ఐఫా వివాదంపై తేజా సజ్జ క్లారిటీ!
ఈవెంట్ లో భాగంగా తెలుగు సినిమాలను రోస్టింగ్ చేసే క్రమంలో వీరిద్దరూ చేసిన కొన్ని వ్యాఖ్యలు వివాదాస్పదమవ్వడమే దీనికి కారణం.
ఇటీవల జరిగిన ఐఫా (IIFA-2024) అవార్డుల కార్యక్రమానికి హోస్టులుగా వ్యవహరించిన టాలీవుడ్ హీరోలు రానా దగ్గుబాటి - తేజా సజ్జ లపై గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో ట్రోలింగ్ జరుగుతోంది. ఈవెంట్ లో భాగంగా తెలుగు సినిమాలను రోస్టింగ్ చేసే క్రమంలో వీరిద్దరూ చేసిన కొన్ని వ్యాఖ్యలు వివాదాస్పదమవ్వడమే దీనికి కారణం. దీనిపై తాజాగా తేజ క్లారిటీ ఇచ్చాడు. ఎవరినీ తక్కువ చేయాలనే ఉద్దేశ్యం తనకు లేదని అన్నాడు. అవకాశం వస్తే తప్పకుండా మరోసారి ఐఫాకి హోస్ట్ గా చేస్తానని చెప్పాడు.
''ఐఫా అనేది ఒక నేషనల్ ఫ్లాట్ ఫార్మ్. ఎంతోమంది స్క్రిప్ట్ రైటర్స్ వర్క్ చేస్తారు. రీడింగ్ సెషన్స్ తర్వాత ఆ స్క్రిప్టులు మా వరకూ వస్తాయి. అదీకాక మీరు ఏదైతే చూస్తున్నారో అవన్నీ కట్ చేసిన క్లిప్పింగ్స్. ఫుల్ వీడియో చూసి ఉంటే ఎవరికీ ప్రతికూల ఉద్దేశం రాదు. అయినా అవన్నీ రానా గారు క్లియర్ గా నా మీద వేసిన జోకులు. నా మీద వేసిన జోక్స్ కాబట్టే అక్కడ అందరూ ఫన్నీగానే తీసుకున్నారు. నేను చిన్నప్పటి నుంచి అందరి హీరోలతో పనిచేస్తూ పెరిగా. వారందరితో నాకు చాలా క్లోజ్ రిలేషన్ ఉంది. అలాంటిది వారిని తక్కువ చేసి ఎందుకు మాట్లాడతాను?. అలాంటి ఉద్దేశం నాకు లేదు. ఆ ఆలోచన కూడా నాకు రాదు. మా వ్యాఖ్యలను అపార్థం చేసుకోకపోవడం వల్లే ఇదంతా జరిగింది'' అని తేజ సజ్జా స్పష్టం చేసారు.
అబుదాబిలో జరిగిన ఐఫా అవార్డ్స్ వేడుకలో రానా దగ్గుబాటి - తేజా సజ్జలు కొన్ని సినిమాలు, కొందరు హీరోలపై సెటైర్లు వేశారు. తేజను మహేష్ బాబుతో కంపేర్ చేస్తూ ఇద్దరూ చైల్డ్ ఆర్టిస్టులే అని కామెంట్స్ చేయడం.. 'గుంటూరు కారం' 'హనుమాన్' సినిమాలు పోటీపడిన సంక్రాంతి పండుగను ప్రస్తావిస్తూ సెటైరికల్ మాట్లాడటం సూపర్ స్టార్ ఫ్యాన్స్ ను బాధ పెట్టింది. 'ఆదిపురుష్' సినిమా రిలీజైనప్పుడు థియేటర్లలో హనుమంతుడికి ఒక సీట్ వదిలేయడంపై కూడా సెటైరికల్ గా మాట్లాడారు. దీనిపై ప్రభాస్ అభిమానులు అసహనం వ్యక్తం చేసారు. ఇక 48 గంటల్లో వీడియో డిలీట్ చేయమంటాడంటూ మంచు విష్ణుపై కూడా సెటైర్ వేశారు.
అలానే ఈ ఇయర్ అమితాబ్ బచ్చన్ కెరీర్‌లోనే అతి పెద్ద ఎత్తును, లోతును చూశారంటూ.. 'కల్కి' చిత్రాన్ని పొగుడుతూ 'మిస్టర్ బచ్చన్' మూవీని ట్రోల్ చేసారు. దీనికి రవితేజ, హరీష్ శంకర్ ఫ్యాన్స్ హర్ట్ అయ్యారు. ఈ వీడియో క్లిప్పింగ్ పై హరీష్ సైతం పరోక్షంగా ఫైర్ అయ్యారు. "ఎన్నో విన్నాను, అందులో ఇదొకటి. అన్ని రోజులు ఒకేలా ఉండవు, నాకైనా.. ఎవరికైనా" అంటూ పోస్ట్ పెట్టారు. ఈ నేపథ్యంలో రానా - తేజా సజ్జాలపై సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోలింగ్ జరిగింది. హీరోల అభిమానులు వాళ్ళిద్దరినీ టార్గెట్ చేస్తూ నెగెటివ్ పోస్టులు, కామెంట్స్ పెడుతూ వస్తున్నారు.
‘ది రానా దగ్గుబాటి షో’ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో రానా దగ్గుబాటి ఈ విషయంపై స్పందించారు. మీడియా మిత్రులు ఐఫా కాంట్రవర్సీ గురించి అడగ్గా.. ''హీరో నాని నాకొక సలహా ఇచ్చారు. నెక్స్ట్ టైమ్ నుంచి నువ్వు జోక్స్ వేసినప్పుడు.. అది జోక్ అని కింద డిస్ క్లైమర్ వెయ్యి. లేకపోతే జోక్ అని తెలియడం లేదు అని అన్నాడు. నెక్స్ట్ టైమ్ నుంచి 'ఇది జోక్.. అందరూ నవ్వండి' అని ఒక సబ్ టైటిల్ వేద్దామనుకుంటున్నాను'' అని రానా అన్నారు. ఇప్పుడు తేజా సజ్జా సైతం ఈ వివాదంపై క్లారిటీ ఇచ్చారు. మరి ఇప్పటి నుంచైనా వీరిద్దరిపై ట్రోలింగ్ ఆగుతుందేమో చూడాలి.