స్నేహం కోసం ఈ ముగ్గురు సూపర్ స్టార్ల కలయిక!
ప్రముఖ స్టార్ సన్ వారసుడి డెబ్యూ దర్శకత్వంలో ముగ్గురు స్టారాధిస్టార్లు నటించేందుకు అంగీకరించారు.
ఒకరు కాదు.. ఇద్దరు కాదు.. ముగ్గురు సూపర్ స్టార్లు ఒకే షోలో నటిస్తున్నారు. అది కూడా స్నేహం కోసం.. ఇచ్చిన మాట కోసం. ప్రముఖ స్టార్ సన్ వారసుడి డెబ్యూ దర్శకత్వంలో ముగ్గురు స్టారాధిస్టార్లు నటించేందుకు అంగీకరించారు.
ఇదంతా కింగ్ ఖాన్ షారూఖ్ వారసుడు ఆర్యన్ ఖాన్ ప్రారంభ దర్శకత్వ వెంచర్ కోసం ప్రణాళిక. తొలిగా షారూక్ తనయుడి వెబ్ సిరీస్ కోసం అంగీకరించారు. ఆ తర్వాత అతిథి పాత్రల కోసం రణబీర్, సల్మాన్ కూడా ఓకే చెప్పారు. స్టార్ డమ్ అనే టైటిల్ కి తగ్గట్టుగా ఆర్యన్ ఖాన్ బాలీవుడ్ స్టార్ హీరోలందరినీ ఒకే వేదికపైకి తెచ్చేయడం ఉత్కంఠను కలిగిస్తోంది. 6-ఎపిసోడ్ సిరీస్ కోసం బయటి హీరోల్లో తొలిగా రణబీర్ ఓకే చెప్పగా ఇంతలోనే సల్మాన్ కూడా ఓకే చెప్పారన్న టాక్ వినపిస్తోంది.
న్యూస్ 18 సమాచారం మేరకు.. ఆర్యన్ తన సిరీస్‌లోని ఒక ఎపిసోడ్ కోసం సల్మాన్ ఖాన్‌ను ఎంపిక చేసుకున్నాడు. ఇప్పటికే తన పార్ట్ చిత్రీకరణను ముగించాడు. ఇద్దరు సూపర్‌స్టార్‌లు షోలో స్క్రీన్ స్పేస్‌ను షేర్ చేసుకోకపోయినా కానీ, షారూఖ్ కొడుకు డెబ్యూ ప్రాజెక్ట్‌లో సహకరించడం అభిమానులకు కచ్చితంగా ట్రీట్ గా మారనుంది. రణబీర్ ఎప్పటికీ షారూఖ్ కి అత్యంత సన్నిహితుడు. అందువల్ల అతడు అంగీకరించడానికి ఎక్కువ సమయం పట్టలేదు.
షారుఖ్ ఖాన్ - సల్మాన్ ఖాన్ పరిశ్రమలో చాలా కాలంగా అత్యంత సన్నిహితులు. మంచి చెడులలో ఎల్లప్పుడూ ఒకరికొకరు అండగా నిలుస్తున్నారు. ఇప్పుడు షారూఖ్ బిడ్డ షోబిజ్‌లో మొదటి అడుగులు వేస్తున్నప్పుడు సల్మాన్ అతడికి నిజమైన స్నేహితుడిలా బ్యాకప్ అందిస్తున్నాడు. సల్మాన్‌కు స్టార్‌డమ్‌లో అతిధి పాత్రను ఆఫర్ చేసినప్పుడు రెండో ఆలోచన లేకుండా ఓకే చెప్పారని తెలిసింది. షారుఖ్ కుటుంబంతో సల్మాన్ గొప్ప బంధం కలిగి ఉన్నారు. కాబట్టి ఆర్యన్‌కి అవును అని చెప్పడానికి ఎక్కువ సమయం పట్టలేదు.
1995లో వచ్చిన రాకేష్ రోషన్ `కరణ్ అర్జున్` చిత్రంలో సల్మాన్ - SRK కలిసి స్క్రీన్‌ను షేర్ చేసుకున్నారు. కరణ్ అర్జున్ తర్వాత కుచ్ కుచ్ హోతా హై, హమ్ తుమ్హారే హై సనమ్ వంటి చిత్రాలలో ఒకరితో ఒకరు కలిసి కనిపించారు. అటుపై కొన్ని విభేధాల అనంతరం షారుఖ్, సల్మాన్ మళ్లీ కలిసారు. సల్మాన్ చిత్రం ట్యూబ్‌లైట్‌లో షారూఖ్ అతిథిగా కనిపించాడు. ఆ తర్వాత షారూఖ్ జీరో సాంగ్ ఇస్సాక్ బాజీలో సల్మాన్ కనిపించాడు. ఆ తర్వాత ఆ ఇద్దరూ పఠాన్, టైగర్ 3లో రోరింగ్ క్రాస్ ఓవర్లలో అతిథులుగా చేసారు. తదుపరి పఠాన్ వర్సెస్ టైగర్ చిత్రంలో సల్మాన్ - షారూఖ్ కలిసి నటించనున్నారు.
కిల్ ఫేమ్ లక్ష్య, మోనా సింగ్ కీలక పాత్రలు పోషిస్తున్న `స్టార్‌డమ్`లో షారుఖ్ ఖాన్, రణబీర్ కపూర్, కరణ్ జోహార్, రణవీర్ సింగ్, బాబీ డియోల్, బాద్షా సహా చాలామంది అతిధి పాత్రలు పోషిస్తున్నారు. SRK కి చెందిన రెడ్ చిల్లీస్ ప్రొడక్షన్ నిర్మిస్తున్న ఈ సిరీస్ ప్లాట్ గురించి అంతగా వివరాలు బయటకు రాలేదు.