ఎస్పీ చరణ్ తో వివాదం.. తరుణ్ భాస్కర్ ఏమన్నారంటే..

తాజాగా ఓ ఈవెంట్ లో తరుణ్ భాస్కర్ ఎస్పీ చరణ్ తో వివాదంపై మాట్లాడారు.

Update: 2024-03-17 08:46 GMT

స్టార్ డైరెక్టర్ తరుణ్ భాస్కర్ తెరకెక్కించిన కీడా కోలా సినిమా.. ఇటీవల వివాదంలో చిక్కుకున్న సంగతి తెలిసిందే. లెజెండరీ సింగర్, దివంగత ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం వాయిస్ ను ఏఐ ద్వారా రీ క్రియేట్ చేసినందుకు ఆయన కుమారుడు ఎస్పీ చరణ్ అసంతృప్తి వ్యక్తం చేశారు. కీడా కోలా మూవీ సంగీత దర్శకుడు వివేక్ సాగర్ తోపాటు చిత్ర బృందానికి జనవరిలో లీగల్ నోటీసులు పంపారు.

అందులో ఎస్పీ బాలు వాయిస్ ను చట్టవిరుద్ధంగా, కుటుంబ సభ్యుల పర్మిషన్ తీసుకోకుండా వాడినందుకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు చరణ్. నష్టపరిహారం కూడా చెల్లించాలని నోటీసుల్లో పేర్కొన్నారు. అయితే ఈ విషయం ఆ మధ్య టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారినా.. కీడా కోలా మేకర్స్ ఎక్కడ కూడా స్పందించలేదు. తాజాగా ఓ ఈవెంట్ లో తరుణ్ భాస్కర్ ఎస్పీ చరణ్ తో వివాదంపై మాట్లాడారు.

ఎస్పీ చరణ్ సార్ కు, తమకు కమ్యూనికేషన్ గ్యాప్ సమస్య వచ్చిందని తరుణ్ భాస్కర్ తెలిపారు. ఇండస్ట్రీలో ఎవరైనా సమ్ థింగ్ స్పెషల్ గా, కొత్తగా చేయాలనుకుంటారని, తాను కూడా అలాగే అనుకున్నట్లు చెప్పారు. లెజెండరీలను గౌరవించాల్సిన అవసరం ఉందని, ఎవరినీ అవమానించాలని తాము అనుకోలేదని వెల్లడించారు. కమర్షియల్ మెంటాలిటీతో అలా చేయలేదని తరుణ్ భాస్కర్ చెప్పారు.

"ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ఇప్పుడు మెల్లమెల్లగా అభివృద్ధి చెందుతోంది. చాలా మంది ఉద్యోగాలకు తీవ్రమైన ముప్పు కలిగిస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో మనమంతా అందరినీ గౌరవిస్తూ ప్రయోగాలు చేయాల్సిందే. ఇప్పుడు నేను చేసినా, చేయకపోయినా ఏఐ ఎవల్యూషన్ అనేది తప్పక జరుగుతుంది. కొంత కమ్యూనికేషన్ సమస్య ఉంది అంతే. ఇప్పుడంతా క్లియర్ అయిపోయింది" అని తరుణ్ భాస్కర్ వివరించారు.

కీడా కోలా మూవీలోని ఓ సీన్ లో బ్యాక్ గ్రౌండ్ లో ఫేమస్ స్వాతిలో ముత్యమంత పాట వినిపిస్తోంది. ఆ సాంగ్ కోసం బాల సుబ్రహ్మణ్యం గొంతును ఏఐ ద్వారా రీ క్రియేట్ చేశారు తరుణ్ భాస్కర్. దీంతో ఈ విషయాన్ని ఎస్పీ చరణ్ సీరియస్ గా తీసుకున్నారు. అభ్యంతరం తెలిపి మూవీ యూనిట్ కు నోటీసులు పంపారు. అయితే డైరెక్టర్ తరుణ్ భాస్కర్ లేటెస్ట్ క్లారిటీతో ఎస్పీ చరణ్ తో వివాదం మొత్తం క్లియర్ అయిపోయినట్లే.

Tags:    

Similar News