రికార్డ్‌లను ప్రకటించిన టీజీ ఎక్సైజ్ శాఖ.. పుష్ప 2తో పోటీ!
తెలంగాణ ఎక్సైజ్ శాఖ ప్రకటించిన లెక్కలు ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా ఉన్నాయి.
ప్రతి సంవత్సరం డిసెంబర్ 31న అత్యధిక మద్యం అమ్మకాలు జరుగుతాయి. ఈ విషయం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పండుగలు, ప్రత్యేక రోజుల్లో సహజంగానే మద్యం అమ్మకాలు భారీగా ఉంటాయి. అయితే డిసెంబర్ 31న ప్రత్యేక రోజులతో పోల్చితే రెండు మూడు రెట్లు అధికంగా ఉంటాయి. కొందరు రెండు మూడు రోజుల నుంచి మద్యం కొనుగోలు చేయడం జరుగుతుంది. తెలంగాణ రాష్ట్రంలో 2024 సంవత్సరానికి మందు బాబులు రికార్డ్ స్థాయిలో మద్యం కొనుగోలు చేసి వీడ్కోలు పలికారు. తెలంగాణ ఎక్సైజ్ శాఖ ప్రకటించిన లెక్కలు ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా ఉన్నాయి.
డిసెంబర్ 31 రోజున ఏకంగా రూ.403 కోట్ల మద్యం అమ్మకాలు జరిగాయి. గతంతో పోల్చితే ఇది చాలా ఎక్కువగా అధికారులు ప్రకటించారు. మందుబాబులకు అనుకూలంగా ప్రభుత్వం కొంత సమయం అదనంగా షాప్స్‌ను ఓపెన్ చేసి ఉంచింది. అందుకే అర్థరాత్రి దాటి తర్వాత కూడా రికార్డ్ స్థాయిలో మద్యం అమ్మకాలు జరిగాయి. ఒకవైపు మద్యం అమ్మకాలు రికార్డ్ స్థాయిలో జరిగాయి. అదే స్థాయిలో డ్రింక్ అండ్ డ్రైవ్‌లో మందు బాబులు పట్టుబడ్డారు. పెద్ద మొత్తంలో ఫైన్స్ వేస్తామని చెప్పినా పెద్దగా పట్టించుకోకుండా తాగుతూనే డ్రైవ్ చేయడం రోడ్ల మీద కనిపించింది. ముఖ్యంగా హైదరాబాద్‌లో డ్రంక్ అండ్ డ్రైవ్‌లో వందల మంది పట్టుబడ్డారు.
డిసెంబర్ 28 నుంచి 31 అర్థ రాత్రి షాప్స్ క్లోజ్ చేసే వరకు తెలంగాణలో మొత్తంగా రూ.1800 కోట్ల మద్యం అమ్మకాలు జరిగాయి. ఇది రాష్ట్ర చరిత్రలో నిలిచి పోయే నెంబర్ అంటూ నెట్టింట ప్రచారం జరుగుతోంది. పుష్ప 2 సినిమా లాంగ్ రన్‌లో రూ.1800 కోట్ల వసూళ్లు నమోదు చేయడం కోసం కిందా మీదా పడుతోంది. ఆ నెంబర్‌ను చేరితే బాహుబలి 2 రికార్డ్ బ్రేక్ అవుతుంది. పుష్ప 2 రూ.1800 కోట్ల నెంబర్‌ను చేరుకోవడం కోసం ప్రయత్నాలు చేస్తూ ఉంటే తెలంగాణ మందు బాబులు మాత్రం నాలుగు రోజుల్లో ఆ మొత్తంను ప్రభుత్వంకు కట్టబెట్టారు.
తెలంగాణ ప్రభుత్వంకు వందల కోట్ల రూపాయలు పన్నుల రూపంలో ఈ నాలుగు రోజుల్లో వచ్చింది. తాగుబోతుల ద్వారా వచ్చిన డబ్బుతో ఒక సంక్షేమ పథకంను కొత్తగా ప్రభుత్వం మొదలు పెట్టినా ఆశ్చర్యం లేదు అంటూ కొందరు సరదాగా మీమ్స్ చేస్తున్నారు. మొత్తానికి కొత్త సంవత్సరాన్ని భారీగా వెల్ కమ్ చేసిన తెలంగాణ తాగుబోతులు ఈ ఏడాది మొత్తం ఎలా ప్రభుత్వంకు పన్ను చెల్లిస్తారు అనేది దీన్ని బట్టి అర్థం అవుతుంది. 2024ను రూ.403 కోట్లతో ముగించిన మందు బాబులు 2025ను రూ.600 కోట్లతో ముగిస్తారేమో చూడాలి.