రానా- తేజ ఆ హీరోల అభిమానుల్ని ఇలా కెలికారేంటి?
అయితే హోస్టింగ్ విషయంలో రానా, తేజలిద్దరు బాలీవుడ్ స్టార్లను అనుకరించే ప్రయత్నం చేసి చేతులు కాల్చుకున్నట్లు కనిపిస్తుంది.
ఐఫా అవార్డుల కార్యక్రమం దుబాయ్ లో ఘనంగా జరిగిన సంగతి తెలిసిందే. ఈ వేడుకకు టాలీవుడ్ నుంచి కూడా పెద్ద ఎత్తున సెలబ్రిటీలు హాజరయ్యారు. ఒకప్పుడు ఐఫా అంటే? పరిమితంగా టాలీవుడ్ సెలబ్రిటీలు పాల్గొనేవారు. కానీ ఇప్పుడు ఆహ్వానం అందిన ఏ ఒక్కరూ మిస్ అవ్వడం లేదు. అందరూ తప్పక హాజరవుతున్నారు. ఇతర భాషల సెబ్రిటీలతో ఈజీగా మింగిల్ అవుతున్నారు. ఈ నేపథ్యంలో ఈసారి హోస్టింగ్ బాధ్యతలు రానా, యువ నటుడు తేజ సజ్జ తీసుకున్నారు.
సాధారణంగా ఐఫా హోస్టింగ్ బాధ్యతలు ఎక్కువగా బాలీవుడ్ నటులే చూసుకుంటారు. షారుక్ ఖాన్, సల్మాన్ ఖాన్, అమీర్ ఖాన్ లాంటి స్టార్ హీరోలే హోస్ట్ చేస్తుంటారు. అదే వేదికపై అలనాటి నటి రేఖ లైవ్ పెర్పార్మెన్స్ ఏటా ఉంటుంది. ఈ ఏడాది కూడా ఆమె పాల్గొన్నారు. అయితే హోస్టింగ్ విషయంలో రానా, తేజలిద్దరు బాలీవుడ్ స్టార్లను అనుకరించే ప్రయత్నం చేసి చేతులు కాల్చుకున్నట్లు కనిపిస్తుంది. ఆహుతుల్ని నవ్వించడం కోసం ఇరువురు కొన్ని జోకులు వేసారు.
వాటిలో కొన్ని పేలాయి..కొన్ని పేలలేదు. ఇందులో సంక్రాంతికి రిలీజ్ అయిన `హనుమాన్` – `గుంటూరు` కారం క్లాష్ గురించి కూడా ఉంది. సంక్రాంతి విన్నర్ ఎవరు అంటే? తేజని ఎక్కువగా ప్రమోట్ చేసారు. ఇది మహేష్ అభిమాను ల ఆగ్రహానికి దారి తీసింది. అలాగే `ఆదిపురుష్` థియేటర్లలో హనుమంతుడి కోసం ఒక సీట్ వదిలేస్తే ఆయన ఓటిటి కోసం వదిలేశాడని చెప్పడం ప్రభాస్ ఫ్యాన్స్ సహనాన్ని సైతం పరీక్షించినట్లు అయింది. అలాగే బాలయ్యకు రానా చేసిన ఫోన్ కాల్ లాంటివి సరదాగా అనిపించినా? ఎక్కడో తేడా కొట్టినట్లు గానే కనిపిస్తుంది.
ఇంకా రవితేజ `మిస్టర్ బచ్చన్` గురించి కూడా చిన్న డిస్కషన్ వచ్చింది. ఇదంతా సరదాగా తీసుకున్న టాపిక్ తప్ప కావాలని చేసిందేం కాదు. బాలీవుడ్ లో ఎంత పెద్ద స్టార్ అయినా ఒకరిపై ఒకరు సెటైర్లు వేసుకుంటారు. వాటిని అభిమానులు సహా వారు కూడా ఏమంత సీరియస్ గా తీసుకోరు. కాసేపు నవ్వి వదిలేస్తారు. కానీ టాలీవుడ్ లో హీరోలపై సెటైర్లు వేస్తే వాళ్ల కన్నా ముందు అభిమానులు ఫీలైపోతారు. అదే ఇక్కడ వచ్చిన గొడవ. ఇంకా ఐఫా లైవ్ వేడుక గనుక ప్రసారమైతే? నెట్టింట పెద్ద యుద్దమే జరిగిపోయేదేమో.