1200 ఎకరాల్లో EV పరిశ్రమ..పీపుల్ మీడియా అధినేత భారీ డీల్
టాలీవుడ్ లో వరుసగా భారీ చిత్రాలను నిర్మిస్తూ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ దూసుకుపోతున్న సంగతి తెలిసిందే.
టాలీవుడ్ లో వరుసగా భారీ చిత్రాలను నిర్మిస్తూ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్‌తో `రాజా సాబ్`, బాలీవుడ్ స్టార్ హీరో సన్నీడియోల్ తో `జాత్` వంటి భారీ చిత్రాలను నిర్మిస్తున్న ఈ సంస్థ ఇతర హీరోలతోను సినిమాలను నిర్మిస్తోంది. ప్రస్తుతం ఇవన్నీ సెట్స్ పై ఉన్నాయి.
తాజాగా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అధినేత విశ్వప్రసాద్ సహా, పీపుల్ టెక్ ఎంటర్ ప్రైజెస్ ప్రతినిధులు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు. పీపుల్ టెక్ ఎంటర్ ప్రైజెస్ సంస్థ ఓర్వకల్లు (కర్నూలు) దగ్గర 12వందల ఎకరాల్లో ఎలక్ట్రిక్ వెహికిల్ పార్కు నెలకొల్పేందుకు ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వంతో ఎం.ఓ.యు కుదుర్చుకుంది. ఇందుకు సంబంధించిన వివరాలను పీపుల్ టెక్ గ్రూప్ సి.ఈ.ఓ. విశ్వప్రసాద్ అందించారు.
విశ్వప్రసాద్ మాట్లాడుతూ-``వాహన తయారీ, ఆర్ అండ్ డి. కేంద్రాలు, టెస్టింగ్ ట్రాక్స్, ప్లగ్ అండ్ ప్లే ఇండస్ట్రియల్ ప్రాంతం వంటివి పారిశ్రామిక పార్క్ లో ఉంటాయి. దేశంలో ఇదే తొలి ప్రైవేట్ ఈ.వి. పార్క్. దీని ద్వారా రూ.13 వేల కోట్ల పెట్టుబడులతో పాటు, 25 వేల మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభిస్తాయి`` అని వివరించారు.
పవన్ కళ్యాణ్ స్పందిస్తూ -``కర్నూలు జిల్లా ఓర్వకల్లు దగ్గర ఎలక్ట్రిక్ వెహికిల్ పార్క్ ఏర్పాటు కానుండటం ఆహ్వానించదగ్గ పరిణామం. రాష్ట్ర పారిశ్రామిక అభివృద్ధికి ఇదొక మైలు రాయి`` అన్నారు. కాలుష్యాన్ని గణనీయంగా తగ్గించడంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దృష్టి పెట్టారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం కూడా ఎలక్ట్రిక్ వాహనాలు విరివిగా అందుబాటులోకి వచ్చే దిశగా కృషి చేస్తున్నట్లు ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తెలిపారు. కాలుష్యం తగ్గించడానికి ఈవీ పరిశ్రమ అవసరమని వ్యాఖ్యానించారు. ఈ సమావేశంలో శ్రీ భాస్కర రెడ్డి, శ్రీ రవికిరణ్ ఆకెళ్ళ, శ్రీ బాబ్ డఫ్ఫీ, శ్రీ స్టీవ్ గెర్బర్, శ్రీ హెరాల్డ్ రక్రిజెల్ తదితరులు ఉన్నారు.
పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ గతంలో పవన్ కల్యాణ్- సాయి తేజ్ ప్రధాన పాత్రల్లో `బ్రో` చిత్రాన్ని నిర్మించిన సంగతి తెలిసిందే. పీపుల్ టెక్ & పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంస్థల అధినేత విశ్వప్రసాద్ తెలుగుదేశం నాయకుడు, మాజీ ఎంపీ టీజీ వెంకటేష్ కి బంధువు. టీజీ కుటుంబానికి ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో దశాబ్ధాలుగా సత్సంబంధాలున్నాయి.