అవసరాలకి ఆ పనేంటేనే ఇష్టమట
నటుడిగా తన వద్దకు వచ్చిన అవకాశాలు కాదనకుండా నటిస్తున్నా! ఆయన ఆసక్తి అంతా దర్శకత్వంవైపు ఉందని మీడియాలో పలుమార్లు కథనాలు వెలువడ్డాయి.
యాక్టర్ కం డైరెక్టర్..రైటర్ అవసరాల శ్రీనివాస్ గురించి పరిచయం అవసరం లేదు. నటుడిగా అవకాశాలు అందుకుంటూనే అప్పుడప్పుడు దర్శకుడిగానూ సత్తా చాటుతున్నారు. అవసరమైనప్పుడు రచయి తగానూ మారిపోతున్నారు. అనువాద చిత్రాలకు పనిచేస్తున్నారు. ఈ మధ్య కాలంలో ఎక్కువగా రచనవైపే ఆసక్తి చూపిస్తున్నట్లు కనిపిస్తుంది. నటుడిగా తన వద్దకు వచ్చిన అవకాశాలు కాదనకుండా నటిస్తున్నా! ఆయన ఆసక్తి అంతా దర్శకత్వంవైపు ఉందని మీడియాలో పలుమార్లు కథనాలు వెలువడ్డాయి.
తాజాగా ఓ ఇంటర్వ్యూలో రచన..దర్శకత్వం..నటన ఈ మూడింటిలో ఏది ఆసక్తి ఎక్కువంటే? 'నాకు రాయడం అంటేనే ఇష్టం' అన్నారు. రాయడంలో ఉన్నంత స్వేచ్ఛ ఇంకెక్కడా దొరకదు. ఉండదు. ఎవరిపైనా ఆధారపడకుండా చేసే ప్రయాణం ఇది. కాబట్టి బాగా ఆస్వాదిస్తాను. వెబ్ సిరీస్ లకు రాయడంలో ఎక్కువ సవాళ్లు ఉంటాయి. మనం ఇంకా ఆ మాధ్యమానికి అలవాటు పడలేదు.
ఐదారు భాగాల్లో రూపొందే సిరీస్ ల్లో భావోద్వేగాలకి.. సినిమాలో భావోద్వేగాలకీ తేడాలు గమనించాను. ఆ తేడాని అర్దం చేసుకుని కథని నడిపించాల్సి ఉంటుంది. విజయవంతమైన వెబ్ సిరీస్ 'కుమారి శ్రీమతి'కి రెండవ భాగం స్క్రిప్ట్ సిద్దం చేస్తున్నా. అలాగే మర్డర్ మిస్టరీ నేపథ్యంలోనూ ఓ కథని సిద్దం చేస్తున్నా' అన్నారు. ఇక అవసరాలలో మరో రేర్ క్వాలిటీ కూడా ఉందండోయ్. ఈయన దర్శకు డని..రచయిత అని అవతలి వారికి అస్సలు సలహా ఇవ్వరుట.
ఏ సినిమాకి పనిచేసినా చెప్పడం కంటే నేర్చుకోవడంపైనే దృష్టి పెడతా అంటున్నారు. ఒక్కోక్కరికి ఒక్కో పద్దతి. వాళ్లకు నచ్చిన పద్దతిలో మనం వెళ్లాలి. ఆ కథ రాసుకుంది వాళ్లు కాబట్టి ఎలా చేయాలి? అన్నది వాళ్లకే బాగా తెలుస్తుందని నమ్ముతాను. ఆ సమయంలో నా దర్శకుడు ఏది చెబితే అదే చేస్తాను. జానర్ ని బట్టి సినిమా ఉంటుంది. మాస్ సినిమాలు చేస్తున్నప్పుడు అక్కడ డైలాగు లు ఒకలా..డ్రామా చేస్తున్నప్పుడు మరోలా డైలాగు లుంటాయి. ఈ మధ్యనే 'ఈగల్' సినిమా చేసాను. అలాంటి సినిమా ఇప్పటివరకూ చేయలేదు. సెట్లో ఒక్కొక్కరు ఒక్కోలా ఎడిట్ చేస్తుంటారు. కెమెరా విభాగాల నుంచి తెలుస్తుంది' అని అన్నారు.