సమాజాన్ని అద్దంలో చూపించే తాప్సీ
ఈ సినిమాలకు విమర్శకుల ప్రశంసలు దక్కడమే గాక బాక్సాఫీస్ వద్ద ఫర్వాలేదనిపించాయి.
తాప్సీ పన్ను వరుసగా ప్రయోగాత్మక చిత్రాల్లో నటిస్తోంది. ముఖ్యంగా బాలీవుడ్ దర్శకుడు అనుభవ్ సిన్హా రూపొందించే సామాజిక కథాంశాలకు తాప్సీ యాప్ట్ గా కనిపిస్తోంది. ఇంతకుముందు ముల్క్, తాపడ్ వంటి సామాజిక కాన్సెప్ట్ ఉన్న సినిమాల కోసం తాప్సీ- అనుభవ్ కలిసి పని చేసారు. ఈ సినిమాలకు విమర్శకుల ప్రశంసలు దక్కడమే గాక బాక్సాఫీస్ వద్ద ఫర్వాలేదనిపించాయి.
అనుభవ్ సిన్హా ఎక్కువగా సామాజిక సమస్యలపై సినిమాలు తెరకెక్కించడంలో స్పెషలిస్ట్ గా గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయన సినిమాలు కొన్ని లోతైన సందేశంతో ఆకర్షిస్తాయి. ముల్క్ చిత్రం కోర్టురూమ్ డ్రామా. ఇందులో తాప్సీ పన్ను ప్రధాన పాత్రలో నటించింది. ఇప్పుడు సిన్హా తన ఫేవరెట్ తాప్సీ పన్నుతో మరో తీక్షణమైన సామాజిక సమస్యపై సినిమా తీయబోతున్నారు. సమాజంలో ఎక్కువగా చర్చల్లో ఉన్న బర్నింగ్ టాపిక్ ని ఎంపిక చేసుకుని, అతడు మరో ప్రయోగానికి శ్రీకారం చుట్టనున్నాడు. ఈ సినిమా ముల్క్ లాగా ఉంటుంది కానీ `ముల్క్` తదుపరి భాగం కాదు. ముల్క్ తరహాలోనే ఒక సమస్యపై చర్చకు తెర తీసే సినిమా. ఇలాంటి సినిమాలు నిర్మించేందుకు నిర్మాతలు ముందుకు రావడం అంత సులువేమీ కాదు. కానీ అనుభవ్ తన జానర్ ని మార్చే ఆలోచనలో లేరు. ఈ తరహా సినిమాలతో సమాజంలో అవగాహన కల్పించాలని భావిస్తున్నారు.
ముల్క్ , తాప్పడ్ తర్వాత ఇప్పుడు అనుభవ్ సిన్హా దర్శకత్వంలో తాప్సీ తన మూడవ చిత్రాన్ని దాదాపుగా ఖరారు చేసుకుంది. అయితే ఈ సినిమా టైటిల్ ఇంకా నిర్ణయించాల్సి ఉంది. తాప్సీతో పాటు, మనోజ్ పహ్వా, కుముద్ మిశ్రా తదితరులు ముఖ్య పాత్రలు పోషించబోతున్నారు. ఇతర నటీనటుల ఎంపికలు జరగనున్నాయి. తాజా సమాచారం ప్రకారం.. ఈ సినిమా షూటింగ్ ఏప్రిల్‌లో ప్రారంభమవుతుంది.
అనుభావ్ సిన్హా సినిమాకి ముందు.. తాప్సీ మరికొన్ని చిత్రాలతో బిజీగా ఉంది. యాక్షన్ థ్రిల్లర్ `గాంధారి`లోను తాప్సీ నటిస్తోంది. దీనిలో కిడ్నాప్‌కి గురైన తన కూతురిని కాపాడుకునే తల్లి పాత్రలో తాప్సీ నటిస్తోంది. 'వో లడ్కీ హై కహాన్' అనే మరో చిత్రంలోను తాప్సీ నటించనుంది. ఈ సంవత్సరం చివర్లో ఈ సినిమా విడుదలవుతుంది. ఇందులో ప్రతీక్ గాంధీ తో పాటు తాప్సీ కీలక పాత్రలో కనిపించనుంది.