సినిమా ప్లాప్ అయినా హీరో దగ్గరకెళ్లి హిట్ అని చెబుతారా!
తాజాగా తమిళ డిస్ట్రిబ్యూటర్ తిరుపూర్ సుబ్రమణియన్ ఓ సంచలన ఆరోపణతో తెర మీదకు వచ్చారు.
సినిమా బిజినెస్ లో నిర్మాతలు రకరకాల స్ట్రాటజీతో ముందుకెళ్తుంటారు. హీరో స్థాయిని బట్టి ఇక్కడ స్ట్రాటజీ మారుతుంటుంది. అందితే జుట్టు..అందకపోతే కాళ్లు అన్నట్లే సన్నివేశం కనిపిస్తుంది. నిర్మాత లేకపోతే సినిమా లేదు అని దర్శకరత్న దాసరి నారాయణరావు వేదికలపై ఉచ్చరించిన సందర్భాలెన్నో . ఇండస్ట్రీలో కళాకారులు బాగుండా లంటే నిర్మాత బాగుండాలని అప్పుడే నాలుగు సినిమాలు ప్రేక్షకుల ముందుకు తేగలం అని చెప్పేవారు.
నిర్మాత లేకపోతే సినిమా లేదు, హీరో లేడు, డైరెక్టర్ లేడు, టెక్నీషియన్ లేడు అని ప్రతీ సందర్భంలో నిర్మాత విలువను చాటి చెప్పేవారు. అలాంటి నిర్మాతలకు తర్వాత కాలంలో విలువ తగ్గిందని...హీరోల కాళ్లకు నిర్మాతలు పొర్లు దండాలు పెట్టి తమ విలువను తామే తగ్గించుకుంటున్నారని.. ఈ విధానం మారలని నిర్మాతల పట్ల హీరోలు గౌర వంగా మసులుకోవాలని హెచ్చరించిన సందర్భాలున్నాయి. కానీ అవి అక్కడికే పరిమితయ్యాయి తప్ప నిర్మాత-హీరోల్లో ఎలాంటి మార్పులు రాలేదు. తాజాగా తమిళ డిస్ట్రిబ్యూటర్ తిరుపూర్ సుబ్రమణియన్ ఓ సంచలన ఆరోపణతో తెర మీదకు వచ్చారు.
`రజనీకాంత్ నటించిన వెట్టేయాన్ ప్లాప్ అయింది. కానీ లైకా ప్రొడక్షన్స్ హీరోని సంతృస్తి పరచాలని ఈ విషయాన్ని ఎక్కడా రివీల్ చేయలేదు. హిట్ అనే చెప్పుకున్నారు. అంతకు ముందు `కబాలి` సినిమాకి కూడా భారీ నష్టాలు వచ్చాయి. కానీ ఆ నష్టాలను నిర్మాతల కలైపులి ఎస్ థాను నకిలీ పోస్టర్లతో నష్టాలను దాచేసారు. నష్టాలకు సంబంధించిన రుజువుతో నేను వారిని ఎదుర్కున్నప్పుడు రజనీకాంత్ నాతో మాట్లాడటం మానేసారని ఆరోపించారు.
`జైలర్` భారీ విజయం సాధించింది. వెట్టయాన్ ప్లాప్ అయింది. ఆ రెండు సినిమాలకు రజనీకాంత్ తన పూర్తి పారితోషికం తీసుకున్నారు. ఇది చాలా మంది నిర్మాతలు భారీ నష్టాలను ఎదుర్కోవడానికి ఓ కారణం. నిర్మాత లంతా హీరోలను రాయల్టీగా చూస్తారు. బాక్సాఫీస్ వద్ద సాధించిన వసూళ్లకు... వాస్తవ వసూళ్లకు చాలా తేడా ఉంటుంది. నష్టం వచ్చినా లాభాలొచ్చాయని చెబుతారు. తప్పుడు పోస్టర్లు వేసి ప్రచారం చేయిస్తారు.
చాలా సందర్భాల్లో నష్టాలను నటీనటులకు తెలియకుండా జాగ్రత్త పడతారు. ఈ విషయాలు కొంత మంది హీరో లకు తెలిసినా వాటిని పట్టించుకునే పరిస్థితి ఉండదు` అన్నారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి. దీంతో సోషల్ మీడియాలో వాడివేడి చర్చ నడుస్తోంది.