2025: క్రేజీ సినిమాలను లైన్ లో పెట్టిన సితార వంశీ..!
టాలీవుడ్ లో ప్రస్తుతం యువ నిర్మాత సూర్యదేవర నాగవంశీ టైమ్ నడుస్తోంది. గత కొన్నాళ్లుగా ఆయన ఏది పట్టినా బంగారం అవుతోంది.
టాలీవుడ్ లో ప్రస్తుతం యువ నిర్మాత సూర్యదేవర నాగవంశీ టైమ్ నడుస్తోంది. గత కొన్నాళ్లుగా ఆయన ఏది పట్టినా బంగారం అవుతోంది. సితార ఎంటర్టైన్మెంట్స్, హరిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ల మీద ఎలాంటి సినిమాలు తీసినా బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్లు అవుతున్నాయి. ప్రొడ్యూసర్ గానే కాదు, డిస్ట్రిబ్యూటర్ గానూ వంశీ రాణిస్తున్నారు. కొత్త ఏడాదిలోనూ ఆయన తన ఫామ్ ను కంటిన్యూ చేస్తున్నారు.
నాగవంశీ నిర్మాణంలో గతేడాది సంక్రాంతికి వచ్చిన 'గుంటూరు కారం' సినిమా టాక్ తో సంబంధం లేకుండా కలెక్షన్లు రాబట్టింది. 'టిల్లు స్క్వేర్', 'లక్కీ భాస్కర్' చిత్రాలు బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించడమే కాదు, వంద కోట్ల క్లబ్ లో చేరాయి. 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' మూవీ దాదాపు అన్ని ఏరియాలలో బ్రేక్ ఈవెన్ మార్క్ అందుకోగా.. డిస్ట్రిబ్యూషన్ చేసిన 'దేవర' సినిమా అనూహ్యమైన వసూళ్లు సాధించింది. ఈ సినిమాలన్నీ థియేటర్లలో హిట్టవ్వడంతో పాటుగా ఓటీటీలోనూ విశేష ఆదరణ దక్కించుకున్నాయి.
2024 సంవత్సరాన్ని సక్సెస్ ఫుల్ గా ముగించిన నాగవంశీ.. 'డాకు మహారాజ్' వంటి బ్లాక్ బస్టర్ తో కొత్త ఏడాదిని ఘనంగా ప్రారంభించారు. నందమూరి బాలకృష్ణ, డైరెక్టర్ బాబీ కాంబినేషన్ లో తెరకెక్కిన ఈ చిత్రం సంక్రాంతి స్పెషల్ గా విడుదలైంది. పాజిటివ్ టాక్ తో బాక్సాఫీస్ దగ్గర దూసుకుపోతోంది. ఇక 2025లో సితార ఎంటర్టైన్మెంట్స్ లైనప్ లో పలు క్రేజీ ప్రాజెక్ట్స్ ఉన్నాయి.
విజయ్ దేవరకొండ హీరోగా గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో నాగ వంశీ ఓ భారీ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇంకా టైటిల్ అనౌన్స్ చేయని ఈ సినిమాని ప్రస్తుతానికి 'VD 12' అనే వర్కింగ్ టైటిల్ తో పిలుచుకుంటున్నారు. రెండు భాగాలుగా భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ యాక్షన్ థ్రిల్లర్.. సమ్మర్ లో రిలీజ్ కానుంది. 'డాకు మహారాజ్' థియేటర్లలోకి వచ్చేసింది కాబట్టి, అతి త్వరలోనే విజయ్ దేవరకొండ సినిమా ప్రమోషన్స్ స్టార్ట్ కానున్నాయి.
