ఇండస్ట్రీలో కొత్త టాలెంట్‌కే ఛాన్స్..నిజమెంత?
అయితే టాలెంట్ ఉంటే అవకాశం అదే వెతుక్కుంటూ వస్తుందని, ఈ విషయంలో ఇతరులను నిందించడం కరెక్ట్ కాదని కొంత మంది వాదిస్తున్నారు.;

ఏరంగంలో చూసినా టాలెంట్ నెక్స్ట్ మనోడు ఫస్ట్ అనే సంప్రదాయం నడుస్తోంది. అదే టాలీవుడ్‌లోనూ గత కొన్నేళ్లుగా కొనసాగుతోంది. ఇక్కడ పరిచయాలే ప్రధానం. టాలెంట్ ఆ తరువాతే. మనవాడైతే చాలా ముందుకు తోసేయడమే. దాంతో టాలెంట్ వున్న వాళ్లు అవకాశాల కోసం నెలల తరబడి ప్రొడ్యూసర్ల ఆఫీసుల చుట్టూ కాళ్లకు చెప్పులరిగేలా తిరుగుతున్న పరిస్థితి. టాలెంట్ ఉన్నా అవకాశాలు రాక ఏళ్లుగడుస్తుండటంతో చాలా మంది టాలెంటెడ్ పీపుల్స్ లైమ్ లైట్‌లోకి రావడం లేదు.
ఏళ్లు గడిచేకొద్దీ ఔట్ డేటెడ్ అయిపోతుండటంతో వారి బాధ వర్ణణాతీతంగా మారుతోంది. క్లాప్, యాక్షన్, కట్ చెప్పాలని కోటి ఆశలతో ఇండస్ట్రీ బాటపడుతున్న ఎంతోమంది యంగ్ టాలెంట్స్ ఇప్పటికీ అవకాశాలు రాక, `ఒక్క ఛాన్స్ ప్లీజ్` అంటూ ఎదురు చూస్తున్నారు. టాలెంట్‌ని గుర్తించి ఎవరైనా అవకాశం ఇవ్వకపోతారా అని ఆశపడుతున్నారు. అయితే టాలెంట్ ఉంటే అవకాశం అదే వెతుక్కుంటూ వస్తుందని, ఈ విషయంలో ఇతరులను నిందించడం కరెక్ట్ కాదని కొంత మంది వాదిస్తున్నారు.
ఇక్కడో విషయం చెప్పాలి. సిటీ జనాల నుంచి గ్రామీణ ప్రజలని భావోద్వేగానికి గురయ్యేలా చేసిన సినిమా `బలగం`. కామెడియన్ వేణు తొలిసారి దర్శకుడిగా మారి ఈ మూవీని రంగస్థల కళాకారులతో తెరకెక్కించిన తీరు, ఈ చిత్ర కథ, కథనాలు ప్రతీ ఒక్కరి హృదయాన్ని తడిమాయి. దీంతో ఈ సినిమా టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారడం తెలిసిందే. దిల్ రాజు ఈ మూవీని నిర్మించారు. అయితే ఇది దిల్‌రాజుని చేరడానికి దర్శకుడు వేణు యుద్ధమే చేయాల్ని వచ్చింది. ఓ డిస్ట్రిబ్యూటర్ దీన్ని దిల్ రాజు నిర్మిస్తేనే ఈ కథలోని సందేశం అందరికి చేరుతుందని నమ్మి తనే వేణుని దిల్ రాజు దగ్గరికి తీసుకురావడం, కథ విని నిర్మించడం వల్లే `బలగం` వెలుగులోకొచ్చింది.
వేణు నటుడిగా తెలిసినా అతని టాలెంట్‌ని గుర్తించడానికి మరో వ్యక్తి కావాల్సి వచ్చింది. ఇక నేచురల్ స్టార్ నాని నటించిన `దసరా` సినిమా సెట్స్‌పైకి వెళ్లడం వెనక కూడా ఇలాంటి కథే ఉంది. దర్శకుడు సుకుమార్ వద్ద దర్శకత్వ శాఖలో పనిచేసిన శ్రీకాంత్ ఓదెల తన ఊళ్లో తను చూసిన సంఘటనలని తీసుకుని రాసుకున్న కథ `దసరా`. దీన్ని ముందు రూ.4 కోట్ల బడ్జెట్‌తో చిన్న సినిమాగా ఫైట్ మాస్టర్ విజయ్ తనయుడు రాహుల్ విజయ్‌తో చేయాలనుకున్నాడు. రా క్యారెక్టర్ చేయడానికి తను భయపడటంతో అది కార్యరూపం దాల్చలేదు.
ఓ మేకప్‌మెన్ ఈ స్క్రిప్ట్ గురించి తెలుసుకుని శ్రీకాంత్ ఓదెలని నిర్మాత సుధాకర్ చెరుకూరికి పరిచయం చేయడం, ఆయనకు కథ నచ్చడంతో ఆయన షో రీల్ చేయించి దాన్ని హీరో నానికి చూపించి కథ వినిపించడంతో ఫైనల్ గా `దసరా` కార్యరూపం దాల్చింది. వంద కోట్లు కలెక్ట్ చేసింది. రీసెంట్‌గా నేచురల్ స్టార్ నాని నిర్మించిన `కోర్ట్`ది కూడా దాదాపు ఇదే పరిస్థితి. నాని చేశాడు కాబట్టి ఈ కథ ప్రేక్షకుల వరకు వెళ్లింది. లేదంటే ఎవరూ పట్టించుకునేవారు కాదు. ఇండస్ట్రీలో ఇంతకు మించిన సినిమాలు చేసే టాలెంట్ ఉంది. చిన్న బడ్జెట్‌లలో సరికొత్త కథలతో అద్భుతాలు చేయడానికి ఎంతో మంది రెడీగా ఉన్నారు. కాబట్టి నాని, దిల్ రాజులే కాకుండా పేరున్న వాళ్లు కొత్త టాలెంట్‌ని నిజాయితీగా సపోర్ట్ చేస్తే మరిన్ని `బలగం`, కోర్ట్ వంటి సినిమాలొస్తాయి.