టాలీవుడ్.. ఈ వీక్ బాక్సాఫీస్ టోటల్ డల్!
ప్రతి శుక్రవారం అనేక సినిమాలు రిలీజ్ అవుతాయన్న విషయం తెలిసిందే. దాదాపు గురు, శుక్రవారాల్లో ఆయా చిత్రాలు విడుదల అవుతాయి.;

ప్రతి శుక్రవారం అనేక సినిమాలు రిలీజ్ అవుతాయన్న విషయం తెలిసిందే. దాదాపు గురు, శుక్రవారాల్లో ఆయా చిత్రాలు విడుదల అవుతాయి. అలా ఈ వారం కూడా కొన్ని మూవీస్ థియేటర్లలో విడుదల అయ్యాయి. పెద్ద సినిమాల సందడి లేకపోయినా.. పలు చిన్న మూవీలు ఏప్రిల్ మొదటి వారంలో ప్రేక్షకుల ముందుకు వచ్చాయి.
లైఫ్ (లవ్ యువర్ ఫాదర్), రామ్ గోపాల్ వర్మ శారీతోపాటు 28 డిగ్రీ సెల్సియస్ వంటి వివిధ చిన్న బడ్జెట్ చిత్రాలు.. రిలీజ్ అయ్యాయి. వాటితో పాటు 34 ఏళ్ల తర్వాత నందమూరి బాలకృష్ణ క్లాసిక్ హిట్ ఆదిత్య 369, 17 సంవత్సరాల తర్వాత ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఆర్య 2.. మరోసారి థియేటర్లలో సందడి చేశాయి.
ఇక ఆయా సినిమాల వసూళ్ల విషయానికొస్తే.. అప్పట్లో ఆదిత్య 369 మూవీ ఎలాంటి హిట్ అయిందో అందరికీ తెలిసిందే. ఇప్పుడు రీ రిలీజ్ టైమ్ లో మంచి హైప్ క్రియేట్ అయింది. నెవ్వర్ బిఫోర్ అనేలా మేకర్స్.. ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించారు. ఆ వేడుకకు బాలకృష్ణ సహా పలువురు హాజరయ్యారు. ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.
దీంతో రీ రిలీజ్ లో ఆదిత్య 369కు భారీ వసూళ్లు వస్తాయని అంచనాలు వెలువడ్డాయి. కానీ సీన్ రివర్స్ అయింది. కలెక్షన్ల విషయంలో నిరాశ ఎదురైంది. ఒక్కో షోకు కొన్ని దగ్గర్ల 40 మంది ఆడియన్స్ అయినా రాలేదట. దీంతో సినిమాను 4కే వెర్షన్ గా మార్చడానికి పెట్టిన ఖర్చు కూడా రాలేదని సోషల్ మీడియాలో గుసగుసలు వినిపిస్తున్నాయి.
అదే సమయంలో ఆర్య 2 కాస్త మెరుగ్గా ఆడిందనే చెప్పాలి. హైదరాబాద్ లోని కొన్ని చోట్ల మోస్తరు వసూళ్లు వచ్చినట్లు తెలుస్తోంది. ఆదిత్య 369 కంటే మెరుగైన ప్రదర్శన ఇచ్చినప్పటికీ.. రీసెంట్ గా రీ రిలీజ్ అయిన ఇతర స్టార్ హీరోల సినిమాల్లా మాత్రం ఆర్య 2 సక్సెస్ అవ్వలేదు. ఆ సినిమాల్లాగా భారీ వసూళ్లను కూడా సాధించలేదు.
మరోవైపు, రామ్ గోపాల్ వర్మ శారీ మూవీ.. 10% ఓపెనింగ్ కూడా సాధించలేకపోయింది. ఆయన ఫ్లాపుల జాబితాలో మరో సినిమా చేరింది. మిగతా చిన్న చిత్రాలు కూడా ఫ్లాపులుగా నిలిచాయి. దీంతో ఈ శుక్రవారం.. టాలీవుడ్ లో ఫ్లాప్ ఫ్రైడేగా నిలిచింది. ఏ సినిమా కూడా అనుకున్నంత స్థాయిలో వసూళ్లు సాధించలేకపోయింది. మరి వచ్చే వారం ఎలా ఉంటుందో చూడాలి.