టాలీవుడ్‌కి కేసీఆర్ చేసిందేం లేదు! రేవంత్ అయినా చేస్తారా?
దానిని ఎప్పుడూ అవసరానికి ఉపయోగించుకుని విసిరి పారేస్తుంటారనేది ప్రూవ్ అయింది.
ప్రకటనలు ఘనం- పనులు శూన్యం! అన్న రొటీన్ హెడ్ లైన్ లా తెలుగు సినీపరిశ్రమ అభివృద్ధిపై ప్రభుత్వాధినేతల ప్రకటనలు ఎప్పుడూ నీరసపరిచేవే!! ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడి దాదాపు 10 ఏళ్లు పూర్తయినా కానీ, ఆంధ్రప్రదేశ్ నుంచి విడిపోయిన హైదరాబాద్ లో ఉన్న టాలీవుడ్ కోసం గత ప్రభుత్వం చేసింది శూన్యం అన్న విశ్లేషణలు ఉన్నాయి. ప్రభుత్వమే స్టూడియోలు నిర్మించి సినిమాని మరింత అభివృద్ధి దిశగా తీసుకెళతాయని, కళారంగంలో ప్రతిభావంతులను ప్రోత్సహించేందుకు, వారి సంక్షేమం కోసం ఖర్చు చేసేందుకు ప్రభుత్వాలు సిద్ధమేనని బహిరంగ వేదికలపై నాయకులు ప్రకటించినా కానీ అవేవీ సీరియస్ గా నిజాలు కాలేదు. నిజానికి రాజకీయ వంటకంలో టాలీవుడ్ ఒక కరివేపాకు లాంటిది. దానిని ఎప్పుడూ అవసరానికి ఉపయోగించుకుని విసిరి పారేస్తుంటారనేది ప్రూవ్ అయింది.
నిజానికి హైదరాబాద్ ని సినిమా హబ్ గా మారుస్తామని, గ్రాఫిక్స్- యానిమేషన్ ఇంక్యుబేటర్ గా అభివృద్ధి చేస్తామని, లేదా వరల్డ్ క్లాస్ ఫిల్మీ టెక్నాలజీని హైదరాబాద్ కి తీసుకుని వస్తామని, ప్రపంచ స్థాయికి చేరుస్తామని రకరకాలుగా రాజకీయ నాయకులు గతంలో ప్రకటించారు. అంతేకాదు.. పూణే ఫిలింఇనిస్టిట్యూట్ తరహాలో హైదరాబాద్ ఫిలిం ఇనిస్టిట్యూట్ ని నెలకొల్పుతామని కూడా గతంలో ఘనంగా ప్రకటించారు ప్రభుత్వాధినేతలు. కానీ ఏం ప్రయోజనం అంతా శూన్యం. ప్రకటనలు ఘనం పనులు శూన్యం! అని నిరూపణ అయ్యాయి.
అయితే ఈ రోజు దర్శకరత్న దాసరి నారాయణరావు జయంతి కార్యక్రమాల్లో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఘనమైన ప్రకటన చేస్తారని తెలుగు సినీ పరిశ్రమ ఎంతో ఉత్కంఠగా వేచి చూస్తోంది. తనను ముఖ్య అతిథిగా ఆహ్వానించిన దర్శకుల సంఘానికి రేవంత్ హామీ ఇచ్చేసారని కూడా ప్రచారం సాగుతోంది. గడిచిన పదేళ్లలో తెరాస ప్రభుత్వం టాలీవుడ్ కి చేసిందేమీ లేదు.. ఒక్క టికెట్ రేట్ల వెసులుబాటు తప్ప ఇంకేదీ లేదు.. పూణే ఫిలింఇనిస్టిట్యూట్ తరహా హైదరాబాద్ లో నిర్మిస్తామన్న కేసీఆర్ - కేటీఆర్ అది చేయడంలో దారుణంగా విఫలమయ్యారు.. ట్యాలెంట్ కి అవార్డులతో ప్రోత్సాహకాలు కూడా ఏవీ లేవన్న విమర్శలున్నాయి. ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం అయినా దీనికి భిన్నంగా తెలుగు చిత్రసీమ కోసం ఏదైనా చేస్తుందా? అంటూ అంతటా వేచి చూస్తున్నారు. కనీసం పూణే ఫిలింఇనిస్టిట్యూట్ తరహాలో ఒక ఇనిస్టిట్యూట్ ని హైదరాబాద్ లో నెలకొల్పి స్థానిక ప్రతిభకు పెద్ద సాయం చేస్తారా? పాన్ ఇండియా స్థాయికి ఎదిగిన తెలుగు సినిమా మరో ముందడుగు వేసేందుకు ఏం చేయబోతున్నారు? దర్శకసంఘం భవంతి నిర్మాణానికి ఆయన ఏదైనా సహాయం అందజేస్తున్నారా? అన్నది వేచి చూడాలి. ఇప్పుడు రేవంత్ కనీసం పూణే ఫిలింఇనిస్టిట్యూట్ తరహాలో ప్రభుత్వం తరపున ఏదైనా ఇనిస్టిట్యూట్ ని హైదరాబాద్ నడిబొడ్డుకి తెస్తారా? అన్నది వేచి చూడాలి.