తెలుగు హీరోలను దెబ్బేసిన తమిళ దర్శకులు..!

తెలుగు సినిమా మార్కెట్ పాన్ ఇండియా వైడ్ గా విస్తరించిన తర్వాత, ఇతర భాషల దర్శకులు సైతం టాలీవుడ్ హీరోలతో సినిమాలు చేయడానికి ఆసక్తి కనరుస్తున్నారు.

Update: 2025-01-13 04:38 GMT

తెలుగు సినిమా మార్కెట్ పాన్ ఇండియా వైడ్ గా విస్తరించిన తర్వాత, ఇతర భాషల దర్శకులు సైతం టాలీవుడ్ హీరోలతో సినిమాలు చేయడానికి ఆసక్తి కనరుస్తున్నారు. ఇటీవల కాలంలో పలువురు కోలీవుడ్ డైరెక్టర్స్ తెలుగు చిత్ర సీమలో అడుగుపెట్టారు. కానీ బాక్సాఫీస్ వద్ద ఆశించిన విజయాలను అందుకోలేకపోయారు. 'గేమ్ చేంజర్' సినిమాకి మిక్స్డ్ టాక్ వచ్చిన నేపథ్యంలో, గతంలో టాలీవుడ్ హీరోలకు ఫ్లాప్స్ ఇచ్చిన దర్శకులు ఎవరో ఇప్పుడు చూద్దాం.

డబ్బింగ్ సినిమాలతో తెలుగు ప్రేక్షకులను అలరించిన అగ్ర దర్శకుడు ఎస్. శంకర్.. మూడు దశాబ్దాల తర్వాత 'గేమ్ చేంజర్' మూవీతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చారు. ఇది ఆయనకు మొట్ట మొదటి తెలుగు సినిమా. రామ్ చరణ్ హీరోగా నటించిన ఈ పాన్ ఇండియన్ చిత్రం, సంక్రాంతి కానుకగా రీసెంట్ గా థియేటర్లలో రిలీజ్ అయింది. భారీ అంచనాలతో వచ్చిన ఈ చిత్రానికి మిశ్రమ స్పందన లభించింది. ఫెస్టివల్ సీజన్ ను క్యాష్ చేసుకుని ఏమేరకు వసూళ్ళు రాబడుతుందో చూడాలి.

అక్కినేని నాగచైతన్య హీరోగా తెరకెక్కిన 'కస్టడీ' మూవీతో తెలుగులోకి అడుగుపెట్టారు డైరెక్టర్ వెంకట్ ప్రభు. ఇది చైతూకి కోలీవుడ్ డెబ్యూ. పక్కా హిట్ అవుతుందనుకున్న ఈ బైలింగ్వల్ మూవీ బాక్సాఫీస్ వద్ద పరాజయం పాలైంది. చైతన్య గతంలో కృష్ణ మారిముత్తు అనే తమిళ దర్శకుడితో చేసిన 'యుద్ధం శరణం' సినిమా తీవ్ర నిరాశ పరిచిన సంగతి తెలిసిందే. ఇక రామ్ పోతినేనితో కోలీవుడ్ డైరెక్టర్ ఎన్. లింగుస్వామి 'ది వారియర్' అనే ద్విభాషా చిత్రాన్ని తెరకెక్కించారు. ఇది డిజాస్టర్ ఫలితాన్ని చవి చూసింది.

క్యారక్టర్ ఆర్టిస్టుగా రాణిస్తున్న దర్శక నటుడు సముద్రఖని.. మెగా మేనమామ - మేనల్లుడు పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ కాంబినేషన్ లో 'బ్రో' అనే రీమేక్ సినిమా చేశారు. ఇది ఆశించిన స్థాయిలో ఆడలేదు. సముద్రఖని దీని కంటే ముందు రవితేజతో చేసిన 'శంభో శివ శంభో'.. నాని హీరోగా తెరకెక్కించిన 'జెండా పై కపిరాజు' చిత్రాలు కూడా నిరాశనే మిగిల్చాయి. అలానే ఆనంద్ శంకర్ డైరక్షన్ లో విజయ్ దేవరకొండ నటించిన 'నోటా' మూవీ డిజాస్టర్ అయింది. రాఘవ లారెన్స్ దర్శకత్వంలో ప్రభాస్ నటించిన 'రెబల్' మూవీ దారుణ పరాజయం చవి చూసింది.

మహేశ్ బాబు, పవన్ కల్యాణ్ లకు కూడా తమిళ దర్శకులతో చేదు అనుభవాలే మిగిలాయి. ఎస్జే సూర్య దర్శకత్వంలో మహేశ్ నటించిన 'నాని'.. ఏఆర్ మురగదాస్ తో చేసిన 'స్పైడర్' చిత్రాలు ఫ్లాప్ అయ్యాయి. ధరణి డైరెక్షన్ లో పవన్ యాక్ట్ చేసిన 'బంగారం'.. విష్ణు వర్ధన్ తెరకెక్కించిన 'పంజా' చిత్రాలు పరాజయం పాలయ్యాయి. కల్యాణ్ కు 'ఖుషి' లాంటి క్లాసిక్ మూవీ ఇచ్చిన ఎస్.జె. సూర్య.. 'కొమురం పులి' లాంటి డబుల్ డిజాస్టర్ అందించారు. 'తొలి ప్రేమ' వంటి మెమరబుల్ హిట్టిచ్చిన కరుణాకరన్.. 'బాలు' లాంటి ఫ్లాప్ బొమ్మని ఇచ్చాడు.

రామ్ కెరీర్ ప్రారంభంలో శరవణన్ దర్శకత్వంలో 'గణేష్.. జస్ట్ గణేశ్' అనే ఫ్లాప్ మూవీ చేశాడు. నాని కూడా అప్పట్లో అంజనా అలీఖాన్ తో 'సెగ'.. గౌతమ్ వాసుదేవ్ మీనన్ తో 'ఏటో వెళ్లిపోయింది మనసు' వంటి ఫ్లాపులు రుచి చూశాడు. డైరెక్టర్ సిరుతై శివ తెలుగులో గోపీచంద్ తో తీసిన 'శంఖం' 'సౌర్యం'.. రవితేజ హీరోగా చేసిన 'దరువు' సినిమాలు ఫెయిల్ అయ్యాయి. చిరంజీవి, అక్కినేని నాగార్జున, నందమూరి బాలకృష్ణ, వెంకటేష్ లాంటి సీనియర్ హీరోలకు కూడా తమిళ దర్శకులతో చేదు అనుభవాలు ఎదురయ్యాయి.

Tags:    

Similar News