కొండా సురేఖ వ్యాఖ్యలపై TFCC సీరియస్.. తగిన చర్యలు తీసుకోవడానికి రెడీ!
హేయమైన వ్యాఖ్యలకు వ్యతిరేకంగా మొత్తం తెలుగు సినీ పరిశ్రమ ఏకతాటిపై నిలబడుతుందని చెబుతూ ప్రెస్ నోట్ ను విడుదల చేసింది.
తెలుగు సినీ నటుడు నాగార్జున కుటుంబంతో పాటు నటి సమంతపై మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు.. ఎంతటి దుమారాన్ని రేపాయో అందరికీ తెలిసిందే. ఇప్పటికే నాగార్జున ఆ విషయంపై నాంపల్లి కోర్టును ఆశ్రయించారు. సురేఖపై పరువు నష్టం దావా వేశారు. తాజాగా తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ (TFCC) స్పందించింది. హేయమైన వ్యాఖ్యలకు వ్యతిరేకంగా మొత్తం తెలుగు సినీ పరిశ్రమ ఏకతాటిపై నిలబడుతుందని చెబుతూ ప్రెస్ నోట్ ను విడుదల చేసింది.
"తెలంగాణకు చెందిన ఓ గౌరవనీయ మహిళా మంత్రి తెలుగు చలనచిత్ర పరిశ్రమకు చెందిన వ్యక్తుల వ్యక్తిగత జీవితాలకు సంబంధించి చేసిన అభ్యంతరకరమైన పట్ల బాధ ఆవేదనను వ్యక్తం చేస్తున్నాం. గత కొన్ని సంవత్సరాలుగా, తెలుగు సినీ సెలబ్రిటీలు చాలా మందికి టార్గెట్ గా మారారు. ఇతరుల దృష్టిని ఆకర్షించడం కోసం చేసిన హేయమైన వ్యాఖ్యలకు వ్యతిరేకంగా మొత్తం తెలుగు సినీ పరిశ్రమ ఏకతాటిపై నిలబడుతుందని చెబుతున్నాం"
"సమాజంపై రాజకీయాలు, సినిమాలు గణనీయమైన ప్రభావాన్ని చూపుతాయి. ఈ రెండు రంగాలు పరస్పర సహకారం, గౌరవం అందిపుచ్చుకుంటూ సమాజంలో తమ బాధ్యతను గుర్తెరిగి ఉండడం చాలా కీలకం. రాజకీయ నాయకులు అపారమైన అధికారాన్ని కలిగి ఉంటారు. సినిమాలు సాంస్కృతిక కథనాలను రూపొందిస్తాయన్నది వాస్తవం. ప్రజాస్వామ్య దేశంలో వాక్ స్వాతంత్య్రాన్ని ఎవరైనా దుర్వినియోగం చేయకూడదని పేర్కొంటున్నాం"
"వేరే ఏదైనా సమస్యను దృష్టిని మరల్చడం కోసం తెలుగు చలనచిత్ర పరిశ్రమలోని కొందరు వ్యక్తుల వ్యక్తిగత జీవితాలను లక్ష్యంగా చేసుకోవడం ఒక ఫ్యాషన్ గా మారింది. సంస్కృతిని ప్రభావితం చేయడంలో, సాధారణ ప్రజల దృక్కోణాలను రూపొందించడంలో ఫిల్మ్ ఫ్రాటర్నిటీ సహాయపడుతుందని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. రాజకీయాలు జీవితాలను ప్రభావితం చేసే విధానాలు రూపొందిస్తాయి. సినిమాలు సమాజంలో సామాజిక భాద్యతను తెలియజేసేలా ప్రతిబింబిస్తాయి. ఈ రెండు ప్రపంచాల మధ్య వ్యత్యాసాన్ని అందరూ అభినందిద్దాం"
"ముఖ్యంగా హేయమైన చర్యలు మానుకోవాలని అందరినీ కోరుతున్నాం. మీడియా మిత్రులు కూడా నైతిక సూత్రాలతోపాటు విలువలను పాటించవలసిందిగా కోరుతున్నాం. తెలుగు చలనచిత్ర పరిశ్రమ జాతి,లింగ,మత వివక్ష లేకుండా లౌకిక సంస్థగా ఎల్లప్పుడూ ముందంజలో ఉంది. TFCC తమ సభ్యులకు ఎప్పుడూ అండగా నిలుస్తుంది. తెలుగు చలనచిత్ర పరిశ్రమకు చెందిన సభ్యుల వ్యక్తిగత జీవితాలతో ముడిపడి సున్నితమైన విషయాలపై ఎవరైనా తప్పుగా మాట్లాడితే వారిపై తగిన చర్యలు తీసుకోవడానికి వెనుకాడమని మరోసారి తెలియజేస్తున్నాం" అని ప్రకటనలో TFCC పేర్కొంది.