అప్పుడు తరుణ్.. ఇప్పుడు తేజ సజ్జ..
చిన్న హీరో, పెద్ద స్కేల్ అంటూ విమర్శలు ఎదుర్కొన్న హనుమాన్ బ్లాక్ బస్టర్ హిట్ అయింది.
కంటెంట్, కథ బాగుంటే చిన్న సినిమాలు అయినా సరే సూపర్ సక్సెస్ ను సాధిస్తాయి. అందుకు టాలీవుడ్ లో అనేక ఉదహరణలు ఉన్నాయి. ఇటీవలే జరిగిన సంక్రాంతి పండుగకు తెలుగు రాష్ట్రాల్లో వాకిళ్లతో పాటు సినిమా థియేటర్లు కళకళలాడాయి. సంక్రాంతి కానుకలుగా మహేశ్ బాబు గుంటూరు కారం, నాగార్జున నా సామిరంగ, వెంకటేశ్ సైంధవ్ తోపాటు తేజ సజ్జ హనుమాన్ సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి.
గుంటూరు కారం, సైంధవ్, నా సామి రంగ చిత్రాలు మిక్స్ డ్ టాక్ సంపాదించగా.. చిన్న హీరో, పెద్ద స్కేల్ అంటూ విమర్శలు ఎదుర్కొన్న హనుమాన్ బ్లాక్ బస్టర్ హిట్ అయింది. బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపిస్తోంది. ఇప్పటికీ థియేటర్లు హౌస్ పుల్ అయ్యి మేకర్స్ కు లాభాలు తెచ్చిపెడుతోంది.
అయితే హనుమాన్.. మిగతా మూడు చిత్రాలతో పోల్చితే చాలా తక్కువ బడ్జెట్ తోనే రూపొందింది. సుమారు రూ.12 కోట్లతో యంగ్ టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ.. అద్భుతాన్ని సృష్టించి అదరహో అనిపించారు. తక్కువ బడ్జెట్, చిన్న సినిమాగా వచ్చి ఈ సంక్రాంతికి అత్యధిక వసూళ్లు రాబట్టిన మూవీగా నిలిచింది. అయితే టాలీవుడ్ లో ఇంతకుముందు ఇలాంటి సంఘటనలు చాలా సార్లు జరిగాయి.
2002లో హీరో తరుణ్, ఆర్తి అగర్వాల్ నటించిన రొమాంటిక్ కామెడీ మూవీ నువ్వు లేక నేను లేను.. అప్పట్లో సంక్రాంతి కానుకగా విడుదలైంది. చిన్న చిత్రంగా రిలీజ్ అయ్యి.. బాలయ్య సీమసింహం, మహేశ్ టక్కరి దొంగ మూవీతో బాక్సాఫీస్ వద్ద పోటీ పడింది. అత్యధిక వసూళ్లు సాధించి రికార్డు సృష్టించింది.
ఆ తర్వాత 2004 సంక్రాంతికి విడుదలైన ప్రభాస్ వర్షం మూవీ.. బాలకృష్ణ లక్ష్మీ నరసింహ, చిరంజీవి అంజి మూవీలకు గట్టి పోటీనిచ్చింది. బాక్సాఫీస్ వద్ద హైయెస్ట్ వసూళ్లు రాబట్టిన చిత్రంగా నిలిచింది. 2005లో పెద్ద పండుగకు ప్రేక్షకుల ముందుకు వచ్చిన సూపర్ హిట్ సినిమా నువ్వొస్తానంటే నేనొద్దంటానా.. నా అల్లుడు, ధన51 మూవీలకు షాక్ ఇచ్చి భారీ వసూళ్లు సాధించింది.
ఈ ఏడాది సంక్రాంతికి నా సామిరంగతో పలకరించిన నాగార్జున.. 2016లో సోగ్గాడే చిన్ని నాయనాగా వచ్చి సూపర్ హిట్ కొట్టారు. జూనియర్ ఎన్టీఆర్ నాన్నకు ప్రేమతో, శర్వానంద్ ఎక్స్ ప్రెస్ రాజాతో పోటీపడి భారీ వసూళ్లు సాధించారు. ఇక 2019లో వెంకటేశ్, వరుణ్ తేజ్ మల్టీస్టారర్ మూవీ ఎఫ్ 2.. ఎన్టీఆర్ కథానాయకుడు, రామ్ చరణ్ వినయ విధేయ రామతో పోటీపడి మంచి కలెక్షన్లు రాబట్టింది. మరి ఈ ఏడాది సంక్రాంతికి హనుమాన్ చిన్న చిత్రంగా రిలీజై భారీ వసూళ్లు సాధించగా.. వచ్చే పండక్కి ఏం జరుగుతుందో చూడాలి.