మనీ హీస్ట్ రేంజ్ లో సూర్య .. మరో హీరో కూడా?

సౌత్ ఇండస్ట్రీలో తన ప్రత్యేకమైన నటనతో ప్రేక్షకులను అలరిస్తున్న కోలీవుడ్ స్టార్ సూర్య, చాలా కాలం తరువాత తెలుగు దర్శకుడితో కలిసి వర్క్ చేయబోతున్నాడు.

Update: 2025-02-17 06:28 GMT

సౌత్ ఇండస్ట్రీలో తన ప్రత్యేకమైన నటనతో ప్రేక్షకులను అలరిస్తున్న కోలీవుడ్ స్టార్ సూర్య, చాలా కాలం తరువాత తెలుగు దర్శకుడితో కలిసి వర్క్ చేయబోతున్నాడు. గతంలో రామ్ గోపాల్ వర్మ రక్తచరిత్ర లో కనిపించిన సూర్య మళ్ళీ ఇన్నాళ్ళకు డైరెక్ట్ తెలుగు సినిమా చేయబోతున్నట్లు సమాచారం. ఇప్పటికే తెలుగులో పలు డబ్బింగ్ సినిమాలతో మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్న ఈ నటుడు, ఇక స్ట్రైట్ తెలుగు మూవీ కోసం సిద్ధమవుతున్నారని టాలీవుడ్ వర్గాల్లో చర్చ నడుస్తోంది.

ఈ ప్రాజెక్ట్ కోసం వెంకీ అట్లూరి దర్శకత్వం వహించనున్నారని, దీనిని సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మించనుందని సమాచారం. ఇప్పటికే స్క్రిప్ట్ పనులు పూర్తయినట్లు తెలుస్తుండగా, ఇది దొంగతనంపై ఆధారపడిన యాక్షన్ థ్రిల్లర్ కథాంశమని టాక్. కొంతమంది దీనిని మనీ హీస్ట్ వెబ్‌సిరీస్ తరహాలో ఉంటుందని అభివర్ణిస్తున్నారు. అయితే, ఈ కథ కేవలం బ్యాంక్ రాబరీకి మాత్రమే పరిమితం కాకుండా, ఆసక్తికరమైన అనేక ట్విస్ట్‌లు, భారీ యాక్షన్ ఎలిమెంట్స్ కలిగి ఉంటుందని టాక్ వినిపిస్తోంది.

సూర్యకు తగిన విధంగా వెంకీ అట్లూరి స్క్రిప్ట్‌ను మలచారని, ఇది ఆయన కెరీర్‌లో మరో బిగ్ మూవీగా నిలిచే అవకాశం ఉందని అంటున్నారు. ఈ సినిమా మల్టీస్టారర్ కానున్నట్లు మరో ఆసక్తికరమైన వార్త బయటకొచ్చింది. ఇప్పటికే వెంకీ అట్లూరి ధనుష్, దుల్కర్ సల్మాన్ వంటి స్టార్ హీరోలతో పనిచేశారు. ఇప్పుడు వారిలో ఎవరో ఒకరు ఈ సినిమాలో కీలక పాత్రలో కనిపించే అవకాశం ఉందని తెలుస్తోంది.

మరోవైపు నిర్మాత నాగవంశీ మాత్రం తెలుగు నటుడిని కూడా ఈ చిత్రంలో భాగం చేయాలని భావిస్తున్నట్లు సమాచారం. ఒకవేళ ఇది నిజమైతే, తెలుగు ప్రేక్షకులకు ఈ మల్టీస్టారర్ మరింత ఆసక్తికరంగా మారనుంది. ఇదే సమయంలో, చందూ మొండేటి కూడా సూర్య కోసం ఓ భారీ ప్రాజెక్ట్ సిద్ధం చేసినట్లు వార్తలు వస్తున్నాయి. ఇటీవల తండేల్ సినిమాతో మరో హిట్ అందుకున్న ఈ దర్శకుడు, ఇప్పుడు సూర్య కోసం ఓ హిస్టారికల్ సబ్జెక్ట్ రెడీ చేసినట్లు సమాచారం.

ఈ ప్రాజెక్ట్‌కు గీతా ఆర్ట్స్ ప్రొడ్యూసర్‌గా వ్యవహరించనున్నారని టాలీవుడ్ వర్గాల్లో చర్చ నడుస్తోంది. ఒకవేళ ఇది ఓకే అయితే, సూర్య తెలుగులో రెండు సినిమాలతో వరుసగా ప్రేక్షకులను అలరించబోతున్నాడని చెప్పొచ్చు. అయితే వెంకీ అట్లూరి సినిమా ముందు సెట్స్ పైకి వెళ్లనుందా? లేక చందూ మొండేటి ప్రాజెక్ట్ ముందు స్టార్ట్ అవుతుందా? అనే దానిపై క్లారిటీ రావాల్సి ఉంది. అలాగే, మల్టీస్టారర్ కాన్సెప్ట్ ఎంత వరకు ముందుకు వెళ్తుందనేది చూడాలి. త్వరలోనే అధికారిక ప్రకటన రావచ్చని సమాచారం.

Tags:    

Similar News