ఆస్కార్స్ 2025 బ‌రిలో 'లాపాటా లేడీస్‌'తో మ‌రొక‌రు..!

ఈసారి ఆస్కార్స్ బ‌రిలో బాలీవుడ్ హ‌వా క‌నిపిస్తోంది. ఎందుక‌నో తెలుగు సినిమాల‌కు ఎలాంటి ఆస్కారం లేకుండా పోయింది.

Update: 2024-09-24 15:00 GMT

ఈసారి ఆస్కార్స్ బ‌రిలో బాలీవుడ్ హ‌వా క‌నిపిస్తోంది. ఎందుక‌నో తెలుగు సినిమాల‌కు ఎలాంటి ఆస్కారం లేకుండా పోయింది. కిరణ్ రావు `లాపాటా లేడీస్` ఆస్కార్స్ 2025కి భారతదేశం నుంచి అధికారిక ఎంట్రీగా ఎంపికైంది. ఈ సినిమాతో పాటు 97వ అకాడమీ అవార్డుల కోసం రణదీప్ హుడా స్వాతంత్య్ర దినోత్స‌వ వీరుని క‌థ `వీర్ సావర్కర్` కూడా పోటీ బ‌రిలోకి వ‌చ్చింది. ఈరోజు (సెప్టెంబర్ 24న) రణదీప్ హుడా, అంకితా లోఖండే, నిర్మాత సందీప్ సింగ్ త‌దిత‌రులు `స్వతంత్ర వీర్ సావర్కర్` పోస్టర్‌తో ఉమ్మడి పోస్ట్‌ను షేర్ చేసారు. ఈ సినిమాని అధికారికంగా ఆస్కార్‌కి పంపిస్తున్నామ‌ని పోస్టర్‌లో వెల్లడించారు. పోస్ట‌ర్‌లో రణదీప్ క్లాప్‌బోర్డ్ పట్టుకుని నిర్మాతలతో కలిసి నిలబడి ఉన్నారు.

మా చిత్రం `స్వాతంత్య్ర‌ వీర్ సావర్కర్` అధికారికంగా ఆస్కార్ రేసులోకి వెళుతోంది. మా ప్ర‌య‌త్నాన్ని ప్ర‌శంసించిన ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియాకు ధన్యవాదాలు. ఈ ప్రయాణం నమ్మశక్యం కానిది. ఈ మార్గంలో మాకు మద్దతు ఇచ్చిన ప్రతి ఒక్కరికీ చాలా కృతజ్ఞతలు అని పోస్ట్ కి క్యాప్షన్ ఇచ్చారు. అభిమానులు ఈ ప్ర‌క‌ట‌న‌తో సంతోషాన్ని వ్యక్తం చేసారు. ఈ చిత్రం పూర్తిగా ఆస్కార్‌కి అర్హమైనది అని ఒక అభిమాని వ్యాఖ్యానించాడు. అది అర్హమైన ప్రవేశం అని మ‌రొక‌రు పేర్కొన్నారు. బీర్‌బైసెప్స్ పాడ్‌కాస్ట్‌లో కనిపించిన సమయంలో రణదీప్ తన వ్యక్తిగత నిధులను, ముంబైలో తన తండ్రి కొనుగోలు చేసిన ఆస్తుల ద్వారా వచ్చిన ఆదాయాన్ని ఈ చిత్రంలో పెట్టుబడి పెట్టినట్లు తెలిపాడు. మాకు ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి. మా నాన్నగారు పొదుపు చేసిన డ‌బ్బుతో ముంబయిలో నా కోసం రెండు మూడు ఆస్తులు కొన్నారు. నేను వాటిని అమ్ముకుని సినిమాకి డబ్బు పెట్టాను. నేను దేనినీ ఆపలేకపోయాను. ఈ చిత్రానికి ఎవరి సపోర్ట్‌ లేదు! అని అన్నారు. ఈ ప్ర‌క‌ట‌న వెలువ‌డిన‌ కొద్దిసేపటికే అభిమానులు సంతోషాన్ని వ్య‌క్తం చేస్తూ కామెంట్స్ విభాగంలో అభినంద‌న‌లు తెలిపారు.

స్వాతంత్య్ర‌ వీర్ సావర్కర్ చిత్రంలో న‌టుడిగానే కాదు.. ఈ చిత్రంతో రణదీప్ హుడా దర్శకుడిగా పరిచయం అయ్యాడు. బయోపిక్ డ్రామాను స్వాతంత్య్ర‌ సమరయోధుడి జీవితం ఆధారంగా రూపొందించారు. ఇందులో అంకితా లోఖండే సావర్కర్ భార్య యమునా బాయి పాత్రను పోషించింది. ఇందులో అమిత్ సియాల్ కూడా కీలక పాత్ర పోషించారు. ఈ చిత్రం ఈ సంవత్సరం 22 మార్చి 2024న హిందీ, మరాఠీ భాషల్లో విడుదలైంది. ఇది ప్రస్తుతం డిజిటల్ ప్లాట్‌ఫారమ్ జీ 5లో ప్రసారానికి అందుబాటులో ఉంది. స్వ‌తంత్య్ర కేట‌గిరీలో ర‌ణ‌దీప్ ఈ సినిమాని ప్ర‌మోట్ చేస్తున్నార‌ని దీనిని బ‌ట్టి అర్థ‌మ‌వుతోంది.

Tags:    

Similar News