టాప్ స్టోరి: దటీజ్ తెలుగు ఇండస్ట్రీ
టాలీవుడ్ ఇప్పుడు సవ్యదిశలో కొనసాగుతోంది. నేడు జాతీయ అంతర్జాతీయ స్థాయిలో తెలుగు సినిమా ఖ్యాతి ఇనుమడిస్తోంది.
తెలుగు సినిమా దశ దిశ అమాంతం మారింది. "ప్రతిసారీ ఏదైనా ఒక కొత్త సంఘటన జరిగినప్పుడు దాని పర్యవసానంగా పరిశ్రమలో చాలా మార్పులు వస్తాయి.. చాలా అభివృద్ధి జరుగుతుంది!" అని దివంగత సూపర్ స్టార్ కృష్ణ అంటుండేవారు. ఆయన మాట అక్షరాలా నిజం. ప్రతిసారీ ఇండస్ట్రీ రికార్డులు బ్రేక్ అయినప్పుడు అంతకుమించి తెలుగు సినిమా కాన్వాస్ స్పాన్ ఎదిగాయి. బాహుబలి ముందు బాహుబలి తర్వాత.. టాలీవుడ్ ఏ స్థాయికి ఎదిగిందో ఇప్పుడు మనం చూస్తున్నాం. ఈ ప్రగతి అనన్య సామాన్యమైనది. తెలుగు సినీపరిశ్రమలో అపారంగా దాగి ఉన్న ప్రతిభ అంతకంతకు బయటపడుతోంది. టాలీవుడ్ ఇప్పుడు సవ్యదిశలో కొనసాగుతోంది. నేడు జాతీయ అంతర్జాతీయ స్థాయిలో తెలుగు సినిమా ఖ్యాతి ఇనుమడిస్తోంది.
నిజానికి టాలీవుడ్ ఈ ఏడాది జాతీయ అవార్డులు కొల్లగొట్టక ముందే అంతర్జాతీయ అవార్డులను సైతం కైవశం చేసుకుంది. ప్రతిష్ఠాత్మక ఆస్కార్ సహా గోల్డెన్ గ్లోబ్స్ పురస్కారాల్ని తెలుగు సినిమా తన ఖాతాలో వేసుకుంది. ప్రఖ్యాత హాలీవుడ్ క్రిటిక్స్ పురస్కారాలను సైతం తెలుగు సినిమా గెలుచుకుంది. ముఖ్యంగా హాలీవుడ్ దిగ్గజాలు లెజెండరీల హృదయాలను గెలుచుకునేందుకు ఆర్.ఆర్.ఆర్ సినిమా రాచబాట వేసింది. బాహుబలి 1- బాహుబలి 2 తర్వాత ఆర్.ఆర్.ఆర్ తో సరికొత్త దారులు తెరుచుకున్నాయి. తెలుగు చిత్రపరిశ్రమ సరికొత్త పుంతలు తొక్కేందుకు దారి దొరికింది.
ఆర్.ఆర్.ఆర్ ఆరు జాతీయ అవార్డులను ఖాతాలో వేసుకోగా.. ఇప్పుడు ఇది చాలదు అన్నట్టు పుష్ప చిత్రం రెండు జాతీయ అవార్డులతో సంచలనాలు సృష్టించింది. ఉప్పెన- కొండపొలం లాంటి సినిమాలు ఈసారి జాతీయ అవార్డుల్లో ఒక్కో అవార్డును కైవశం చేసుకున్నాయి. టాలీవుడ్ లో అన్ని విభాగాల్లో నిరూపించుకునే గొప్ప ప్రతిభావంతులు ఉన్నారని నిరూపితమైంది. తెలుగు సినిమా ఏకంగా 10 జాతీయ అవార్డులను గెలుచుకుంది. ఈ ఫలితం కొత్త ఆశలను రేకెత్తిస్తోంది. ఇతరులకంటే మనం ముందున్నామన్న భరోసా కల్పిస్తోంది. మునుముందు టాలీవుడ్ లో ఎన్నో అద్భుతాలు జరగడం ఖాయమన్న గ్యారెంటీ ఇప్పుడు కనిపిస్తోంది. జాతీయ స్థాయిలో మార్కెట్ ని కొల్లగొట్టిన టాలీవుడ్ మునుముందు హాలీవుడ్ కే గురి పెట్టడం ఖాయం.
నాగ్ అశ్విన్ - ప్రభాస్ కాంబినేషన్ మూవీ 'కల్కి2898AD'తో మరో మైలురాయిని అందుకోవడం ఖాయమన్న భరోసా లభిస్తోంది. ప్రభాస్ నటిస్తున్న సలార్ మరో అడుగు ముందుకు వేయిస్తుంది. అటుపై అల్లు అర్జున్ పుష్ప 2తో మరో స్థాయికి టాలీవుడ్ ని తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. ఇక మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ - శంకర్ కాంబినేషన్ మూవీ.. ఎస్.ఎస్.రాజమౌళి సూపర్ స్టార్ మహేష్ కాంబినేషన్ అడ్వెంచర్ మూవీతో తెలుగు సినిమా స్థాయి మరింత పెరుగుతుందని అంచనా. జాతీయ అంతర్జాతీయ మార్కెట్లను కొల్లగొట్టే స్థాయికి మనం చేరుకున్నామని గర్వంగా చెప్పుకునే తరుణం ఆసన్నమవుతోంది. ఇతర పరిశ్రమలను పక్కకు నెట్టి అన్నిటిలో టాలీవుడ్ ముందంజలో ఉందని ఇప్పుడు నిరూపితమవుతోంది. ఇది గొప్ప మేలిమి మలుపు. ఈ ఉత్సాహంలో కుంభాన్ని కొట్టేందుకు మన దర్శకనిర్మాతలు హీరోలు ఎవరి ప్రణాళికల్లో వారు ఉన్నారు. 1000 కోట్లు టాలీవుడ్ కి లెక్కే కాదు. అంతకుమించి అని నిరూపించాలన్నదే వీరి తపన. భారతదేశం చందమామ పైనే అడుగుపెట్టింది. ఇప్పుడు టాలీవుడ్ హాలీవుడ్ ని కొల్లగొట్టే ప్రయత్నం చేస్తే తప్పేం ఉంది? జయహో టాలీవుడ్. సెల్యూట్ టు హమారా గ్రేట్ ట్యాలెంట్.