స్టార్ హీరోను చంపేస్తాం.. వార‌సుడిని కూడా.. విచార‌ణ‌లో షాకింగ్ నిజాలు!

వ‌రుసగా స్టార్ హీరోల‌కు హ‌త్యా బెదిరింపులు ఎదుర‌వుతున్నాయి. ఈ కేసుల్లో నిజానిజాలు నిగ్గు తేల్చేందుకు దోషుల‌ను విచారిస్తున్న ముంబై పోలీసుల‌కు షాకింగ్ నిజాలు తెలుస్తున్నాయి

Update: 2024-11-21 17:49 GMT

వ‌రుసగా స్టార్ హీరోల‌కు హ‌త్యా బెదిరింపులు ఎదుర‌వుతున్నాయి. ఈ కేసుల్లో నిజానిజాలు నిగ్గు తేల్చేందుకు దోషుల‌ను విచారిస్తున్న ముంబై పోలీసుల‌కు షాకింగ్ నిజాలు తెలుస్తున్నాయి. తాజా ఇన్వెస్టిగేష‌న్ లో స్టార్ హీరో న‌ట‌వార‌సుడిని టార్గెట్ చేసార‌ని పోలీసులు చెప్ప‌డం భ‌య‌భ్రాంతుల‌కు గురి చేస్తోంది.

సల్మాన్ ఖాన్ కి గ్యాంగ్ స్ట‌ర్ బిష్ణోయ్ హ‌త్యా బెదిరింపుల తర్వాత‌.. కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ కి ఈ త‌ర‌హా బెదిరింపులు ఎదుర‌య్యాయి. ఇటీవ‌ల ఖాన్ నుండి రూ. 50 లక్షలు డిమాండ్ చేస్తూ బాంద్రా పోలీసులకు కాల్ వచ్చింది. దీంతో కేసు న‌మోదు చేసి విచారిస్తున్నారు. తాజా విచారణలో అరెస్టు అయిన నిందితుడు, న్యాయవాది ఫైజాన్ ఖాన్ ఫోన్ డేటా చాలా నిజాల‌ను బ‌హిర్గ‌తం చేసింది. అత‌డు షారుఖ్ ఖాన్ భద్రతా బృందం గురించి సమాచారాన్ని చాలా జాగ్రత్తగా సేకరించాడని ..వారి కదలికలు, దినచర్యలను పరిశీలిస్తూ అతడి కుమారుడు ఆర్యన్ ఖాన్‌ను కూడా లక్ష్యంగా చేసుకున్నాడని పోలీసులు వెల్లడించారు.

జాతీయ మీడియా ప్రకారం.. నిందితులు షారూఖ్ ఖాన్ భద్రతా సిబ్బంది, ఆర్యన్ మూవ్ మెంట్స్ గురించి విస్తృతమైన ఆన్‌లైన్ శోధనల ద్వారా చాలా వ‌ర‌కూ సమాచారాన్ని సేకరించారు. నిందితుడి నుంచి స్వాధీనం చేసుకున్న అదనపు మొబైల్ ఫోన్‌ను విశ్లేషించగా ఈ విషయం వెలుగులోకి వచ్చింది. అత‌డి మొబైల్ ఫోన్‌లో షారూఖ్ భద్రత, అతడి కుమారుడు ఆర్యన్ ఖాన్ కదలికలకు సంబంధించిన శోధనల వివరణాత్మక బ్రౌజింగ్ చరిత్ర ఉందని బాంద్రా పోలీసు అధికారి వెల్లడించారు. అత‌డిని ప్ర‌శ్నించ‌గా ఈ సమాచారాన్ని సేకరించడానికి నమ్మదగిన కారణాన్ని చెప్ప‌డంలో విఫలమయ్యాడు.

నిందితుడు బాంద్రా పోలీస్ స్టేషన్ ల్యాండ్‌లైన్ నంబర్‌ను పొందేందుకు ఒక అప్లికేషన్‌ను ఉపయోగించాడని, ఆ తర్వాత అతడు బెదిరింపు కాల్ చేసాడని పోలీసులు వెల్లడించారు. బెదిరింపు కోసం ఉపయోగించిన మొబైల్ ఫోన్‌ను కాల్ చేయడానికి కొద్ది రోజుల ముందు అక్టోబర్ 30న కొనుగోలు చేసినట్లు దర్యాప్తులో తేలింది.

నిందితుడు ఫైజాన్ ఖాన్ ఫోన్ ని స్వయంగా కొని అందులో తన పాత సిమ్ కార్డును ఉపయోగించాడు. అయితే అత‌డు తెలివిగా నవంబర్ 2 న ఫోన్ దొంగ‌తనానికి గురైంద‌ని చెప్పాడు. కానీ సిమ్ కార్డ్‌ను ఎప్పుడూ డియాక్టివేట్ చేయలేదు. నిజమైన దొంగతనం కేసుల్లో, దొంగిలించిన ఫోన్ లోని సిమ్ కార్డ్ ని వెంట‌నే దొంగ తొల‌గిస్తాడు. త‌ర్వాత‌ త‌న సిమ్ కార్డ్ ను వేస్తాడు.. కానీ అత‌డు అలా చేయ‌లేదు. పైగా నిందితుడు ఫోన్ పోగొట్టుకున్నట్లు పేర్కొన్న తర్వాత అతడి నంబర్‌కు కాల్ చేసి ఫోన్‌ను గుర్తించే ప్రయత్నం చేయలేదు. ఇది మరింత అనుమానాన్ని పెంచింది. దీని ప్రకారం నేరంతో సంబంధం ఉన్న ఫోన్‌ను దాచడానికి నిందితుడు ఉద్దేశపూర్వకంగా ప్ర‌య‌త్నించాడని దర్యాప్తులో తేలింది. ఇదంతా ముందస్తుగా, జాగ్రత్తగా ప్లాన్ చేసార‌ని పరిశోధనలో తేట‌తెల్ల‌మైంది.

7 నవంబర్ 2024న బాంద్రా పోలీస్ స్టేషన్‌కి కాల్ చేసి షారూఖ్ ని చంపేస్తామ‌ని బెదిరించారు. చివరికి ఆ ఫోన్ చేసిన వ్య‌క్తి ఫైజాన్ ఖాన్ అని పోలీసులు కనుగొన్నారు. ముంబై పోలీసులు అతడిని రాయ్‌పూర్ (ఛ‌త్తీష్ ఘ‌డ్) లో అరెస్టు చేసి తదుపరి విచారణ కోసం ట్రాన్సిట్ రిమాండ్‌కు తరలించారు. కోర్టులో ఫైజాన్ ఖాన్ డిఫెన్స్ బృందం సంఘటనకు ముందు అతడి ఫోన్ దొంగ‌త‌నానికి గురైంద‌ని పేర్కొంది. కాల్ అతడిని తప్పుగా ఇరికించే కుట్రలో భాగమని సూచించింది. కానీ కోర్టు విచార‌ణ‌లో నిజానిజాలు నిగ్గు తేలాల్సి ఉంది.

Tags:    

Similar News