అంబటి 'బ్రో' వల్ల ఎంత ఫ్రీ పబ్లిసిటో
బ్రో మూవీటీమ్ కూడా చేయనంత ప్రమోషన్స్ ఆ సినిమా కోసం మంత్రి అంబటి రాంబాబు చేస్తున్నట్లు బయట మాటలు వినిపిస్తున్నాయి
'బ్రో' సినిమా వివాదం ఇప్పుట్లో ఆగేట్టుగా కనపడట్లేదు. ఈ మూవీ రిలీజ్ తర్వాత 'అంబటి రాంబాబు వర్సెస్ జనసేన'గా శ్యాంబాబు వ్యవహారం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. చిత్రంలో మంత్రి అంబటి రాంబాబు డ్యాన్స్ ఇమిటేట్ చేయడం, దీంతో మంత్రి ఫీలవ్వడం.. ట్వీట్లు, ప్రెస్ మీట్ల యుద్ధం కొనసాగుతున్న సంగతి తెలిసిందే.
వాస్తవానికి పవన్ సినిమా అంటేనే ఎప్పుడు మీడియాలో ట్రెండ్ గానే ఉంటుంది. కానీ ఈ సారి సినిమా కాస్త డివైడ్ టాక్ రావడం వల్ల హైప్ తగ్గే అవకాశం ఉంటుందని అంతా అనుకున్నారు. కానీ ఇప్పుడా పరిస్థితి అస్సలు కనపడట్లేదు. బ్రో మూవీటీమ్ కూడా చేయనంత ప్రమోషన్స్.. ఆ సినిమా కోసం మంత్రి అంబటి రాంబాబు చేస్తున్నట్లు బయట మాటలు వినిపిస్తున్నాయి. అంబటి.. పవన్ ను ఓ పట్టాన్న వదిలేలా కనిపించడం లేదని, దీనివల్ల ఆయనకు లాభం ఉందో లేదో తెలీదు కానీ 'బ్రో' సినిమాకు మాత్రం ఫుల్ అడ్వాంటేజ్ గా కనిపిస్తోంది చెబుతున్నారు.
ఇప్పుడీ విషయాన్ని బ్రో నిర్మాత టీజీ విశ్వప్రసాద్ కూడా పరోక్షంగా చెప్పారు. తాజా ఇంటర్వ్యూలో అంబటి రాంబాబు చేసిన ఆరోపణల్లో ఎటువంటి నిజం లేదని అన్నారు. 'బ్రో' సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అని, వసూళ్లు తాము ఆశించిన స్థాయి కన్నా ఎక్కువగా వస్తున్నాయని తెలిపారు. నాన్ థియేట్రికల్ రైట్స్ ఎక్కువ మొత్తంలో వచ్చాయని, థియేట్రికల్ రైట్స్ ఊహించిన దాని కన్నా ఎక్కువగా వచ్చాయని తెలిపారు. మొత్తంగా సినిమా వల్ల తాము మంచి లాభాలు అందుకున్నట్లు పేర్కొన్నారు. ఈ చిత్ర రూపొందించే విషయంలో మనీ రూటింగ్ ఏమీ జరగలేదని చెప్పారు. అంబటి చెప్పినవన్నీ అవాస్తమనే తెలిపారు.
పాలిటిక్స్ వేరు సినిమా వేరు అని చెప్పుకొచ్చారు విశ్వప్రసాద్. ఈ రాజకీయ విమర్శల వల్ల పబ్లిసిటీ తమకు కలిసొస్తుందంటూ చమత్కరించారు. అంబటి వల్ల తమకు పబ్లిసిటీ వస్తుందని నేను చెప్పట్లేదంటూనే పరోక్షంగా వస్తుందన్నట్టుగా చెప్పారు. తనకు అన్ని పార్టీల్లో మిత్రులు ఉన్నారని సమాధానం చెప్పారు విశ్వప్రసాద్.
అయితే నిర్మాత విశ్వప్రసాద్ కామెంట్లకు అంబటి రాంబాబు తిరిగి ఎలాంటి వ్యాఖ్యలు చేస్తారనేది ప్రస్తుతం అటు సినీ ఇండస్ట్రీలో ఇటు ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఇకపోతే విమర్శలు, ప్రతివిమర్శల గురించి పక్కన పెడితే... 'బ్రో' సినిమా మంచి వసూళ్ళనే అందుకుంటున్నట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. వంద కోట్ల మార్క్ చేరుకుందని చెబుతున్నాయి.