టాలీవుడ్ లో డిజాస్టర్స్ ట్రెండ్!

తెలుగు సినిమా గత పదిహేనేళ్లలో ఎంతగానో మారిపోయింది. ముఖ్యంగా బాహుబలి అనంతరం పాన్ ఇండియా సినిమాలకు అసలు దారి దొరికింది.

Update: 2025-01-29 09:41 GMT

తెలుగు సినిమా గత పదిహేనేళ్లలో ఎంతగానో మారిపోయింది. ముఖ్యంగా బాహుబలి అనంతరం పాన్ ఇండియా సినిమాలకు అసలు దారి దొరికింది. ఇక మిగతా ఇండస్ట్రీలు కూడా టాలీవుడ్ ట్రెండ్ ను ఫాలో అయ్యే స్థాయికి చేరింది. ఒకప్పుడు 50 కోట్ల షేర్ కలెక్ట్ చేసిన సినిమాలకు గర్వంగా చూసే పరిస్థితి ఉండేది. ఆ తర్వాత 100 కోట్లు అందుకున్న సినిమాలు ప్రత్యేకంగా చర్చనీయాంశమయ్యాయి.

ఇక బహుబలి, పుష్ప లాంటి సినిమాలతో 500 కోట్లు, 1000, 1500 కోట్లు, 2000 కోట్ల గ్రాస్ చేసిన సినిమాలు కూడా వచ్చేశాయి. కానీ ఇప్పుడు మరో ట్రెండ్ మొదలైంది. భారీ నష్టాలు చూసిన సినిమాల జాబితా కూడా ఎక్కువవుతోంది. కంటెంట్ లోపం, అధిక బడ్జెట్ అనే రెండు కారణాలతో భారీ బడ్జెట్ సినిమాలు ఊహించని విధంగా ఫ్లాప్ అవుతున్నాయి.

ఇటీవల కాలంలో తెలుగు ఇండస్ట్రీలో భారీ నష్టాల బారిన పడిన చిత్రాల్లో గేమ్ చేంజర్, రాధేశ్యామ్, ఆచార్య టాప్ ప్లేస్ లో ఉన్నాయి. గేమ్ చేంజర్ మొదట్లోనే భారీ అంచనాలు క్తియేట్ చేసిన సినిమా. రామ్ చరణ్, శంకర్ కాంబినేషన్, దిల్ రాజు బ్రాండ్, భారీ బడ్జెట్.. అన్నీ ఉన్నా సినిమా బాక్సాఫీస్ దగ్గర ఘోరంగా విఫలమైంది. ట్రేడ్ వర్గాల లెక్కల ప్రకారం, ఈ సినిమా నిర్మాతకు 100 కోట్లకు పైగా నష్టాలను మిగిల్చిందని చెబుతున్నారు.

రాధేశ్యామ్ విషయంలోనూ ఇదే పరిస్థితి. ప్రభాస్ పాన్ ఇండియా హిట్ హీరోగా కొనసాగుతున్న సమయంలో, రాధేశ్యామ్ లాంటి ఫీల్ గుడ్ లవ్ స్టోరీ పాన్ ఇండియా రేంజ్ లో క్లిక్ అవుతుందనుకున్నారు. కానీ సినిమా కథ, కథనం ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేదు. దీంతో భారీ బడ్జెట్ పెట్టిన ప్రొడ్యూసర్లు 120 కోట్లకు పైగా నష్టాల్లో పడ్డారు. ఇది ప్రభాస్ స్థాయిలో ఊహించని ఫలితంగా మారింది.

ఆచార్య కూడా పెద్ద అంచనాలతో వచ్చిన సినిమా. మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్ కలిసి నటించడమే కాకుండా, కొరటాల శివ దర్శకత్వం వహించడంతో సినిమా బిగ్గెస్ట్ హిట్ అవుతుందని అందరూ భావించారు. కానీ బాక్సాఫీస్ దగ్గర అంచనాలకు పూర్తిగా భిన్నంగా నడిచింది. కంటెంట్ మిస్ ఫైర్ అవ్వడంతో పాటు, సినిమా ప్రీ రిలీజ్ హైప్ కూడా పెద్దగా ఉపయోగపడలేదు. ఫలితంగా 150 కోట్లకు పైగా నష్టాలను మిగిల్చిన మరో పెద్ద ఫ్లాప్ గా నిలిచింది.

ఈ స్థాయిలో పెద్ద సినిమాలు నష్టాలను మూటగట్టుకోవడం వల్ల ఇండస్ట్రీలో చాలా మార్పులు వస్తున్నాయి. నిర్మాణ వ్యయాలు గణనీయంగా పెరిగిపోయాయి. కథలకు అంతగా ప్రాధాన్యత ఇవ్వకుండా, గ్రాండ్ విజువల్స్, స్టార్స్ మీదే ఆధారపడితే ఫలితం ఇలా ఉంటుందనే విషయం నిరూపితమైంది. ఇప్పటికే నిర్మాతలు ఈ విషయంలో ఆలోచనలో పడ్డారు. ప్రస్తుతం కొత్తగా రాబోయే సినిమాల్లో మరిన్ని భారీ బడ్జెట్ చిత్రాలు లైన్ లో ఉన్నాయి. కానీ కథ, కథనం, కమర్షియల్ హైప్లో బ్యాలెన్స్ లేకపోతే మరిన్ని సినిమాలు నష్టాల లిస్టులో చేరే అవకాశముంది. ఇక ముందు ముందు టాలీవుడ్ ట్రెండ్ ఎలా మారుతుందో చూడాలి.

Tags:    

Similar News