సౌత్ సినీ పరిశ్రమ మొత్తం ఇప్పుడు ఇవే ప్రకంపనలా?
దాని వల్ల పుట్టుకొచ్చిన వేవ్స్ అన్ని వైపులా గట్టు అంచుల్ని తాకే వరకూ ఆగేట్టు లేవు.
నిశ్చలంగా ఉన్న తటాకంలో ఒక రాయి వేస్తే దాని అలలు ఎలా గట్టు వైపు విరుచుకుపడతాయో ఇదివరకే చూసి ఉంటాం. అలలు తటాకం అంచుల వరకూ దూసుకెళ్లి గట్టును తాకాకే కనుమరుగవుతాయి. ఇప్పుడు 'జస్టిస్ హేమ కమిటీ' అనే రాయి టోటల్ గా సౌత్ సినిమా అనే తటాకంలో పడింది. దాని వల్ల పుట్టుకొచ్చిన వేవ్స్ అన్ని వైపులా గట్టు అంచుల్ని తాకే వరకూ ఆగేట్టు లేవు.
ఇది కేవలం మాలీవుడ్ కి చెందిన సమస్య అని లైట్ తీస్కోవడానికి లేదు. మాలీవుడ్ లో పడిన రాయి ఇప్పుడు శాండల్వుడ్, కోలీవుడ్, టాలీవుడ్ లకు కూడా గట్టిగానే తగులుతోంది. అన్ని పరిశ్రమల్లోను ఇప్పుడు మీటూ సెకండ్ వేవ్ మొదలైంది. ఇందులో చాలా పెద్ద తలకాయలు బయటపడుతున్నట్టే కనిపిస్తోంది. ఇప్పటికే మాలీవుడ్ లో పలువరు పెద్ద హీరోల పేర్లు లైంగిక వేధింపుల్లో బయటకు వచ్చాయి. ఇన్నాళ్లు స్థబ్ధుగా ఉన్న నటీమణులు ఇప్పుడు తమకు ఏదో అభయహస్తం అండగా ఉందన్న ధైర్యంతో ముందుకు వస్తున్నారు. మాలీవుడ్ లో అరడజను నటీమణులు కనీసం డజను పైగానే వేధింపుల మాన్ స్టార్ల పేర్లు బయటపెట్టారు.
అటుపై ఇతర సినీపరిశ్రమల్లోను వేధింపుల గురించి నిగ్గు తేలాలనే పంతం కనిపిస్తోంది. అధికారికంగా సినీపరిశ్రమకు పెద్దన్నగా ఉండే ఛాంబర్ల పరిధిలోకి వచ్చేసింది సమస్య. నటీనటుల సంఘాలు, ఫిలింఛాంబర్లు, వాణిజ్య మండలి వంటి వాటిలో పెద్దలు అంతా దీనికి బాధ్యత వహించి త్వరగా సమస్య నుంచి బయటపడాలని భయపడే పరిస్థితి.
కోలీవుడ్ లోను, కన్నడ ఇండస్ట్రీలోను ఇప్పటికే రచ్చ సాగింది. తమిళనాడులోను విశాల్ స్పందించాడు.. పరిశ్రమలో మహిళల సంరక్షణ కోసం ఏదైనా చేయాలనే వాదనను తెరపైకి తెచ్చాడు. దీనికోసం ప్రత్యేకించి కొన్ని కమిటీలు యాక్టివ్ గా ఉన్నాయని కూడా చెప్పే ప్రయత్నం చేసారు. కర్నాటక రాష్ట్ర మహిళా కమీషన్ ఏకంగా కన్నడ సినీపరిశ్రమలోకి ప్రవేశించి , అక్కడ ఛాంబర్ పెద్దలు దీనికి పరిష్కారం ఇవ్వాలని కోరడం సంచలనమైంది. ప్రస్తుతం కన్నడ ఇండస్ట్రీలో వేధింపుల గురించి ప్రత్యేకించి ఒక కమిటీని ఏర్పాటు చేసి ప్రక్షాళన చేసేందుకు ప్రయత్నాలు మొదలయ్యాయి. దీనిపై నిన్న ఛాంబర్ పరిధిలో పెద్దల మధ్య చర్చ కూడా సాగింది.
ఇటు టాలీవుడ్ లోను చివరికి సెగ తాకింది. నటుడు మంచు విష్ణు మూవీ ఆర్టిస్టుల సంఘం అధ్యక్షుడి హోదాలో తెలుగు సినీపరిశ్రమలోను వేధింపులకు పరిష్కారం కావాలని కోరారు. ఇక కొరియోగ్రాఫర్ జానీ మాస్టార్ ఇష్యూ మొదలయ్యాక టాలీవుడ్ లోను రచ్చ పీక్స్ కి చేరుకుంటోంది. జానీ అసిస్టెంట్ తనపై ఫిర్యాదు ఇవ్వడంతో దీనిపై ఫిలింఛాంబర్ వర్గాలు, డ్యాన్స్ డైరెక్టర్స్ అసోసియేషన్ సహా అన్ని వర్గాలు అలెర్టయిపోయాయి. జనసేన పార్టీ కూడా అతడిని దూరం పెడుతూ నోటీస్ ఇచ్చింది. ఇంతలోనే పూనమ్ కౌర్ బయటికి వచ్చి పరిశ్రమ అగ్ర దర్శకుడు త్రివిక్రమ్ పై మాట్లాడటంతో ఈ రచ్చ మరో స్థాయికి చేరుకుంటోంది. త్రివిక్రమ్‌తో మీద గతంలోనే తాను సినీపెద్దలకు ఫిర్యాదు చేసానని, కానీ అప్పుడు పరిష్కరించలేదని పూనమ్ కౌర్ వ్యాఖ్యానించింది. ఇలా ఒకరొకరుగా బయటకు వస్తుంటే టాలీవుడ్ లోను తేనె తుట్ట కదిలినట్టుందే! అంటూ సందేహాలు మొదలయ్యాయి. మెల్లిగా అలలు అలలుగా మీటూ కొత్త వేవ్ సౌతిండియా మొత్తం చుట్టేస్తోంది. ఇది ఎందాకా వెళుతుందోనన్న డౌట్లు ఇంకా అలానే ఉన్నాయి. ముఖ్యంగా నటీమణులపై వేధింపులకు పాల్పడిన మాన్ స్టార్స్ కి కంటిపై కునుకు కరువయ్యే సన్నివేశం ఇప్పుడు వచ్చేసింది.