ఆ సూపర్ పవర్ కావాలంటున్న తమన్నా
ఈ ఈవెంట్ లో తనకు సూపర్ పవర్ వస్తే ఏం చేయాలనుకుంటుందో కూడా వెల్లడించింది.;

హీరోయిన్ తమన్నా నటిస్తున్న తాజా చిత్రం ఓదెల2. అశోక్ తేజ దర్శకత్వం వహించిన ఈ సినిమాకు సంపత్ నంది కథ అందించారు. ఓదెల రైల్వే స్టేషన్ సినిమాకు సీక్వెల్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా ఏప్రిల్ 17న ప్రేక్షకుల ముందుకు రానుంది. రిలీజ్ దగ్గర పడుతున్న నేపథ్యంలో చిత్ర యూనిట్ ప్రమోషన్స్ ను వేగవంతం చేసింది. ప్రమోషన్స్ లో భాగంగా మేకర్స్ రీసెంట్ గా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించారు.
ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు టాలీవుడ్ యంగ్ హీరో శర్వానంద్ చీఫ్ గెస్టుగా హాజరై, సినిమా సూపర్ హిట్ అవాలని కోరుతూ చిత్ర యూనిట్ మొత్తానికి ఆల్ ది బెస్ట్ చెప్పారు. ఈ ఈవెంట్ లో తమన్నా మాట్లాడుతూ ఇప్పటివరకు తాను ఎన్నో సినిమాలు చేశానని, ఎన్నో నిర్మాణ సంస్థలతో కలిసి పని చేశానని, ఎంతోమందితో వర్క్ చేసినప్పటికీ కొందరితోనే స్పెషల్ బాండింగ్ ఏర్పడుతుందని తెలిపింది.
అలాంటి స్పెషల్ బాండింగ్ తనకు సంపత్ నందితో ఏర్పడిందని, ఆయనతో ఇప్పటికి నాలుగు సినిమాలు చేశానని, సంపత్ నందికి ఎప్పటికీ రుణపడి ఉంటానని తమన్నా పేర్కొంది. ఈ సినిమా తమ కోసం కాకపోయినా సంపత్ నంది, మధు కోసమైనా తప్పక హిట్ అవాలని ఆశిస్తున్నట్టు చెప్పిన తమన్నా ఈ ఈవెంట్ లో తనకు సూపర్ పవర్ వస్తే ఏం చేయాలనుకుంటుందో కూడా వెల్లడించింది.
సినిమాలో లాగానే తనకు నిజంగా సూపర్ పవర్ వస్తే ఎంత కావాలంటే అంత తింటూ, బరువు పెరగకుండా ఉండే సూపర్ పవర్ కావాలని కోరుకుంటానని, మీక్కూడా ఈ సూపర్ పవర్ కావాలా అని యాంకర్ సుమని అడిగితే నాక్కూడా కావాలని సుమ చెప్పింది. దానికి తమన్నా మనందరికీ ఆ సూపర్ పవర్ కావాలని చెప్తూ సరదాగా ఆ సంభాషణను ముగించింది.
ఇక ఓదెల2 విషయానికొస్తే ఈ సినిమాలో తమన్నా శివ శక్తిగా కనిపించనుండగా, వశిష్ట, హెబ్బా పటేల్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ సినిమా కోసం తమన్నా ఎంతో కష్టపడిందని, అఘోరీ పాత్రలో నటించినంత కాలం తన కాళ్లకు చెప్పులు కూడా వేసుకోలేదని చిత్ర యూనిట్ ఇప్పటికే వెల్లడించిన సంగతి తెలిసిందే. ఓదెల2 పై తమన్నా ఎన్నో ఆశలు పెట్టుకుంది.