పాన్ ఇండియా ఛాన్సులు తెలుగోళ్లకు ఇవ్వరా?
ప్రస్తుతం టాలీవుడ్ నుంచి ఆన్ సెట్స్ లో ఉన్న పాన్ ఇండియా సినిమాలకు పనిచేస్తోన్న వారంతా ఇతర భాషల నుంచి వచ్చిన వారే.;

టాలీవుడ్ లో ఫాంలో ఉన్న మ్యూజిక్ డైరెక్టర్లు ఎవరు? అంటే కీరవాణి, దేవి శ్రీ ప్రసాద్, థమన్ పేర్లు వినిపిస్తాయి. కీరవాణి ఇప్పటికే 'బాహుబలి', 'ఆర్ ఆర్ ఆర్' లాంటి పాన్ ఇండియా సినిమాలకు పని చేసారు. దేవి శ్రీ కూడా 'పుష్ప' ప్రాంచైజీకి బాణీలు సమకూర్చారు. థమన్ మాత్రం పాన్ ఇండియాలో ఇంకా చేరలేదు. ఇంకా రీజనల్ సినిమాలే చేస్తున్నాడు. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ లో స్పెషలిస్ట్ అయినా పాన్ ఇండియా సినిమాలకు థమన్ ని ఆ రకంగా కూడా వాడుకోవడం లేదు. ఇంకా వెలికి తీస్తే మట్టిలో మాణిక్యాలెన్నో.
మరి ప్రతిభా వంతులకు తెలుగులో అన్యాయం జరుగుతుందా? అంటే అవుననే విమర్శ వ్యక్తమవుతోంది. ప్రస్తుతం టాలీవుడ్ నుంచి ఆన్ సెట్స్ లో ఉన్న పాన్ ఇండియా సినిమాలకు పనిచేస్తోన్న వారంతా ఇతర భాషల నుంచి వచ్చిన వారే. ఆర్సీ 16 'పెద్ది' కు రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. ఇతడు తమీళియన్. గతంలో ఎన్నో తెలుగు సినిమాల్ని రిజెక్ట్ చేసినా పిలిచి మరీ ఆర్సీ 16కి ఛాన్స్ ఇచ్చారు. అనిరుద్ కూడా మద్రాస్ నుంచే. గతంలో చాలా తెలుగు సినిమాలకు సంగీతం అందించాడు. ఎన్టీఆర్ నటించిన పాన్ ఇండియా చిత్రం 'దేవర'కు ఇతడే సంగీతం అందించాడు.
శ్యామ్. సి.ఎస్ 'పుష్ప' చిత్రానికి అడీషనల్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించాడు. రీసెంట్ రిలీజ్ 'జాక్' కి కూడా ఇతడే సంగీతం అందించాడు. ఇతడు కేరళకు చెందిన వారు. 'సలార్' చిత్రానికి రవి బస్రూర్ సంగీతం అందించాడు. ఎన్టీఆర్ -ప్రశాంత్ నీల్ తాజా చిత్రానికి అతడే సంగీతం అందిస్తున్నాడు.అజనీష్ లోక్ నాధ్ ఈ మధ్య తెలుగు సినిమాలకు ఎక్కువగా సంగీతం అందిస్తున్నాడు. ఇతడు కూడా 'పుష్ప' కి అడిషన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించాడు. అలాగే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ 22వ చిత్రానికి సాయి అభ్యంకర్ సంగీతం అందిస్తున్నాడు.
సంగీత దర్శకుడిగా ఇదే అతడి తొలి సినిమా. ఓసాంగ్ కంపోజ్ చేసిన విధానం నచ్చి అట్లీ అవకాశం ఇచ్చాడు. ఇంకా చాలా మంది ఇతర భాషల సంగీత దర్శకులు టాలీవుడ్ లో చక్రం తిప్పుతున్నారు. వీళ్లంతా ఇతర భాషల నుంచి దిగుమతి అయిన వారే. ఇలా తెలుగు డైరెక్టర్లు అంతా పొరుగింట పుల్లకూరకే ప్రాధాన్యత ఇస్తున్నారు తప్ప టాలీవుడ్ వాళ్లకు ఛాన్స్ ఇవ్వలేదు. ప్రతిభా వంతుల్ని వెతికి పట్టుకునే ప్రయత్నం కూడా చేయడం లేదు.