సోల్ ఆఫ్ సత్య ఫుల్ వీడియో.. హృదయాన్ని హత్తుకునేలా..
సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్.. విరూపాక్ష, బ్రో సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకున్న సంగతి తెలిసిందే
సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్.. విరూపాక్ష, బ్రో సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు సత్య అనే మరో చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. అయితే ఇది థియేటర్ సినిమా కాదు. ఓ మ్యూజికల్ షార్ట్ ఫిల్మ్. అప్పుడప్పుడు సెలబ్రిటీలు సందేశాత్మ షార్ట్ ఫిలిమ్స్ లో నటిస్తారన్న సంగతి తెలిసిందే.
గతంలోనూ సాయి తేజ్ డ్రింక్ చేసి డ్రైవింగ్ చేయొద్దు అనే కాన్సెప్ట్ లో కూడా నటించారు. అలా ఇప్పుడు ఇండిపెండెన్స్ డే సందర్భంగా దేశభక్తి కాన్సెప్ట్ ఉన్న షార్ట్ ఫిల్మ్ లో నటించారు. ఇది లవ్, ఎమోషనల్, దేశభక్తి అంశాలతో రూపొందింది. ఇందులో సాయి ఓ సోల్జర్ గా కనిపించగా.. అతని భార్యగా నటి కలర్స్ స్వాతి కనిపించింది. తాజాగా దీనికి సంబంధించి సోల్ ఆఫ్ సత్య సాంగ్ ను రిలీజ్ చేశారు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.
ఈ మ్యూజికల్ షార్ట్ ఫిల్మ్ ఆద్యంతం మనసుకు హత్తుకునేలా ఉంది. ఓ సైనికుడు తన దేశం కోసం చేసే త్యాగాలను అలాగే మహిళలు త్యాగం చేసే తమ ప్రేమను ఈ షార్ట్ ఫిల్మ్ లో చూపించారు. మొత్తం 6.15 నిమిషాల నిడివి ఉన్న ఈ పాటలో మొదటి మూడు నిమిషాల పాటు ఇద్దరు భార్య భర్తల మధ్య ఉండే ప్రేమానుబంధాన్ని ఎంతో చక్కగా చూపించారు. ఒంటరిగా తన రాకుమారుడి కోసం ఎదురుచూస్తున్న అమ్మాయి(స్వాతి) జీవితంలోకి సాయితేజ్ రావడం, ఇద్దరికి పెళ్లి జరగడం, ఒకరంటే మరొకరు విడిచిపెట్టలేనంత ఉండే చక్కని ప్రేమబంధం వంటి సన్నివేశాల్ని చూపించారు.
ఆ తర్వాత అతడు ఉద్యోగ రీత్యా సైన్యంలోకి తిరిగి వెళ్లడం, ఆపరేషన్ రక్షక్ కుప్వారా అంటూ యుద్ధ పోరాటం చేసి కన్నుమూయడం, అతడిని తలుచుకుంటూ స్వాతి ఒంటరిగా బాధ పడటం, అదే సమయంలో ఓ బిడ్డను జన్మనివ్వడం వంటి సన్నివేశాలతో భావోద్వేగానికి గురి చేశారు. మొత్తంగా ఈ షార్ట్ ఫిల్మ్ ఫీల్ గుడ్ ఎమోషనల్ గా సాగింది.
దేశాన్ని ప్రేమిస్తూ దేశం కోసం పోరాడే గొప్ప యోధులను కని, పెంచడమే కాకుండా.. దేశం కోసం తమ ప్రేమను త్యాగం చేసిన గొప్ప మహిళలందరికీ ఈ పాట అంకితం అంటూ సాంగ్ ను ముగించారు. గాయని శృతి రంజని ఈ లిరిక్స్ రాసి ఆలపించారు. సంగీతాన్ని కూడా అందించారు. ఈ మ్యూజికల్ లిరిక్స్ ఎమోషనల్ సాగుతూ మనసును తాకాయి. నవీన్ విజయ్ కృష్ణ దర్శకత్వం వహించారు. సాంగ్ మధ్య మధ్యలో వచ్చే చిన్న చిన్న డైలాగ్స్ కూడా బాగున్నాయి.