ఖోఖో ప్రపంచ కప్ 2025 బ్రాండ్ అంబాసిడర్
జనవరి 13 నుంచి న్యూఢిల్లీలో జరగనున్న ఖోఖో ప్రపంచకప్ 2025కి కో బ్రాండ్ అంబాసిడర్‌గా బాలీవుడ్ స్టార్‌హీరో టైగర్ ష్రాఫ్‌ను ఖోఖో ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (కెకెఎఫ్‌ఐ) నియమించింది.
బాలీవుడ్ ఫిటెస్ట్ హీరోల్లో టైగర్ ష్రాప్ ఎప్పుడూ అత్యున్నత స్థానంలో ఉంటాడు. హృతిక్ రోషన్ తర్వాత మళ్లీ ఆ స్థాయిలో ఫిట్ బాడీతో అతడు ఆకర్షిస్తుంటాడు. ఇప్పుడు అతడి రూపం, ఫిట్నెస్‌కి తగ్గట్టుగా పదవీ బాధ్యత అతడిని వరించింది. జనవరి 13 నుంచి న్యూఢిల్లీలో జరగనున్న ఖోఖో ప్రపంచకప్ 2025కి కో బ్రాండ్ అంబాసిడర్‌గా బాలీవుడ్ స్టార్‌హీరో టైగర్ ష్రాఫ్‌ను ఖోఖో ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (కెకెఎఫ్‌ఐ) నియమించింది. ఈ చారిత్రాత్మక టోర్నమెంట్ భారతదేశ ప్రతిష్టాత్మకమైన క్రీడను ప్రపంచ ప్రేక్షకుల్లో అవేర్ నెస్ పెంచుతుందని అసోసియేషన్ గురువారం ఒక పత్రికా ప్రకటనలో వెల్లడించింది.
ఫిట్‌నెస్ ఫ్రీక్ టైగర్ ష్రాఫ్ ఖోఖో బ్రాండ్ అంబాసిడర్ గా గౌరవప్రదమైన అవకాశాన్ని అందుకున్నాడు. ఈ సందర్భంగా యువతరంలో ఆరోగ్యకరమైన జీవనశైలిని పెంపొందించడంలో క్రీడల పాత్రను టైగర్ నొక్కి చెప్పారు. ఎవరి జీవితంలోనైనా ఫిట్‌నెస్ అంతిమ లక్ష్యం కావాలి. దానిని సాధించడానికి క్రీడలు గొప్ప మార్గం. ఖోఖో అనేది ఫిట్‌నెస్.. స్ట్రాటజీ .. స్పిరిట్‌ల సంపూర్ణ సమ్మేళనం. ఖోఖో క్రీడ ఆడాలని ప్రజలను ప్రేరేపించాలని నేను ఆశిస్తున్నాను``అని అన్నాడు. గ్రామీణ భారతదేశంలో ఫిట్‌నెస్‌ను కాపాడుకోవడంలో సాంప్రదాయ క్రీడల పాత్రను టైగర్ హైలైట్ చేశారు. ఈ క్రీడ శక్తి, చురుకుదనం , వేగానికి ఉదాహరణ. అటువంటి ప్రతిష్టాత్మక వేదికపై ఖోఖోకు ప్రాతినిధ్యం వహించడం ఈ ఆట గొప్ప వారసత్వాన్ని ప్రపంచవ్యాప్తంగా ప్రచారం చేసే అవకాశం ఇచ్చినందుకు నేను సంతోషిస్తున్నాను అన్నారు.
ఖో-ఖో ప్రపంచ కప్ 24 దేశాల నుండి 21 పురుషులు.. 20 మహిళల జట్లతో వారం రోజుల పాటు కాంపిటీషన్ జరగనుంది. ఐకానిక్ ఇందిరాగాంధీ ఇండోర్ స్టేడియంలో జరుగుతున్న ఈ టోర్నమెంట్ పురుషులు -మహిళలు ఇద్దరికీ సమాన ప్రాతినిధ్యాన్ని అందించడం లక్ష్యంగా పెట్టుకుంది. కెకెఎఫ్ఐ ప్రెసిడెంట్ సుధాన్షు మిట్టల్ టైగర్ ష్రాఫ్ సహకారానికి కృతజ్ఞతలు తెలిపారు. సల్మాన్ ఖాన్, టైగర్ ష్రాఫ్ బ్రాండ్ అంబాసిడర్‌లుగా ఉన్నందున ఖో-ఖో ప్రపంచ కప్ ఒక ప్రత్యేక ఈవెంట్‌గా రక్తి కట్టిస్తుందని, ప్రపంచ ప్రేక్షకులను ఆకర్షిస్తుందని భరోసా ఉంది. ఖోఖో ప్రపంచ కప్‌కు అనన్య పాండే, సారా అలీ ఖాన్ , అభినవ్ బింద్రా తదితరులు ప్రచార సాయం అందిస్తున్నారు.