేసుకున్నారు. అలాగే షెడ్యూల్స్ కూడా బ్యాక్ టూ బ్యాక్ పెట్టేసారు. దీంతో నాలుగు నెలల కాలంలోనే షూటింగ్ మొత్తం కంప్లీట్ చేయగలిగారని తెలుస్తోంది.
ఇక ఈ మూవీ షూటింగ్ పూర్తి కావడంపై ట్విట్టర్ లో సూర్య పోస్ట్ పెట్టారు. చాలా లొకేషన్‌లలో మంచి వాతావరణంలో షూటింగ్ పూర్తయ్యింది. ఈ విషయంలో నేను చాలా సంతోషంగా ఉన్నాను. సూపర్ టాలెంటెడ్ యాక్టర్స్, అలాగే టెక్నీకల్ టీమ్ తో ఈ సినిమా ప్రయాణంలో ఎన్నో జ్ఞాపకాలు ఉన్నాయి. ‘సూర్య 44’ తో నా జీవితంలో మరో సోదరుడిని కార్తీక్ సుబ్బరాజులో చూసాను. మరుపురాని అనుభవాలని ఈ చిత్రం నాకందించింది.
సినిమా కోసం కష్టపడిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అంటూ సూర్య ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ తో పాటు షూటింగ్ సందర్భంగా టీమ్ తో దిగిన ఫోటోలని సూర్య పంచుకున్నారు. ఈ ఫోటోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. ‘సూర్య 44’ చిత్రంలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటించింది. ఆమె ఈ సినిమాపై ఆమె చాలా హోప్స్ పెట్టుకుంది. ఇక 2025 సంక్రాంతి కానుకగా ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకి తీసుకురావాలని కార్తీక్ సుబ్బరాజు ప్లాన్ చేస్తున్నారు.