ఇకపై ప్రతీ ఏడాది ఛాంబర్ నుంచి అవార్డులు!
తాజాగా తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్( టీఎఫ్ సీసీ) ఓ కీలక నిర్ణయం తీసుకుంది.
'ఫిబ్రవరి 6' అంటే తెలుగు సినిమా పుట్టిన రోజుగా భావిస్తుంటాం. కానీ ఈ రోజుకు మాత్రం ఆదరణ పెద్దగా ఉండదు. సోషల్ మీడియాలో ఏ స్టార్ హీరో కూడా తెలుగు సినిమా పుట్టిన రోజు సందర్భంగా విషెస్ తెలియజేసిన పరిస్థితి లేదు. తెలుగు సినిమా పుట్టి కొన్ని దశాబ్ధలుగా గడుస్తున్నా? ఇండస్ట్రీలో ఫిబ్రవరి 6 అంటే సాధారణ రోజుగానే భావించారంతా. అయితే ఇప్పుడు ట్రెండ్ మారింది. తాజాగా తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్( టీఎఫ్ సీసీ) ఓ కీలక నిర్ణయం తీసుకుంది.
ఇకపై ప్రతి సంవత్సరం ఛాంబర్ నుంచి అవార్డులు ఇవ్వాలని నిర్ణయించింది. ఉత్తమ ప్రతిభ చూపిన నటీ నటులతో పాటు, ఉత్తమ చిత్రాలను గుర్తించి వారిని అవార్డులతో సత్కరించాలని నిర్ణయించింది. ఫిబ్రవరి 6వ తేదీ వచ్చిందంటే? అవార్డులు..రివార్డలుతో ఘనంగా ఆ రోజును సెలబ్రేట్ చేయాలని ఛాంబర్ నిర్ణయించింది. ప్రభుత్వం ఇచ్చే అవార్డులతోపాటు ఫిల్మ్ ఛాంబర్ నుంచి అవార్డులు ఇస్తే బాగుంటుందని ఈ నిర్ణయం తీసుకుంది.
అలాగే తెలుగు సినిమా పుట్టిన రోజున నాడు ప్రతి సినిమా నటుడు ఇంటిపై, థియేటర్ల వద్ద ప్రత్యేకంగా జెండా ఆవిష్క రించాలని తెలిపింది. తెలుగు సినిమా పుట్టినరోజు జెండా రూపకల్పన బాధ్యతను పరిచూరి గోపాలకృష్ణకు ఫిల్మ్ ఛాంబర్ అప్పగించింది. ఇలా చేయడం వల్ల తెలుగు సినిమా ఖ్యాతి మరింత పెరుగుతుందదని ఛాంబర్ భావిస్తుంది.
ఈ సందర్భంగా మురళీ మోహన్ మాట్లాడుతూ.. రాజకీయాల కంటే సినిమా వాళ్లకే ఆదరణ ఎక్కువన్నారు. రాజకీయ నేతలకు పదవీకాలం పూర్తయితే ప్రజల్లో ఆదరణ ఉండదన్నారు. మద్రాసులో ఉన్నప్పుడు తాము సినిమా కులమని గర్వంగా చెప్పుకునే వాళ్లమన్నారు. తెలుగులో మొట్ట మొదట 'భక్త ప్రహ్లాద' సినిమా 1932 ఫిబ్రవరి 6న రిలీజ్ అయింది. దీంతో ఆ రోజును తెలుగు సినిమా బర్త్ డేగా సెలబ్రేట్ చేస్తుంటారు.