'మ్యాడ్' వంటి సూపర్ సక్సెస్ తర్వాత, దానికి సీక్వెల్ గా 'మ్యాడ్ స్క్వేర్' పేరుతో ఓ సినిమా చేస్తున్నారు. ఈ ఏడాది ఫస్టాప్ లోనే ఈ యూత్ ఫుల్ రొమాంటిక్ ఎంటర్టైనర్ ను రిలీజ్ చేయాలని మేకర్స్ భావిస్తున్నారు. అలానే సితార ప్రొడక్షన్ లో అందరు కొత్త ముఖాలతో 'మ్యాజిక్' అనే మూవీ నిర్మిస్తున్నారు. తక్కువ బడ్జెట్ తో తీస్తున్న ఈ మ్యూజికల్ ఎంటర్టైనర్ ను గౌతమ్ తిన్ననూరి డైరెక్ట్ చేస్తున్నారు. దీనికి అనిరుధ్ సంగీతం సమకూరుస్తున్నాడు. ఆల్రెడీ కంప్లీట్ అయిన ఈ చిత్రాన్ని త్వరలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.
రవితేజ హీరోగా 'మాస్ జాతర' అనే చిత్రాన్ని రూపొందిస్తున్న సంగతి తెలిసిందే ఇది మాస్ రాజాకి మైలురాయి 75వ చిత్రం. భాను భోగవరపు దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. మే నెలలో ఈ సినిమాని విడుదల చేయాలని టార్గెట్ గా పెట్టుకున్నారు. నవీన్ పొలిశెట్టితో 'అనగనగా ఒక రాజు' పేరుతో ఓ కామెడీ ఎంటర్‌టైనర్ ను తెరకెక్కిస్తున్నారు. అప్పుడెప్పుడో హోల్డ్ లో పడిన ఈ ప్రాజెక్ట్ ఇటీవలే తిరిగి సెట్స్ మీదకు వచ్చింది. ఇది ఏడాది చివర్లో విడుదలయ్యే అవకాశం ఉంది. అల్లరి నరేష్ 63వ సినిమా సితార బ్యానర్ లోనే రాబోతోంది. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ ప్రాజెక్ట్.. 2025 సెకండాఫ్ లో వచ్చే ఛాన్స్ ఉంది.
మహేష్ బాబు మేనల్లుడు అశోక్ గల్లాతో నాగ వంశీ ఓ సినిమా చేస్తున్నారు. ఇది ఎక్కువ భాగం యూఎస్ఏలో చిత్రీకరణ జరుపుకుంటోంది. ఇక విశ్వక్ సేన్, అనుదీప్ కేవీ కాంబినేషన్ లో 'ఫంకీ' అనే ఫ్యామిలీ ఎంటర్టైనర్ ను అనౌన్స్ చేశారు. యువ హీరో సిద్ధూ జొన్నలగడ్డతో ఓ సినిమా లైన్ లో ఉంది. అఖిల్ అక్కినేని నటిస్తున్న కొత్త సినిమా నిర్మాణంలోనూ నాగవంశీ భాగస్వామిగా ఉన్నారు. అక్కినేని నాగచైతన్యతోనూ ఓ మూవీ అనుకుంటున్నారు. వెంకీ అట్లూరి తదుపరి చిత్రాన్ని ఓ స్టార్ హీరోతో నిర్మించడానికి ప్లాన్ చేస్తున్నారు.
వెంకటేష్ తో ఓ సినిమా కోసం డిస్కసన్స్ జరుగుతున్నాయి. ఆనంద్ దేవరకొండ, 96 ఫేమ్ ఆదిత్య హాసన్ కాంబోలో సినిమా కూడా లైన్ లో ఉంది. అల్లు అర్జున్ - త్రివిక్రమ్, ఎన్టీఆర్ - నెల్సన్ దిలీప్ కుమార్ సినిమాలు ఉన్నాయి. ఇవి కాకుండా మరికొన్ని ప్రాజెక్ట్స్ చర్చల దశలో ఉంటే.. ఇంకొన్ని సినిమాలు ప్రీప్రొడక్షన్ స్టేజిలో ఉన్నాయి. వీటిల్లో చాలా చిత్రాలు ఈ ఏడాదే విడుదల కానున్నాయి. మరి ఇవన్నీ సితార వంశీకి ఎలాంటి విజయాలు అందిస్తాయో చూడాలి.